అదానీ ఒప్పందాలు రద్దు చేయాలి - పోర్టులు ప్రభుత్వ పరం చేయాలి: CPM
అదానీ ఒప్పందాలు రద్దు చేయాలి - పోర్టులు ప్రభుత్వ పరం చేయాలి
సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు డిమాండ్
అంతర్జాతీయ ఆర్థిక నేరగాడైన అదానీతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేయాలని, ఆయనకు అప్పగించిన గంగవరం పోర్టుతోపాటు అదానీకి అప్పగించిన పోర్టులు, భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు డిమాండ్ చేశారు. ఆదివారం పలమనేరులో మోడీ, అదానీ అక్రమాలపై సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రచురించిన మోదానీ పుస్తకాన్ని పార్టీ జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, జిల్లా నాయకులు గిరిధర్ గుప్తా, ఓబుల్ రాజు, భువనేశ్వరి,తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రోద్బలంతో అదానీ దేశ సంపదను లూఠీ చేశారని, అనతి కాలంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సంపన్నుడిగా ఎదిగాడని తెలిపారు. తీవ్ర అవినీతి, అక్రమాలతో అతి తక్కువ కాలంలో ఎదిగిన అతనిపై ఓ కంపెనీ ఇచ్చిన నివేదికతో అథమస్థాయికి దిగజారిపోయాడని పేర్కొన్నారు. అవినీతి, అక్రమాలు చేయడంలో అదానీ మొదటిస్థానంలో ఉన్నాడని అన్నారు. కేంద్రంలో మోడీతోపాటు రాష్ట్రంలో జగన్ కూడా సహకరించారని, ప్రభుత్వ ఆస్తిగా ఉన్న గంగవరం పోర్టు వాటాలను కూడా కారుచౌకగా కట్టబెట్టారని విమర్శించారు. అదీ చాలదన్నట్లు కృష్ణపట్నం పోర్టు, సోలార్ ప్రాజెక్టులు, విమానాశ్రయాలు, విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో వేల ఎకరాలు అదానీకి అప్పగిస్తున్నారని తెలిపారు.
గంగవరం పోర్టులో ఉన్న 16 శాతం వాటాను ఒక్కోషేరు రూ.120కి కట్టబెట్టారని పేర్కొన్నారు. అలాగే విశాఖ పోర్టు నుండి ఎగుమతి, దిగుమతులు అయ్యే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కార్యకలాపాలను బలవంతంగా గంగవరం పోర్టు నుండి చేయిస్తున్నారని తెలిపారు. వాటాలు అమ్మడంతోపాటు అతనికి వ్యాపారమూ చేసి పెడుతున్నారని , దీన్ని అడ్డుకోవాలని అన్నారు. గంగవరం పోర్టు భద్రతాపరంగానూ కీలకమైందని, ఇక్కడ అదానీ కార్యకలాపాల వల్ల దేశ భద్రతకూ ముప్పు వస్తుందని వివరించారు. ఇప్పటికే ముంద్రా పోర్టులో పెద్దఎత్తున డ్రగ్స్‌తో సహా వేలకోట్ల అక్రమ వ్యాపారాలు సాగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయినప్పటి నుండి ఎన్ని కంపెనీలు తెచ్చారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అనే అంశాలపై జగన్ శ్వేతపత్రం విడుదల చేయాలని పేర్కొన్నారు. ఎన్నికల ముందు నిరుద్యోగులను మోసం చేయడానికి, ప్రలోభాలకు గురిచేసేందుకు ఇటువంటి తంతు చేస్తున్నారని మండిపడ్డారు.
జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ మోడీ, జగన్ కలిసి అదానీకి ఆస్తులు కట్టబెడుతున్నారని తెలిపారు. గ్యాస్ ధరలు పెంచారని, విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారాన్ని మోపుతున్నారని వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులందరూ వైసిపికి ఓట్లు వేయకపోతే తమకు తెలుస్తుందని, వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి ధర్మాన ఉద్యోగులు, స్థానిక ప్రజాప్రతినిధులను బెదిరించడంపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు మద్దతుగా 9, 10 తేదీల్లో దీక్షలు సిపిఎస్‌పై ఉద్యోగుల ఆందోళన న్యాయమైందని వారికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు, ధర్నాలు చేపడతామని ప్రకటించారు.ఈ కార్యక్రమం లో నాయకులు ఈశ్వరయ్య, సుబ్రహ్మణ్యం,జయంతి, ధనలక్ష్మి,రాజా, సుధాకర్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.