జంగాలపల్లికే తిరుపతి టిక్కెట్టు
తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా చిత్తూరు శాసనసభ్యులు జంగాలపల్లి శ్రీనివాసులు ఖరారయ్యారు. ఈ మేరకు బుధవారం జంగాలపల్లి శ్రీనివాసులు జనసేనని పవన్ కళ్యాణ్ ని కలిశారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అనుసరించవలసిన వ్యూహం గురించి దిశా నిర్దేశం చేశారు. అనంతరం బి ఫారం కూడా అందజేసినట్లు సమాచారం. జంగాలపల్లి శ్రీనివాసులు జనసేన బీ ఫారంతో తిరుగు ముఖం పెట్టారు.
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణమ్మ స్వల్ప తేడాతో ప్రస్తుత ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి మీద ఓడిపోయారు. దాంతో ఈ పర్యాయం తనకే టికెట్టు వస్తుందని ధీమాతో మొదటినుంచి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అలాగే బీసీ అభ్యర్థిగా తలను పరిశీలించాల్సిందిగా తుడా మాజీ చైర్మన్, తిరుపతి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు గొల్ల నరసింహ యాదవ్ కూడా కోరారు. అలాగే పార్టీ సీనియర్ నాయకుడు సూరాసుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మబ్బురామిరెడ్డి కుమారుడు మబ్బు దేవనారాయణ రెడ్డి, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళి కూడా తిరుపతి టికెట్ ను ఆశించారు. అలాగే భారతీయ జనతా పార్టీలో భాను ప్రకాష్ రెడ్డి పేరు కూడా తెర మీదకి వచ్చింది. జనసేన పార్టీలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్, రాష్ట్ర అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ కూడా ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. అయితే ఊహించిన విధంగా జంగాలపల్లి శ్రీనివాసులు చిత్తూరు ఎమ్మెల్యే గా కొనసాగుతూ జనసేన పార్టీలో చేరారు.
చిత్తూరు వైసీపీ పార్టీ తరఫున జంగాలపల్లి శ్రీనివాసులు పలు అవమానాలను ఎదుర్కొన్నారు. తొలత ఆయనకు ఎమ్మెల్యే టికెట్ అని చెప్పి ఆర్టీసీ వైస్ చైర్మన్ గా ఉండిన విజయానంద రెడ్డికి ఇచ్చారు. అలాగే రాజ్యసభ అంటూ మభ్యపెట్టి చివరిలో హ్యాండ్ ఇచ్చారు. ఏపీఐఐసీ చైర్మన్ అంటూ ఆశపెట్టి దానిని మరిచిపోయారు. జీ ఓ ఇవ్వలేదు. చిత్తూరు మున్సిపాలిటీలో చేసిన పనులకు కూడా బిల్లులు చెల్లించకుండా అడ్డుపెట్టారు. ఇన్ని అవమానాలు భరిస్తూ పార్టీలో కొనసాగడ కన్నా మారడం మేలని జంగాలపల్లి భావించి, జనసేన ని పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు ఆయన అంగీకరించడంతో జనసేన పార్టీలో చేరారు. ఊహించిన విధంగా తిరుపతి జనసేన టికెట్ ను కైవసం చేసుకున్నారు.
అయితే తిరుపతిలో టికెట్ ఆశించి బంగపడిన నాయకులు స్థానిక వాదాన్ని తెర మీదికి తెస్తున్నారు. తిరుపతి టిక్కెట్టును స్థానిక అభ్యర్థికే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక అభ్యర్థులను కాదని స్థానికేతరులకు ఇస్తే పనిచేసేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ఈ నేపథ్యంలో టిడిపి, జనసేన, బిజెపి పార్టీలోని అసమ్మతులను బుజ్జగించి, ఒక వేదిక మీదికి తీసుకుని వచ్చి శ్రీనివాసుల గెలుపు కోసం పనిచేపించడం కత్తి మీద సామే కానుంది. రాష్ట్ర పార్టీ నాయకులు ఈ విషయంలో ఎలా స్పందిస్తారు వేసి చూడాలి.