టీచర్లకు అండగా టీడీపీ ఉంటుంది: నారా లోకేష్
టీచర్లకు అండగా టీడీపీ ఉంటుంది: నారా లోకేష్
టీచర్లకు అండగా టీడీపీ ఉంటుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. యువగళం పేరుతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తోన్న పాదయాత్రలో 32వ రోజున లోకేష్ ను నోబుల్ టీచర్స్ ప్రతినిధులు కలిసి తమ సమస్యలను విన్నవించారు. సీపీఎస్ రద్దు విషయంలో మాట తప్పారని, ప్రాథమిక విద్య రెండు సంవత్సరాలకు, మాధ్యమిక విద్య మూడు సంవత్సరాలకు కుదించారని, దీనివల్ల విద్యాప్రమాణాలు దెబ్బతినే ప్రమాదముందంటూ ఆందోళన వెలిబుచ్చారు. ఇంతవరకు డీఎస్సీ నిర్వహించలేదని, ఒక కిలోమీటరు దూరంలోపు ఉన్న పాఠశాలలను విలీనం చేయడంవల్ల మారుమూల గ్రామాల్లోని పేద విద్యార్థులకు విద్య దూరమయ్యే ప్రమాదముందన్నారు. 10 మంది విద్యార్థులకన్నా తక్కువ ఉన్న 1500 పాఠశాలలను నేడో, రేపో మూసేయాలని ప్రయత్నిస్తున్నారని వివరించారు.
గురువులను దొంగలుగా చిత్రీకరిస్తున్నారు.
రాష్ట్రం ప్రభుత్వ ఉపాధ్యాయులను వేధించడమే పనిగా పెట్టుకుందని, డిమాండ్ల సాధన కోసం పోరాడుతుంటే వారిపై కేసులు బనాయించడం నియంతృత్వ పోకకడలకు నిదర్శనమని చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తి నిలదీసేవారిని రకరకాలుగా వేధించడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. భావి భారత పౌరులను తయారుచేసే గురువులను దొంగలుగా చిత్రీకరిస్తూ తప్పుడు కేసులు బనాయించడం చాలా దారుణమని నారా లోకేష్ మండిపడ్డారు. తన చరిత్రలో మద్యం దుకాణాలవద్ద ప్రభుత్వ టీచర్లను కాపలాగా పెట్టిన పనికిమాలిన ప్రభుత్వాన్ని తాను ఎన్నడూ చూడలేదన్నారు.
టీచర్లకు అండగా టీడీపీ ఉంటుంది
హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఉపాధ్యాయులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై పెట్టిన కేసులను పూర్తిగా ఎత్తివేస్తామని, వారి న్యాయబద్ధమైన డిమాండ్లను కచ్చితంగా నెరవేరుస్తామన్నారు. వారిపై టీడీపీ ప్రభుత్వ అనవసర వేధింపులు, కక్ష సాధింపుల్లాంటివి ఉండవన్నారు. టీచర్ల సేవలను సమర్థవంతంగా వినియోగించుకొని మెరుగైన విద్యా ప్రమాణాలను నెలకొల్పుతామన్నారు.