జిల్లాలో రెండు అసెంబ్లీ, పార్లమెంటు సీట్లకు బీజేపీ టెండర్ !
పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు పార్లమెంటు, మరో రెండు లేక మూడు అసెంబ్లీ స్థానాలను అడుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు సీట్ల కేటాయింపు విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. జిల్లాలో బిజెపికి రెండు పార్లమెంటు స్థానాలు ఇస్తే, టిడిపికి ఒకటి మాత్రమే మిగులుతుంది. అలాగే జనసేన కూడా రెండు, మూడు అసెంబ్లీ స్థానాలను అడుగుతోంది. దీంతో తెలుగుదేశం పార్టీ జిల్లాలో రెండు పార్లమెంటు మూడు ఐదు అసెంబ్లీ స్థానాలను మిత్రపక్షాలకు ఇవ్వడం కారణంగా బారీగా నష్టపోయే అవకాశం ఉంది. దీంతో తెలుగుదేశం పార్టీ కేడర్లో కూడా తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉంది. కావున సీట్ల కేటాయింపు విషయంలో తెలుగుదేశం పార్టీ ఆచితూసి అడుగులు వేస్తోంది.
జనసేన పార్టీకి రాష్ట్రంలో 24 అసెంబ్లీ స్థానాలను కేటాయించారు. అయితే అవి ఏ స్థానాలు అన్నది క్లారిటీ లేదు. చిత్తూరు జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తి, మదనపల్లి స్థానాలను అడుగుతున్నట్టు సమాచారం. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా పొత్తులో భాగంగా తిరుపతి, రాజంపేట పార్లమెంటు స్థానాలను అడుగుతోంది. తిరుపతి నుండి మాజీ ఐఏఎస్ అధికారిని రత్నప్రభను రంగంలోకి బిజెపి దించనుంది. గతంలో కూడా ఆమె పోటీ చేశారు. అలాగే రాజంపేట నియోజకవర్గం నుంచి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఎన్నికల బరిలోకి దించడానికి వ్యూహరచన జరిగింది. ఆయన రాజంపేట నుండి విజయం సాధిస్తే, కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచన బిజెపికి ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే భవిష్యత్తులో రాష్ట్ర పార్టీ బాధ్యతలను కూడా కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగించే అవకాశం ఉంది.
తిరుపతి, శ్రీకాళహస్తితో పాటు మదనపల్లి స్థానాన్ని కూడా బిజెపి ఆశిస్తున్నట్లు సమాచారం. తిరుపతి నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డిని, శ్రీకాళహస్తి నుంచి ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు కోలా ఆనంద్ ను, మదనపల్లి నుంచి ఆ పార్టీ సీనియర్ నేత చల్లపల్లి నరసింహారెడ్డిని రంగంలోకి దించే అవకాశం ఉంది. ఇదివరకు తెలుగుదేశంతో పొత్తులో భాగంగా బిజెపి తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి, విజయం సాధించింది. గతంలో తంబళ్లపల్లి అసెంబ్లీ సీట్లు బిజెపికి కేటాయించినా, అక్కడ గెలవలేకపోయింది. దీంతో ఈ పర్యాయం తంబళ్లపల్లె కాకుండా మదనపల్లి నుంచి నరసింహారెడ్డిని పోటీ చేయించాలనే ఉద్దేశం బిజెపికి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు బిజెపికి ఇస్తారో వేచి చూడాల్సిందే. శ్రీకాళహస్తి సీటును కోలా ఆనంద్ కోసం బీజేపి గట్టిగా అడుగుతున్నట్లు సమాచారం. పొత్తు ఉంటే కోలా ఆనంద్ కు శ్రీకాళహస్తి టికెట్ ఖాయం అనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది.