శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డా. సిపాయ్ సుబ్రమణ్యం ?
శ్రీకాళహస్తి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. రెండు రోజుల క్రితం అధిష్టానం ఆయనను రాజధానికి పిలిపించి చర్చించినట్టు తెలిసింది. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టు సర్వేల ద్వారా వెల్లడైందని అంటున్నారు. ఆయనకు అవినీతి మరకలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో సుబ్రమణ్యం బలమైన అభ్యర్థి అవుతారని పరిశీలనలో తేలింది. ఆయన సామాజిక వర్గం అయిన వన్నె కుల క్షత్రియుల ఓట్లు నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నాయి. అలాగే చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో కూడా వారి సామాజిక వర్గం ఓట్లు 35 వేలకు పైగా ఉన్నాయి. అందుకే అక్కడ అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ భరత్ కు టికెట్టు ఇచ్చారు. ఆయన గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని సిఎం జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో ప్రకటించారు. సుబ్రమణ్యం టికెట్టు ఇస్తే ఉమ్మడి జిల్లాలో ముగ్గురు బిసి అభ్యర్థులకు టికెట్టు ఇచ్చినట్టు అవుతుంది. బీసీల పార్టీ అని చెప్పుకునే టిడిపి మూడు ఉమ్మడి జిల్లాలలో ఒక బిసికి కూడా టికెట్టు ఇవ్వలేదు.
సుబ్రమణ్యం గతంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. అయితే గత ఏడాది జగన్ ఆయనను పిలిచి ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. దీని వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వ్యూహం ఉందంటున్నారు. ఆయన 2009 ఎన్నికల్లో శ్రీకాళహస్తి నుంచి పిఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి 24,349 ఓట్లు తెచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ఎస్సీవీ నాయుడుపై 12,463 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో గోపాలకృష్ణా రెడ్డి, వైసిపి అభ్యర్ధి బియ్యం మధుసూదన రెడ్డిపై 7,583 ఓట్ల ఆధిక్యత సాధించారు. 2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి మధుసూదన రెడ్డి, టిడిపి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిపై 38,141 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. అయితే ఆయన పట్ల వ్యతిరేకత ఉండటం వల్ల కొత్త అభ్యర్థిని అన్వేషిస్తున్నారు. టిడిపి అభ్యర్థిగా సుధీర్ రెడ్డి లేక ఎస్సీవీ నాయుడుకు అవకాశం ఉందంటున్నారు. పొత్తులో భాగంగా బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కోలా ఆనంద్ కు టికెట్టు రావచ్చు అన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బిసి నాయకుడు, పేరున్న వైద్యులు అయిన సుబ్రమణ్యం పేరు పరిశీలిస్తున్నారు.