క్యాన్సర్ రోగులకు రూ.15 లక్షల ఉచిత సాయం
క్యాన్సర్ రోగులకు రూ.15 లక్షల ఉచిత సాయం
క్యాన్సర్ ఒక భయంకరమైన వ్యాధి. పేదవారికి ఈ క్యాన్సర్ నెత్తిన పిడుగులాంటిదే. క్యాన్సర్ చికిత్స అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో ఖరీదుతో కూడుకున్నది. క్యాన్సర్ చికిత్సకయ్యే ఖర్చు భరించే స్తోమత లేక నిరుపేదలు అల్లాడిపోతుంటారు. ఎన్నో అవస్థలు పడుతుంటారు. సాయం చేసే చేతుల కోసం ఎదురు చూస్తుంటారు.
అయితే కేంద్ర ప్రభుత్వం పేద క్యాన్సర్ రోగులకు వారి వైద్యానికయ్యే ఖర్చుకు రూ.15 లక్షల వరకు ఆర్థిక సాయం చేసే ఒక పథకాన్ని అమలు చేస్తోంది. దురదృష్టవశాత్తు ఈ పథకం గురించి తగిన ప్రచారం లేకపోవడం, ప్రజలకు అవగాహన లేకపోవడం తదితర కారణాలతో పేద క్యాన్సర్ రోగులు ఈ విలువైన పథకాన్ని ఉపయోగించుకో లేకపోతున్నారు. గత నాలుగేళ్లలో తెలంగాణ నుంచి ఏ ఒక్కరూ ఈ పథకాన్ని వినియోగించుకో లేకపోయారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 97 మంది రోగులు మాత్రమే దీన్ని వినియోగించుకున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
రాష్ట్రీయ ఆరోగ్య నిధి - హెల్త్ మినిస్టర్స్ క్యాన్సర్ పేషెంట్ ఫండ్ పేరిట కేంద్రం అమలు చేస్తున్న పథకం ఇది. పేదల్లో ఎవరైనా క్యాన్సర్ సోకి చికిత్స చేయించుకోవడానికి ఇబ్బందులు పడుతుంటే అలాంటి రోగులకు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2009లో ప్రవేశపెట్టిన పథకం ఇది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సక్షేమ మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో ఈ పథకం అమలు చేస్తున్నారు. రాష్ట్రీయ ఆరోగ్య నిధిలో భాగంగానే ఆరోగ్య మంత్రి క్యాన్సర్ రోగుల నిధి (హెల్త్ మినిస్టర్స్ క్యాన్సర్ పేషెంట్ ఫండ్ - Health Minister’s Cancer Patient Fund)ని ఏర్పాటు చేశారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు క్యాన్సర్ చికిత్స కోసం ఆర్థిక సాయం అందించాలనేది ఈ పథకం ప్రధాన ఉద్దేశం. దీనికోసం దేశంలోని 27 ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
క్యాన్సర్ రోగికి ఎంత డబ్బు ఇస్తారు?
క్యాన్సర్ రోగికి చికిత్స కోసం ఈ పథకం కింద రూ.2లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తారు. అయితే అంతకంటే ఎక్కువ డబ్బు అవసరమైతే ఆ దరఖాస్తులను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పంపుతారు. క్యాన్సర్ రోగి పరిస్థితిని అధ్యయనం చేసిన తరువాత అవసరాన్ని బట్టి గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. కేంద్ర ఇచ్చే 2 లక్షల రూపాయల సాయమైనా, గరిష్ఠంగా ఇచ్చే రూ.15లక్షల సాయమైనా సరే ఆ క్యాన్సర్ రోగి చికిత్సకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బును క్యాన్సర్ రోగి ఈ కింద చికిత్సలకు ఉపయోగించుకోవచ్చు
రేడియేషన్
యాంటీ క్యాన్సర్ కీమోథెరపీ
బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్
రోగ నిర్ధారణ పరీక్షలు
క్యాన్సర్ గడ్డల ఆపరేషన్
ఈ పథకం పొందడానికి అర్హతలేమిటి?
కేంద్ర ప్రభుత్వం లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశిత దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారై ఉండాలి. రేషన్ కార్డు లేదా వార్షికాదాయ ధ్రువీకరణ పత్రం సంబంధిత ఎమ్మార్వో నుంచీ పొంది ఉండాలి. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల ధ్రువ పత్రాలుండాలి. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేసుకుంటే ఈ పధకం వర్తించదు. క్యాన్సర్ రోగులకు సంబంధించి దేశంలో 27 ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలున్నాయి. వీటిలో మాత్రమే క్యాన్సర్ రోగులు చికిత్స చేయించుకోవాలి. లేదా టెరిటరీ క్యాన్సర్ సెంటర్లు, లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆసుపత్రుల్లోని క్యాన్సర్ సెంటర్లలో చికిత్స పొందుతున్న రోగులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ రీజినల్ క్యాన్సర్ సెంటర్లలో ప్రతి సెంటర్లోనూ ప్రత్యేకించి ఫండ్ ఏర్పాటు చేశారు. క్యాన్సర్ రోగులకు కేంద్ర ఇచ్చే రూ.2లక్షల చికిత్స వ్యయాన్ని ఈ నిధి నుంచే అందజేస్తారు.
రూ.2లక్షలకు మించి సాయం అవసరమైతే?
