చంద్రగిరి టీడీపీ బరిలో ల్యాంకో ముని !
చంద్రగిరి నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా బరిలో దిగేందుకు ప్రముఖ కార్పొరేట్ సంస్థ ప్రజా సంబంధాల అధికారి కామసాని మునిశంకర్ రెడ్డి ( ల్యాంకో ముని) సిద్దం అవుతున్నారు. ఈ మేరకు ఆయన కొద్ది రోజుల క్రితం చంద్రబాబు, లోకేష్ లను కలసి తన మనసులో మాట చెప్పినట్టు తెలిసింది. కాగా ప్రముఖ సర్వే సంస్థ నిర్వాహకులు ల్యాంకో చైర్మన్ మధుసూదన రావు ఆశీస్సులు ఉన్నాయి. నియోజకవర్గంలో రెడ్డి సామాజిక ఓట్లు అధిక భాగం ఉన్నారు. కావున నియోజక వర్గంలో కాంగ్రెస్, వైసీపీ అభ్యర్థులు వరుసగా విజయం సాధిస్తున్నారు. కమ్మ అభ్యర్థుల కన్నా, రెడ్డి అభ్యర్థులు గెలవడానికి చంద్రగిరిలో అవకాశాలు మెండుగా ఉన్నాయి. వైసీపీ అభ్యర్థి రెడ్డి కావడంతో తనకు అవకాశం ఇస్తే, చంద్రగిరిని గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తానని ధీమాను వ్యక్తం చేశారు.
చంద్రగిరి మండలం గంగుడుపల్లెకు చెందిన ఆయన గత 32 ఏళ్ళుగా ల్యాంకో సంస్థలో పని చేస్తున్నారు. తొలుత పి ఆర్ ఓ గా చేరిన ఆయన ప్రస్తుతం కార్పొరేట్ గ్రూప్ అఫ్ఫైర్స్ సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ వ్యక్తి గత వ్యవహారాలు చూస్తున్నారు. అలాగే ఒక సర్వే సంస్థలో కీలక వ్యక్తిగా ఉన్నారు. ప్రజా సంబంధాలు, రాజకీయ వ్యవహారాలు, విశ్లేషణలో మంచి అనుభవం గడించారు. గతంలో డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి, కె వి పి రామచంద్ర రావు, మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి తదితర నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఆయనకు సమీప బంధువు కావడం విశేషం.
తిరుపతి రూరల్ మండలం పద్మావతి పురంలో కాపురం ఉన్నారు. ఆర్థిక సామర్థ్యం, కుల బలం, విస్తృత పరిచయాలు, అనుభవం ఉన్నందున ఆయన వైసిపి అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని సమర్థవంతంగా ఎదుర్కొంటారని అంటున్నారు. నియోజక వర్గంలో 59 వేల మంది రెడ్డి సామాజిక వర్గం ఉన్నారని అంటున్నారు. రెడ్డి సామాజిక వర్గం ఓట్లలో చీలిక తెస్తే వైసిపిని సులభంగా ఓడించే అవకాశం ఉందన్నారు. ఆయన పెడకంటి రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి కావడం కలసి వచ్చే అంశం అంటున్నారు. చంద్రగిరి, రామచంద్రాపురం, చిన్నగొట్టిగల్లు, ఎర్రావారి పల్లె, తిరుపతి రూరల్ మండలంలో ఆయన సామాజిక వర్గం బలమైన ఓటు బ్యాంకు కలిగి ఉంది. ఆయన బంధువులలో పలువురు రాజకీయంగా పలుకుబడి కలిగి ఉన్నారు. నియోజక వర్గంలో 20 వేలకు పైగా ఆ సామాజిక వర్గీయులు ఉన్నారు.
అలాగే జి డి నెల్లూరు నియోజక వర్గంలో 38 వేలు, తిరుపతిలో 18 వేలు, నగరిలో 12 వేల మంది ఉన్నారు. జిల్లాలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు రెండు లక్షల మంది ఉన్నప్పటికీ ఒక ఎమ్మెల్యే కూడా లేరు. కడప జిల్లాలో ప్రతి సారి ఆ వర్గానికి చెందిన ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. చిత్తూరు జిల్లాలో గతంలో పుత్తూరు నియోజక వర్గం నుంచి పందికుంట నారాయణ రెడ్డి, మదనపల్లె నుంచి ఆవుల మోహన్ రెడ్డి కాంగ్రెస్ టికెట్టుపై ఒక్కొక్క సారి ఎన్నికయ్యారు. 1989లో బోడిరెడ్డి రామకృష్ణా రెడ్డి పుత్తూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. తరువాత ఆ వర్గం నాయకులు అణచివేతకు గురయ్యారు. దీనితో ఆయన ఎన్నికల బరిలో దిగాలని చూస్తున్నారు. ఆయనకు చంద్రగిరి టికెట్టు ఇస్తే తిరుపతి, నగరి, జి డి నెల్లూరు నియోజక వర్గాలలో ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు.