జిల్లా టిడిపిలో మారుతున్న సమీకరణాలు !
పుంగనూరు అమరనాథ రెడ్డి
పలమనేరు శ్రీనాధ రెడ్డి/ అనిషా రెడ్డి
మదనపల్లి షాజహన్ భాషా
తంబళ్ళపల్లి ప్రవీణ్ కుమార్ రెడ్డి
శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి
పీలేరు కిషోర్ కుమార్ రెడ్డి
జీడీ నెల్లూరు VM థామస్
చంద్రబాబు నాయుడు పీలేరు, జీడి నెల్లూరు బహిరంగ సభల తరువాత ఉమ్మడి చిత్తూరు జిల్లా టిడిపిలో సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. టిడిపి అధినేత నారా చంద్రబాబు తన చిరకాల ప్రత్యర్థి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని లక్ష్యంగా పెట్టుకుని వ్యూహాలు, ఎత్తులు వేస్తున్నారు. జిల్లాలో పెద్దిరెడ్డిని కట్టడి చేయాలని పట్టుదలగా ఉన్నారు. తనను కుప్పంలో ఓడిస్తానని సవాలు చేస్తున్న పెద్దిరెడ్డిని పుంగనూరులో ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల పీలేరు, జి డి నెల్లూరు లో జరిగిన రా కదలిరా సభల్లో పాపాల పెద్దిరెడ్డి అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. ఆయనను ఓడిస్తామని పదేపదే అంటున్నారు.
ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై బలమైన అభ్యర్థిని పోటీకి పెట్టాలని ఆయన పావులు కదుపుతున్నట్టు సమాచారం. మాజీ మంత్రి పలమనేరు ఇంచార్జి అమరనాధ రెడ్డిని ఈ సారి పుంగనూరు నుంచి పోటీ పెట్టాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. అమరనాధ రెడ్డి 1996 ఉపఎన్నికలు,2004 సాధారణ ఎన్నికల్లో పుంగనూరు నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన తండ్రి ఎన్ రామకృష్ణా రెడ్డి ఒకసారి సమితి అధ్యక్షుడు, మూడు సార్లు ఎమ్మెల్యే, మూడు సార్లు ఎంపిగా ఉన్నారు. 2009 లో అమరనాధ రెడ్డి పలమనేరులో టిడిపి అభ్యర్ధిగా విజయం సాధించారు. 2014 లో వైసిపి తికెట్టుపై గెలిచి, టిడిపిలో చేరి మంత్రి అయ్యారు. 2019లో వైసిపి అభ్యర్ధి వెంకటే గౌడ్ చేతిలో ఓడిపోయారు. ఇంత రాజకీయ చరిత్ర ఉన్న అమరనాధ రెడ్డి అయితేనే పెద్దిరెడ్డిని ఎదుర్కోవచ్చునని చంద్రబాబు భావిస్తున్నారు. పలమనేరులో అమరనాధ రెడ్డి తమ్ముడు శ్రీనాథ రెడ్డి లేదా మరదలు అనీషా రెడ్డికి అవకాశం కల్పిస్తారు.
అలాగే ఉమ్మడి జిల్లాలోని 14 నియోజక వర్గాలలో సగం మంది ఇంచార్జిలను కాదని కొత్తవారికి టికెట్టు ఇస్తారని తెలిసింది. చిత్తూరులో గురజాల జగన్ మోహన్ నాయుడుకు అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. పూతలపట్టు ఇంచార్జి మురళి మోహన్ ను పక్కన పెట్టి, ఆనగల్లు మునిరత్నం పేరును పరిశీలిస్తున్నారు. జి డి నెల్లూరులో థామస్ అభ్యర్థిగా ఉంటారు. నగరి, చంద్రగిరిలో ఒక స్థానం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి కుమారుడు ఎన్ బి హర్ష వర్ధన్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది. ఇది జరిగితే గాలి భాను ప్రకాష్, పులి వర్తి నాని లో ఒకరు ఎగిరి పోవచ్చు. సత్యవేడులో ఇంచార్జి హెలెన్ సహా జేడి రాజశేఖర్ డాక్టర్ చందన స్రవంతి పేర్లతో పాటు ప్రసుత ఎమ్మెల్యే ఆదిమూలం పేర్లు పరిశీలనలో ఉన్నాయి. శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు ఆయన భార్య రుషితా రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. తిరుపతిలో సుగుణమ్మకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పీలేరులో కిషోర్ కుమార్ రెడ్డిని పని చేసుకోమన్నారు. మదనపల్లెలో దొమ్మలపాటి స్థానంలో మాజీ ఎమ్మెల్యే షాజాన్ బాషా పేరు పరిశీలిస్తున్నారు. తంబళ్ళపల్లె టికెట్టు ఇంచార్జి శంకర్ ను కాదని మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ కు ఇస్తారని తెలిసింది.
ఇది ఇప్పటివరకు తెదేపా ఉన్న తాజా రాజకీయ పరిస్థితి. పరిస్థితులకు అనుగునంగా తరువాత మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. మార్పులు కూడా పెద్దగ ఉండకపోవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.