జనసేన గూటికి జంగాలపల్లి ?
అధికార పార్టీకి చెందిన చిత్తూరు శాసనసభ్యుడు జంగాలపల్లి శ్రీనివాసులు జనసేన పార్టీలో చేరనున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఇందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయన జనసేన నాయకులతో టచ్ లో ఉన్నారు. జనసేన నాయకులకు కూడా జంగాలపల్లి చేరికను ఆమోదించినట్లు తెలుస్తుంది. ముహూర్తం ఖరారు కాకున్నా, తొందర్లోనే జంగాలపల్లి శ్రీనివాసులు జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరానున్నారని తెలుస్తోంది. అవమానాలు సహిస్తూ అధికార పార్టీలో ఉండటం కన్నా పార్టీ మారడమే మేలని సన్నిహితులు జంగాలపల్లికి చెప్పినట్లు సమాచారం. అన్ని విషయాలను ఆలోచించుకున్న జంగాలపల్లి శ్రీనివాసులు కూడా ఎందుకు సై అన్నట్లు సమాచారం.
జంగాలపల్లి శ్రీనివాసులు తెలుగు తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగ్రేటం చేశారు. ఆయన యాదమరి జడ్పిటిసి మెంబర్ గా, జిల్లా పరిషత్ విప్ గా పనిచేశారు. తెదేపా జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైసీపీలో చేరి జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. గత ఎన్నికల్లో చిత్తూరు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఐదు సంవత్సరాలు పాటు పార్టీ ఆదేశాలను శిరసావహించి పార్టీ కార్యక్రమాలలో ముమ్మరంగా పాల్గొన్నారు. చిత్తూరులో జరిగిన బీసీ సాధికారతా బస్సు యాత్రలో రానున్న ఎన్నికలలో జంగాలపల్లి శ్రీనివాసులకు తిరిగి చిత్తూరు ఎమ్మెల్యే టికెట్టును కేటాయిస్తున్నట్లు మంత్రులు ప్రకటించారు. అయితే వెంటనే ఆర్టీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్న విజయానంద రెడ్డి మంత్రుల ప్రకటన ఖండించారు. అభ్యర్థులను ప్రకటించే అధికారం ముఖ్యమంత్రికి తప్ప వేరే ఎవరికీ లేదన్నా.రు దీంతో పార్టీలో తర్జనభర్జనలు జరిగాయి. చిత్తూరు ఎమ్మెల్యే టికెట్టు విజయానందరెడ్డిని వరించింది. దీంతో బలిజ సామాజిక వర్గం రాయలసీమలో తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆందోళనకు పిలుపునిచ్చారు. వారిని సమాధానపరుస్తూ జంగాలపల్లి శ్రీనివాసులు రాజ్యసభ అభ్యర్థిగా వైసిపి అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అయితే కొద్దిరోజులకే రాజ్యసభ సభ్యుల జాబితాలో మార్పులు చోటు చేసుకుంది. జంగాలపల్లి శ్రీనివాసులు కాకుండా మరో వ్యక్తికి రాజ్యసభ సీటును కేటాయించారు. ఆనాటి నుంచి జంగాలపల్లి శ్రీనివాసులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
శాసనసభ, రాజ్యసభ సీట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించి మళ్లీ మొండిచెయ్యి చూపడంతో జంగాలపల్లి శ్రీనివాసులు అసంతృప్తిగా ఉన్నారు. ఆయన వర్గం కూడా బభగ్గుమంటోంది. బలిజ సంఘం నాయకులు ఈ విషయంలో ఆందోళనలకు సిద్ధమయ్యారు. అయినా కూడా వైసిపి అధిష్టానం ఏ మాత్రం స్పందించలేదు. మున్సిపాలిటీలో కూడా జంగాలపల్లి శ్రీనివాసులు రావలసిన బిల్లులను అధికార పార్టీ పెండింగ్ లో పెట్టినట్లు సమాచారం. వీటన్నిటి దృష్ట్యా జంగాలపల్లి అవమానాలను భరిస్తూ వైసీపీలో కొనసాగడం కన్నా పార్టీ మారడం శ్రేయస్కరమని భావించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా జనసేన పార్టీలో చేరడానికి తన వర్గంతో పాటు జంగాలపల్లి సిద్ధమయ్యారని సమాచారం. తొందరలోనే ఆయన జనసేన తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం.