గ్యాస్ ధరల పెంపు ఉపసంహరించుకోవాలి: CPM
గ్యాస్ ధరల పెంపు ఉపసంహరించుకోవాలి.
సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్
కేంద్ర బిజెపి ప్రభుత్వం గృహ వినియోగానికి ఉపయోగించే ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధర రు.50, వాణిజ్య సిలెండర్ రు.350 పెంచడాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు తీవ్రంగా ఖండించారు .పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేయాలని పిలుపునిస్తున్నది.
నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి సామాన్య ప్రజలు దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ ధరలు రెండు నెలల వ్యవధిలో రెండు సార్లు పెంచడం దారుణం. 3 సంవత్సరాల క్రితం వరకు రు.417 ఉన్న డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధర నేడు రు.1155కు పెరిగింది. ప్రభుత్వం సబ్సిడీ జమలు రెండు సంవత్సరాల నుండి నిలిపివేసింది. ఇప్పటికే గృహ వినియోగానికి సబ్సిడీ క్రింద ఇచ్చే సిలెండర్ల సంఖ్య కుదించారు. ఇది పూర్తిగా పేద, మధ్యతరగతిపై దాడి తప్ప మరొకటి కాదు. వాణిజ్య సిలెండరు ఒక్కసారిగా రు.350 పెంచడం వల్ల స్వీయ ఉపాధి పొందుతున్నవారు, చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆర్ధిక మాంద్యం వలన చితికిపోతున్న స్వయం ఉపాధి మరింత దుర్భరస్థితికి చేరుకుంటుంది.
ఉపాధి లేక, వేతనాలు చాలక ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న నేపథ్యంలో ధరలు నియంత్రించాల్సిన ప్రభుత్వం మూలిగే నక్కపై తాటి పండులా భారాలు మోపడం గర్హనీయం. మరోవైపు కార్పొరేట్లకు రాయితీలిచ్చి దేశాన్ని దోచిపెడుతున్నారు. వంట గ్యాస్ ధరల పెంపును ఉపసంహరించి, సబ్సిడీని పునరుద్ధరించాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది. పెంచిన ధర ఉపసంహరించేవరకు ఎక్కడికక్కడ నిరసనలు చేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నది.


