చిత్తూరు రాజకీయాలకు కేంద్రబిందువుగా CK బాబు
చిత్తూరు రాజకీయాలకు చిత్తూరు మాజీ శాసనసభ్యుడు సీకే బాబు కేంద్ర బిందువుగా మారుతున్నారు. ఆయనను పలు రాజకీయ పార్టీలు నాయకులు వరుసగా కలుస్తున్నారు. తమ పార్టీలో చేరాల్సిందిగా సీకే బాబును సాదరంగా ఆహ్వానిస్తున్నారు. సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తామని హామీ ఇస్తున్నారు. అయితే సీకే బాబు మాత్రం గుంబనంగా ఉంటున్నారు. ఎవరు వెళ్ళినా, సాదరంగా ఆహ్వానించి వారితో మాట్లాడుతున్నారు. తన నిర్ణయం మాత్రం తర్వాత తెలియజేస్తానని అంటున్నారు. ఆయన మనసులో ఏమున్నది ఎవరికి తెలియడం లేదు. ఆయన ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారా అని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఆయన నిర్ణయం కోసం పలు పార్టీల నేతలు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
చిత్తూరు రాజకీయాలలో సీకే బాబు ఒక సూపర్ స్టార్. ఒక తిరుగులేని నేత. ఒక నాడు చిత్తూరు కింగ్ గా చలామణి అయ్యారు. అభిమానులందరూ చిత్తూరు టైగర్ గా పిలుచుకుంటారు. ఒకనాడు CK బాబు అంటే చిత్తూరు, చిత్తూరు అంటే సీకే బాబు. చిత్తూరు జిల్లా రాజకీయ రంగంలో చక్రము తిప్పిన ధీరుడు CK బాబు. చిత్తూరు మాత్రమే కాకుండా వేపంజేరి, చంద్రగిరి, పలమనేరు నియోజకవర్గం ఆయన ప్రాభల్యం ఉంది. ఆయనకు అనుచరుగణం ఉంది. ఆయన రాజకీయాలలో లేకున్నా, చెరగని ప్రభ సీకే బాబుది. ఇప్పటికీ ఆయనకు పలు నియోజకవర్గాలలో అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు ఉన్నారు. సీకే బాబు వస్తున్నారంటే ఆయనను చూడడానికి ఒక సినిమా స్టార్ లాగా జనం ఎగబడతారు. ఆయనతో కరచాలనం చేయడానికి, ఫోటోలు దిగడానికి పోటీలు పడతారు. ఆయన దృష్టిలో పడడానికి శ్రమిస్తారు. పీకే బాబు రాజకీయాల్లో ఉన్న లేకున్నా ఒక క్రేజీ నాయకుడు.
చిత్తూరు కౌన్సిలర్ గా సీకే బాబు తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మున్సిపల్ ఉపాధ్యక్షుడుగా ఉంటూ తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. చిత్తూరులో ఈ రికార్డు ఏ నాయకుడికి లేదు. 1989 ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. కాంగ్రెస్ తరపున గోపీనాథ్, టిడిపి తరఫున హరి ప్రసాద్ లను ఓడించి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందారు, 1994, 1999 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టిడిపి అభ్యర్థి ఏఎస్ మనోహర్ మీద విజయం సాధించారు. 2004 ఎన్నికలలో ఏఎస్ మనోహర్ చేత ఓటమిపాలయ్యారు. తిరిగి 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు, టిడిపి అభ్యర్థి బాలాజీ నాయుడు మీద విజయం సాధించారు.
ఆదివారం కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు పీకే బాబు కలిశారు. ఆయనను కలిసిన వారిలో చిత్తూరు పార్లమెంట్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ దొడ్డ రెడ్డి రాంభూపాల్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ ఉన్నారు. అలాగే మరి కొంతమంది ప్రతినిధి బృందం ఆయనతో సమాలోచనలు జరిపారు. సీకే బాబును సాదరంగా మాతృ సంస్థలోకి ఆహ్వానించారు. ఆయన పార్టీలో చేరితే సముచిత గౌరవం ఉంటుందని, తామందరూ ఆయన ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూడా త్వరలోనే సీకే బాబుతో చర్చించనున్నట్లు తెలిసింది.
అలాగే భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక ప్రతినిధి బృందం చిట్టిబాబు ఆధ్యర్యంలో సీకే బాబును ఆయన స్వగృహంలో కలిశారు. గతంలో సీకే బాబు బిజెపిలో చేరి, మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరారు. కావున రానున్న ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసే విషయాన్ని పరిశీలించాలని కోరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి ఉన్న కారణంగా సికే బాబుకు అనుకూలంగా ఉంటారని తెలిపారు. మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఎన్నికలలో పొత్తు ఉంటే చిత్తూరు అసెంబ్లీ నుంచి సునాయాసంగా గెలిచే అవకాశం ఉందని వివరించారు. గతంలో పరందేశ్వరి ఆధ్వర్యంలోని సి కె బాబు అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరారు. అనంతరం కొద్దిరోజులకే బిజెపికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిన నియోజకవర్గ ఇన్చార్జి గా ప్రకటించకపోవడంతో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రానున్న ఎన్నికల దృష్టి సీకే బాబు మళ్లీ రాజకీయ అరంగ్రేటం చేయాలని భావిస్తున్నారు. ఏ పార్టీ అయితే తనకు భవిష్యత్తు ఉంటుందోనని ఆలోచిస్తున్నారు. ఏ పార్టీలో చేరాలన్న విషయమై ఆచితూచి అడుగులు వేస్తున్నారు.