మళ్ళీ టీడీపీ గూటికి ఏ ఎస్ మనోహర్
తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడు, చిత్తూరు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ఏఎస్ మనోహర్ తిరిగి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకం కానున్నారు. ఈ మేరకు ఆయన శనివారం సాయంకాలం ముఖ్య అనుచరులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆత్మీయుల సలహాలు, సూచనలు తీసుకుని తిరిగి తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించనున్నారు. రానున్న ఎన్నికల్లో చిత్తూరు టీడీపీ అభ్యర్థి జగన్మోహన్ నాయుడు విజయానికి కృషి చేయనున్నారు.
బలిజ సామాజిక వర్గానికి చెందిన ఏ ఎస్ మనోహర్ 1994 శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత మూడు నెలలకు జరిగిన మున్సిపల్ ఎన్నికలలో ఘన విజయం సాధించి మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. ఆయన కాలంలో చిత్తూరు మున్సిపాలిటీకి భారీగా ప్రపంచ బ్యాంకు నిధులు వచ్చాయి. ఈ నిధులతో నాలుగైదు చోట్ల షాపింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణం జరిగింది. మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధి శర వేగంగా జరిగింది. ఈనాటికి మున్సిపాలిటీకి ఆదాయాలు వస్తున్నాయి అంటే అది ఏఎస్ మనోహర్ కాలంలో జరిగిన అభివృద్ధి. ఆయన 1999 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ముచ్చటగా మూడోసారి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీకే బాబు మీద విజయం సాధించి, అసెంబ్లీలో అడుగు పెట్టారు. తిరిగి 2009లో జరిగిన ఎన్నికల్లో పార్టీ టికెట్టును అనూహ్యంగా గుడిపాల మండలానికి చెందిన బాలాజీ నాయుడుకు కేటాయించారు. తనకు సమాచారం ఇవ్వకుండా తనను కాదని బాలజీకి టిక్కెట్టు ఇవ్వడంతో అసంతృప్తి గురైనమనోహర్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. 2012 వ సంవత్సరంలో వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినా, క్రియాశీలకంగా వ్యవహరించలేదు. తిరిగి 2014 ఎన్నికల్లో డీకే ఆదికేశవులు నాయుడు సతీమణి డీకే సత్యప్రభ చిత్తూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. తిరిగి 2019 ఎన్నికలలో డీకే సత్య ప్రభకు రాజంపేట పార్లమెంట్ స్థానానికి కేటాయించి, అనూహ్యంగా ఏఎస్ మనోహర్ కు చిత్తూరు అసెంబ్లీ టికెట్ ను చంద్రబాబు కేటాయించారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో వైసీపీ గాలిలో మనోహర్ ఓడిపోయారు. ఆనాటి నుంచి వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా రాజీనామా చేశారు.
గురజాల జగన్మోహన్ నాయుడుకు తెలుగుదేశం పార్టీ టిక్కెట్టు లభించిన తర్వాత తెలుగుదేశం పార్టీలో అసంతృప్తిగా ఉన్న నాయకులందరినీ బుజ్జగించి తిరిగి పార్టీలోకి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏ ఎస్ మనోహర్ ను కలిసి తన గెలుపునకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్ చేసి తెలుగుదేశం పార్టీలో తిరిగి క్రియాశీలకం కావాల్సిందిగా కోరారు. ఈ పర్యాయం పార్టీ తప్పక అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత గౌరవం ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో ఏఎస్ మనోహర్ తిరిగి రాజకీయంగా క్రియాశీలకం కావాలని, చిత్తూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్ మోహన్ నాయుడు విజయానికి కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆయన శనివారం సాయంకాలం ఆత్మీయ సమావేశంలో నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జగన్మోహన్ నాయుడుకు మద్దతు ప్రకటించే అవకాశం ఉంది.