మామిడి రైతులకు మనోవేదన
మామిడి రైతులకు మనోవేదన
పట్టించుకోని ప్రభుత్వం
కలెక్టర్ ఆదేశాలు భేఖతార్
చేతులెత్తేసిన ఉద్యానవన శాఖ
జిల్లాలో మామిడి రైతులు మనోవేదనకు గురవుతున్నారు. మామిడికి గిట్టుబాటు ధర లభించడం లేదు. ఈ రోజు ఉన్న ధర, రేపు ఉండడం లేదు. గరిష్టంగా 16 రూపాయలు పలికిన మామిడి ఈ రోజు 10 రూపాయలకు పడిపోయింది. రైతుల గోడును ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. జిల్లా కలెక్టర్ మొక్కుబడిగా సమావేశాలు పెట్టి మద్డదు ధరను నిర్ణయిస్తున్నారు. ఆ ధర అమలు కావడం లేదు. మద్డదు ధర అమలు అవుతుందా? లేదా అనే విషయాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఏ రోజు ఎంత ధర ఉందొ కూడా రైతులకు తెలియజేయడంలో ఉద్యానవన శాఖ ఘోరంగా విఫలం అయ్యింది. దీంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఎందుకు మామిడి పంట వేశామా అని మదనపడుతున్నారు. కాయలు కొస్తే మంగు ఉంది, మచ్చలు ఉన్నాయని ఫ్యాక్టరీ వాళ్ళు వెనక్కి పంపుతున్నారు. ఆ కాయలను ఏమి చేసుకోవాలో తెలియక రైతులు దారిలో పారపోస్తున్నారు. చిన్న రైతులకు కాయలు కోసిన ఖర్చు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. దీంతో కాయలు కోయకుండా అలాగే వదిలేస్తున్నారు. రెండు రోజుల కిందట గంగాధర నెల్లూరులో ఒక రైతు మామిడి కాయలను మండిలో తెసుకోక పోవడంతో ప్రజలకు ఉచితంగా పంచిపెట్టారు. అలాగే తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు YV రాజేశ్వరి రెండు టన్నుల కాయలను గంగాధర నెల్లూరు మండలం రామానాయుడు పల్లిలో ఇంటింటికి ఉచితంగా పంచిపెట్టారు.
YV రాజేశ్వరి మామిడి ఉచిత పంపిణి జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. మామిడి
కాయలు కోసి ఫ్యాక్టరీలకు తీసుకెళ్తే రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. కాయలు
కోయకుండా వదిలేద్దాం అంటే మనసొప్పడం లేదు. ఏం చేయాలో తెలియకుండా రైతులు
డోలయమాన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
జిల్లాలో మామిడి ధరలు గణనీయంగా పతనమయ్యాయి. ఇదివరకు మార్కెట్ యార్డులో టన్ను
ఎనిమిది రూపాయలు పలికిన పలికిన ఇప్పుడు ఐదు రూపాయలకు చేరుకుంది. అది కూడా కొనే
దిక్కు లేదు. తొలుత తొమ్మిది రూపాయలు చెల్లించిన జ్యూస్ ఫ్యాక్టరీలు ప్రస్తుతం
ఎనిమిది రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 25 శాతం మామిడి పంటను కోసి నట్లు ఒక అంచనా. అయినా జిల్లాలో పరిస్థితులు
అయోమయంగా, అగమ్యగోచరంగా ఉన్నాయి. కోయలో, కోయకూడదో
రైతులకు అర్థం కావడంలేదు.
కొందరు రైతులు మామిడి కాయలను కోసి మార్కెట్ కు తీసుకొని వచ్చి, వ్యాపారస్తులు కొనుగోలు చేయకపోవడంతో రోడ్డు పక్కన పారబోస్తున్నారు.
మరికొందరు మామిడి కాయల మీద ఆశలు వదులుకున్నారు. కాయలు కోయకుండా అలాగే
వదిలేస్తున్నారు. భూ సారం అయినా పెరుగుతుందని సంతృప్తి చెందుతున్నారు. కొందరూ
కాయలు కోసి ఫ్యాక్టరీలకు తోలి, అక్కడ కాయలను దించకపోవడంతో రోజుల పాటు ఫ్యాక్టరీల ముందర పడిగాపులు కాస్తున్నారు. ఈ సమయంలో
మామిడికాయలు మాగిపోవడంతో సగం కాయలు మట్టి పాలవుతోంది. రైతులకు రవాణా ఖర్చులు కూడా
మిగలడం లేదు. ట్రాక్టర్ మామిడి కాయలు కోయడానికి నాలుగు వేల రూపాయలు కూలీ ఇవ్వాలి.
అలాగే మామిడికాయలు ఫ్యాక్టరీ తోలడానికి మరో 4 వేల రూపాయలు
ట్రాక్టర్ బాడుగ అవుతుంది. సన్నకారు రైతులకు వచ్చే ఆదాయం ఈ ఖర్చులకు కూడా చాలడం లేదు. దీంతో ఏమి చేయాలో
పాలుపోక మామిడి రైతులు తలలు పట్టుకుంటున్నారు.
జిల్లాలో మామిడి పంటను అంచనా వేయడంలో ఉద్యానవన శాఖ విఫలమైనట్లు విమర్శలు ఉన్నాయి. జిల్లాలో లక్ష హెక్టార్లకు పైగా మామిడి తోటలు ఉన్నాయి. ఈ పర్యాయం మామిడిపూత మూడు దశలుగా వచ్చింది. పంట తక్కువ వచ్చింది అని ఉద్యానవనశాఖ అధికారులు అంచనా వేశారు. సగటున వచ్చే పంటలో 40 శాతం ఉంటుందని అభిప్రాయపడ్డారు. సాధారణంగా జిల్లాలో మామిడి కోతలు జూన్ నెల చివరి వారంలో ప్రారంభమవుతాయి. అయితే ఈ సంవత్సరం అధికారుల అంచనాల కంటే ముందుగా జిల్లాలో కాయలు పక్వానికి వచ్చాయి. జిల్లాలోని వాతావరణ పరిస్థితులతో పాటు వర్షాలు బాగా పడ్డాయి. పడిన వర్షాల కారణంగా మామిడికాయల సైజు పెరిగింది. తొందరగా పక్వానికి వచ్చాయి.
గంగాధర నెల్లూరులో మామిడి ఉచిత పంపిణి
ఫ్యాక్టరీలు స్థానిక కాయలకు ప్రాధాన్యత ఇవ్వకుండా విజయవాడ, రాయచోటి, కోలార్, క్రిష్ణగిరి, శ్రీనివాసపురం నుండి వచ్చే కాయలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అవి తక్కువ ధరకు లభిస్తుండడంతో వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలోని రైతులు కాయలను కోసి ఫ్యాక్టరీలకు తరలించినా, కాయల దించుకోవడంలో చాలా ఆలస్యం అవుతుంది. నాలుగైదు రోజులపాటు ఫ్యాక్టరీ దగ్గర వేచి ఉండాల్సిన పరిస్థితి. దీనితో సగం కంటే ఎక్కువ కాయలు మాగి పనికిరాకుండా పోతున్నాయి. అలాగే ఇతర జిల్లాల నుంచి వచ్చే మామిడికాయలను కట్టడి చేస్తే, జిల్లాలోని రైతులకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.