అప్పుడు రోగి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకించి దరఖాస్తు చేసుకోవాలి. రీజినల్ క్యాన్సర్ సెంటర్‌లో మెడికల్ ఆఫీసర్ సిఫారసుతో దరఖాస్తు చేసుకోవాలి. కేంద్రం ఈ దరఖాస్తును పరిశీలించి అవసరాన్ని బట్టి అత్యధికంగా రూ.15లక్షల వరకు సాయం చేస్తుంది. ఒకేసారి ఏక మొత్తంలో డబ్బు మొత్తం చెల్లిస్తారు. ఇంతకు ముందు చికిత్స కోసం అయిన ఖర్చుకు ఈ డబ్బు వినియోగించడానికి వీలు లేదు. ఇంతకు ముందే చికిత్స చేసుకున్నప్పటికీ ఆ ఖర్చులకు ఈ డబ్బు ఇవ్వరు. కేవలం ప్రస్తుతం అందుతున్న చికిత్సకు మాత్రమే డబ్బులు అందజేస్తారు.
ఆయుష్మాన్ భారత్ - పీఎంజేఏవై పథకంలో ఉన్న వారికీ వర్తించదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నఆరోగ్య బీమా పథకాలు ఆయుష్మాన్ భారత్ - ప్రైమ్ మినిస్టర్ జన ఆరోగ్య యోజన (Ayusman Bharat - Pradhan Mantri Jan Arogya Jojna (PMJAY) పథకంలో మీరు సభ్యులైనట్లయితే వారికి కూడా ఈ పథకం వర్తించదు. ప్రధాన మంత్రి జాతీయ ఉపశమన నిధి (Prime Minister's National Relief Fund (PMNRF) సాయం పొందిన రోగులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. కానీ ఈ రిలీఫ్ పండ్ నుంచీ పొందిన మొత్తాన్ని ఈ పథకం నుంచీ మంజూరు చేసిన మొత్తంలో కోత విధించి మిగిలింది క్యాన్సర్ రోగి చికిత్సకు ఉపయోగిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు కారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ కూడా ఈ పథకానికి అర్హులు కారు. కేవలం నిరుపేదలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది
క్యాన్సర్ రోగికి ఆర్థిక సాయం ఎలా మంజూరు చేస్తారు?
కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ఒక సాంకేతిక కమిటీ ఉంటుంది. ఈ కమిటీ దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు అందిన తరువాత అన్ని పరిశీలించి నెల రోజుల్లోపే రోగి చికిత్సకు డబ్బు మంజూరు చేస్తారు. ఈ డబ్బు రోగి ఖాతాలోకి నేరుగా జమ చేయరు. క్యాన్సర్ రోగి ఏ ఆసుపత్రిలో అయితే చికిత్స చేయించుకుంటున్నారో ఆ ఆసుపత్రి సూపరింటిండెంటు ఖాతాలో జమ చేస్తారు.
దేశంలో ఉన్న రిజినల్ క్యాన్సర్ సెంటర్లు
https://main.mohfw.gov.in/sites/default/files/Addresses%20Of%20Regional%20Cancer%20Centres.pdf
ఈ వెబ్ పోర్టల్‌లో ఈ రీజినల్ క్యాన్సర్ సెంటర్ల పూర్తి వివరాలు, చిరునామాలు ఉంటాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో రిజినల్ క్యాన్సర్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయి?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండింటికీ కలిపి రీజినల్ క్యాన్సర్ సెంటర్ హైదరాబాద్‌లో ఉంది.
చిరునామా:
ఎంఎన్‌జె ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ
ఎంఎన్‌జె ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ & రీజినల్ క్యాన్సర్ సెంటర్
రెడ్ హిల్స్, లక్డీకాపూల్
హైదరాబాద్ -500004
ఫోన్ : 040-23318422 / 414 / 424 / 23397000
టెలీఫ్యాక్స్ : 040-23314063, ఈమెయిల్ : info@mnjiorcc.org, director@mnjiorcc.org, dirmnjiorcc@yahoo.com
ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయడమెలా?
ముందుగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వెబ్‌సైటులో దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడు చేసుకోవాలి. ఈ కింద ఇచ్చిన లింక్‌లో ఈ దరఖాస్తు లభిస్తుంది.
https://main.mohfw.gov.in/sites/default/files/45662929341448017999_0.pdf
దరఖాస్తును పూర్తీగా అడిగిన మేరకు వివరాలతో నింపాలి. ఈ దరఖాస్తును రోగికి చికిత్స అందిస్తున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ లేదా మెడికల్ ఆఫీసర్ లేదా ఆసుపత్రి హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ నుంచి స్టాంపుతో కూడిన సంతకం తీసుకోవాలి. ఇలా పూర్తి చేసిన దరఖాస్తును కేంద్ర ప్రభుత్వానికి అందేలా కింది చిరునామాకు పంపాలి
సెక్షన్ ఆఫీసర్, గ్రాంట్స్ సెక్షన్
మిన్సిస్ట్రీ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్
రూమ్ నం.541, ఎ-వింగ్, నారీమన్ భవన్
న్యూదిల్లీ-110011
ఇంకా ఏదైనా వివరాలు కావాలంటే సంప్రదించాల్సిన ఈ-మెయిల్ చిరునామా
so.grants-mhfw@nic.in