4, మార్చి 2024, సోమవారం

చిత్తూరు టీడీపీలో పెరుతున్న ఆత్మవిశ్వాసం !



చిత్తూరు మాజీ శాసనసభ్యుడు సికే బాబు తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించడం,  ప్రస్తుత చిత్తూరు శాసనసభ్యుడు జంగాలపల్లి శ్రీనివాసులు జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడంతో చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. క్రమంగా గెలుపు మీద ధీమా ఏర్పడుతోంది. సీకే బాబు, జంగాలపల్లి శ్రీనివాసుల ప్రభావం చిత్తూరు నియోజకవర్గ మీదే కాకుండా సమీపంలోని గంగాధర నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల మీద కూడా పడుతుందని భావిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో వీరి కారణంగా తెలుగుదేశం పార్టీ విజయ అవకాశాలు మెరుగుపడతాయని ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం జరిగిన ఆత్మీయ సమావేశంలో సీకే బాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడుకు మద్దతు ప్రకటించారు. అదే రోజు జంగాలపల్లి శ్రీనివాసులు హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. ఈ రెండు సంఘటనలు చిత్తూరు టీడీపీ నేతలతో జోష్ నింపుతున్నాయి.


ఆరు నెలల కిందట రాజకీయాల్లోకి   అడుగుపెట్టిన గుడిపాల మండలానికి చెందిన జగన్మోహన్ నాయుడుకు తెలుగుదేశం పార్టీ చిత్తూరు టికెట్ ని కేటాయించింది. ఆయన చంద్రబాబు నాయుడు అరెస్టు అయినప్పటి నుండి రాజకీయంగా క్రియాశీలకమయ్యారు. బెంగళూరులో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న జగన్మోహన్ నాయుడు రాజకీయ అరంగ్రేటం  చేయాలని చిత్తూరులో రెండు ఇండ్లను కొనుగోలు చేశారు. నూతన గృహప్రవేశం చేస్తూ చంద్రబాబు నాయుడు జైలు నుంచి త్వరగా విడుదల కావాలని రాజశ్యామల యాగం చేశారు. దీంతో ఒక్కసారిగా జగన్మోహన్ నాయుడు రాజకీయ తెరమీదకు వచ్చారు. అనంతరం పేదలకు తోపుడు బండ్లు ఇవ్వడం, ఆర్థిక సహాయం చేయడం దసరా కానుకలు, రంజాన్ తోఫా వంటి సహాయ కార్యక్రమాలను చేస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలబడ్డారు. యువగళం ముగింపు సభకు  45 లక్షల రూపాయల వ్యయంతో టిడిపి కార్యకర్తలకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. అలాగే కొన్ని కుల సంఘాలకు ఆర్థిక సహాయం చేశారు. చిత్తూరు పట్టణంలో భారీ ఎత్తున హోర్డింగ్ లు, కటౌట్లు ఏర్పాటు చేశారు. ఇదివరకు ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులను మించిపోయే విధంగా పబ్లిసిటీ చేశారు. దీనితో చిత్తూరు నియోజకవర్గ టీడీపీ రాజకీయం మొత్తం జగన్మోహన్ నాయుడు చుట్టూ తిరుగుతోంది. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా చిత్తూరు అసెంబ్లీ టికెట్ ను జగన్మోహన్ నాయుడు కేటాయించారు.


అయితే, ఆదివారం చోటుచేసుకున్న  చోటు చేసుకున్న రెండు పరిణామాలు తెలుగుదేశం పార్టీకి వరంలా మారాయి. చిత్తూరు నియోజకవర్గంలో నుంచి నాలుగు పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నికైన సీకే బాబు తిరిగి క్రియాశీలక కావాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆదివారం తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన టిడిపి అభ్యర్థి జగన్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీలో ఉంటూ తన గెలుపునకు  సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే సీకే బాబు సానుకూలంగా స్పందించారు. టిడిపి అభ్యర్థి గురజాలకు తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ప్రచార కార్యక్రమాలలో కూడా  పాల్గొనడానికి అంగీకరించారని సమాచారం. దీంతో వైసిపి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తెలుగుదేశం పార్టీ బలం క్రమంగా పెరుగుతోందని లోన గుబులు ప్రారంభమైంది.


జంగాలపల్లి శ్రీనివాసులు చిత్తూరు ఎమ్మెల్యేగా ఉంటూ పార్టీకి, పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడుగా ఉంటూ పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ, పార్టీ అభివృద్ధి కృషి చేశారు. అయితే ఆయనకు కాకుండా టిక్కెట్టు విజయానంద రెడ్డి ఇవ్వడం ఆయనకు మనస్థాపన కలిగించింది. అంతకుముందు జరిగిన బీసీ సాధికారతా యాత్రలో మంత్రుల బృందం జంగాలపల్లి శ్రీనివాసులకు మరోసారి అసెంబ్లీ టిక్కెట్టు ఖరారు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో తిరిగే టిక్కెట్టు తనకే వస్తుందని జంగాలపల్లి శ్రీనివాసు భావించారు. ఊహించని విధంగా విజయానంద రెడ్డికి కేటాయించారు. బలిజ సామాజిక వర్గం ఆందోళనలకు దిగడంతో రాజ్యసభ సీటును జంగాలపల్లి శ్రీనివాసులుకు ఇస్తామని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కొద్ది రోజులకే రాజ్యసభ విషయంలో కుడా జంగాలపల్లి శ్రీనివాసులుకు ఎదురుదెబ్బ తగిలింది. జంగాలపల్లిని కాదని మరో వ్యక్తిని రాజ్యసభకు పంపారు. తనకు జరిగిన, జరుగుతున్న అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండటం మంచిదని జంగాలపల్లి శ్రీనివాసులు భావించారు. దీంతో జనసేనలో చేరాలని నిర్ణయించుకుని ఇందుకు అనుకూలంగా పావులు కదిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇందుకు అనుకూలంగా స్పందించడంతో రెండు మూడు రోజుల్లో జంగాలపల్లి శ్రీనివాసులు పార్టీలో చేరనున్నారు.


 జనసేన తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షం కావడంతో మరో మారు తెలుగుదేశం పార్టీ బలం చిత్తూరు నియోజకవర్గంలో పెరిగినట్లు అయింది. సీకే బాబు రాకతో రెడ్డి సామాజిక వర్గంలో కొంతమంది నేతలు టిడిపికి అనుకూలంగా మారారు. జంగాలపల్లి శ్రీనివాసులు చేరికతో బలిజ సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు ఆయనతోపాటు జనసేనలో చేరనున్నారు. కావున బలిజ సామాజిక వర్గం కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారనుంది. బలిజ, రెడ్డి నేతలు మద్దతు లభించినట్లు అయ్యింది.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *