16, మార్చి 2024, శనివారం

తిరుపతిలో తెలుగు తమ్ముళ్ళ తిరుగుబాటు !


తెలుగుదేశం పార్టీ అధిష్టానం వైఖరికి నిరసనగా తిరుపతిలో తెలుగు తమ్ముళ్లలో తిరుగుబాటు ప్రారంభమైంది. ఈ విషయాన్ని గమనించిన అధిష్టానం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులకు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసినా, కుదరలేదు. నేతలు అలకపాన్పు ఎక్కారు. అధిష్టానం మాటలను ఖాతరు  చేయడం లేదు. తిరుగుబాటు బావుటా ఎగరవేస్తున్నారు. అవసరమైతే ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తిరుపతి సీటును జనసేనకు కేటాయించడాన్ని తిరుపతి నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో అధిష్టానంతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇందుకోసం రహస్య సమావేశాలు, మంతనాలు జోరుగా జరుగుతున్నాయి. త్వరలోనే తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు నేతలు కార్యచరణ ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉంది. అధిష్టానం ఆదేశాలను బేఖాతరు చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు సమాచారం.


గత ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీలో వైసిపికి, టిడిపికి హోరాహోరి పోరు జరిగింది. ఒక దశలో టిడిపి అభ్యర్థి సుగుణమ్మ గెలిచిపోయిందన్న వార్తల కూడా వచ్చాయి. అయితే రాష్ట్రం మొత్తం మీద వైసిపి అభ్యర్థులు గెలవడంతో సుగుణమ్మను భయపెట్టి వైసిపి వాళ్లు ఏకపక్షంగా డిక్లేర్ చేసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. నిజానికి తిరుపతి ఎన్నికల్లో సుగుణమ్మ గెలిచారని ఇప్పటికీ టిడిపి నాయకులు భావిస్తున్నారు. అయితే అధికార బలంతో పోస్టల్ బ్యాలెట్ లను తారుమారు చేయడం కారణంగా భూమన కరుణాకర్ రెడ్డి గెలిచినట్లు ప్రకటించాలని చెబుతున్నారు. ఎన్నికల్లో కేవలం 708 ఓట్ల తేడాతో సుగుణమ్మ ఓడిపోయినట్లు రికార్డులలో చూపించారు. తిరుపతి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే, మాజీ టిటిడి బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తికి 12 వేల ఓట్లు వచ్చాయి. జనసేన పోటీ చేయకుండా ఉంటే ఆ ఓట్లు కూడా టిడిపికి పడేవని భావిస్తున్నారు. దీంతో 12000 మెజార్టీతో సుగుణమ్మ గెలుపు అవకాశముండేదని భావిస్తున్నారు. జిల్లాలో అత్యంత స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన తిరుపతి సీటును, ప్రస్తుతం గెలిచే అవకాశం ఉన్న సీటును జనసేనకు కేటాయించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులకు నచ్చడం లేదు. 


తిరుపతి అసెంబ్లీ టికెట్లును ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతోపాటు తుడా మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మబ్బు రామిరెడ్డి కుమారుడు మబ్బు దేవనారాయణరెడ్డి,  ఊకా విజయ్ కుమార్, తిరుపతికి చెందిన సీనియర్ నేత సురా సుధాకర్ రెడ్డి తదితరులు ఆశించారు. ఊహించని విధంగా ఈ టికెట్ జనసేనకి ఇవ్వడం, జనసేన దీనిని చిత్తూరు శాసనసభ్యుడు జంగాలపల్లి శ్రీనివాసులు ఇవ్వడం జన్మించుకోలేకపోతున్నారు. దీంతో సుగుణమ్మ, మబ్బు దేవనారాయణ రెడ్డి, ఊకా విజయ్ కుమార్లు కార్యాచరణ ప్రణాళిక మీద రహస్య సమావేశాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ అవసరమైతే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం తెదేపా శ్రేణులను కూడగడుతున్నారు. తిరుపతిలో ఏకైక టీడీపీ కార్పొరేటర్ ఆర్ సి ముని సిద్దయ్య  కూడా వీరికి అండగా నిలుస్తున్నట్లు సమాచారం.

తిరుపతిలో జంగాలపల్లి శ్రీనివాసులకు వ్యతిరేకంగా వరుస సంఘటనలు జరుగుతున్నాయి. జంగాలపల్లి గో బ్యాక్ అంటూ పోస్టర్ల వేలిచాయి. శుక్రవారం ప్రచార కార్యక్రమంలో భాగంగా వైసిపి అభ్యర్థి భూమన అభినయ రెడ్డి, జనసేన అభ్యర్థి అరణి శ్రీనివాసులు పరస్పరం కలుసుకున్నారు. చిరునవ్వుతో నమస్కారం, ప్రతి నమస్కారం చేసుకున్నారు. ఈ విషయాన్ని కూడా పోస్టర్లకు ఎక్కించారు. తిరుపతిలో కరుణాకర్ రెడ్డి చక్రం తిప్పి బలహీనమైన అభ్యర్థి అయిన జంగాలపల్లి శ్రీనివాసులు టికెట్ ఇప్పించాలని పోస్టర్లు వెలిశాయి. తిరుపతిలో వైసీపీ X వైసిపి పోటీ జరుగుతోందని, ఎన్నికలలో టిడిపి, జనసేన లేదనే ప్రచారం జోరుగా నడుస్తోంది. శుక్రవారం జనసేన పార్టీకి చెందిన కొందరు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అధిష్టానం మందలించడంతో వాయిదా వేసినట్లు తెలుస్తోంది.


తెదేపాలో  మాత్రం అసమ్మతి జ్యాలలు రగులుతున్నాయి. పార్టీ అభ్యర్థిని మార్చే వరకు విశ్రవించేది లేదని చెబుతున్నారు. వీరు జంగాలపల్లి శ్రీనివాసులకు వ్యతిరేకం కాకున్నా, స్థానికేతరులకు టికెట్ ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. జంగాలపల్లి శ్రీనివాసులు అభ్యర్థి అయితే అభినయ రెడ్డికి తిరుగులేదని, ఈజీగా గెలుస్తారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా తిరుపతిలో సైకిల్ గుర్తు లేకుండా జరుగుతున్న ఎన్నికలను ఊహించలేకపోతున్నారు. భవిష్యత్తులో తెలుగుదేశం క్యాడర్ చల్లాచెదురై, ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *