7, ఫిబ్రవరి 2024, బుధవారం

పీలేరు టీడీపీ అభ్యర్థిగా కిషోర్ కుమార్


పీలేరు నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేరు ఖరారు  అయ్యింది. ఈ మేరకు రెండు రోజుల కిందట టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు పిలుపు మేరకు విజయవాడలో  వెళ్లారు. అక్కడ 15 నిమిషాల పాటు చంద్రబాబు కిషోర్ కుమార్ తో మాట్లాడారు. ఈ సమావేశంలో పీలేరు అభ్యర్థిగా ఖరారు చేసినట్లు తెలియచేశారు. ఎన్నికల్లో అనుచరిం చాల్చిన వ్యూహం గురించి దిశా నిర్ధేశం చేశారు. అలాగే రాజంపేట పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థుల గురించి కూడా చర్చించారు. తొందరలోనే మిగిలిన అభ్యర్థుల ఖరారు ఉంటుందని చెప్పారు. దీంతో నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి ఎన్నికల ఏర్పాట్లు, ప్రచార వ్యూహం మీద దృష్టిని సారించారు.


పిలేరులో  కిశోర్ కుమార్ రెడ్డి గెలుపు నల్లేరు మీద నడకే అన్న అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. వైసిపి ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డిపై ఆధిపత్యం సాధించేందుకు కిషోర్ గట్టిగా పనిచేస్తున్నారు. కిషోర్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో  మంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం తృటితో తప్పింది. అన్న కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. కిషోర్ కుమార్ కాకుండా నియోజకవర్గంలో తెదేపా టిక్కెట్టు అడిగే వాళ్ళు ఎవరూ లేరు. 


తొలి నుంచి నల్లారి, చింతల కుటుంబాల మధ్య నువ్వా నేనా అన్నట్టు రాజకీయ పోరు సాగుతున్నది. 2009కి ముందు ఈ రెండు కుటుంబాలు వాయల్పాడు నియోజకవర్గంలో తలపడేవి.  తెలుగు దేశం పార్టీ ఏర్పడిన తరువాత 1983లో జరిగిన ఎన్నికల్లో కిషోర్ కుమార్ రెడ్డి తండ్రి, మాజీ మంత్రి నల్లారి అమరనాద రెడ్డి (కాంగ్రెస్),  చింతల రామచంద్రా రెడ్డి తండ్రి చింతల సురేంద్ర రెడ్డి (టిడిపి) చేతిలో ఓటమి పాలయ్యారు. 1985 లో అమరనాద రెడ్డి,  సురేంద్ర రెడ్డిపై విజయం సాధించారు.1978 లో అమరనాద రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి మంత్రి అయ్యారు. కిషోర్ అన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 1989లో  కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి చింతల రామచంద్రా రెడ్డిని ఓడించారు. 1994 మళ్ళీ చింతల రామచంద్రా రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిపై విజయం సాధించారు. తరువాత వరుసగా 1999, 2004 ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజక వర్గాల పునర్విభజన తరువాత ఈ రెండు కుటుంబాలు పీలేరు కేంద్రంగా పోరు సాగిస్తున్నాయి. 2009 ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి పీలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి  టిడిపి అభ్యర్థి ఇంతియాజ్ అహ్మద్ పై 9132 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో పిఆర్పీ అభ్యర్ధి చింతల రామచంద్రా రెడ్డికి  టిడిపి కంటే 576 ఓట్లు తక్కువగా  44,197 ఓట్లు రావడం విశేషం.
తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో 2011నుంచి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రిగా పనిచేశారు. 



రాష్ట్రం విడిపోయిన తరువాత ఆయన జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టారు. పీలేరు నియోజకవర్గంలో ఆయన పోటీ చేయకుండా తన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డిని పోటీ పెట్టారు. ఆ ఎన్నికల్లో కిషోర్ కుమార్ రెడ్డి, వైసిపి అభ్యర్థి చింతల రామచంద్రా రెడ్డి చేతిలో 15,315 ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. తరువాత 2017 లో కిషోర్ టిడిపిలో చేరి ఎపి హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. 2019 ఎన్నికల్లో ఆయన టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి వైసిపి అభ్యర్థి చింతల రామచంద్రా రెడ్డి చేతిలో 7874 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014 లో 56,636 ఓట్లు వచ్చిన కిషోర్ 2019 లో 80,426 ఓట్లు సాధించారు. అంటే 23,790 ఓట్లు పెరిగాయి. రామచంద్రా రెడ్డికి 15351 ఓట్లు  పెరిగాయి. 

ఈ రెండు కుటుంబాల మధ్య గెలుపు ఓటములు సమానంగా ఉన్నాయి. ఇప్పుడు టిడిపికి అనుకూల వాతావరణం ఏర్పడటం, చంద్రబాబు పట్ల సానుభూతి పెరగడం, పార్టీ పటిష్టంగా ఉండటం లాంటి అంశాలు కిషోర్ కుమార్ రెడ్డికి కలసి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ సారి కిషోర్ గణనీయమైన మెజారిటీ సాధిస్తారని పార్టీ పరిశీలకుడు, రాష్ట్ర కార్యదర్శి సూరా సుధాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా నుండి మంత్రి పదవి ఖాయమని కిషోర్ అనుచర వర్గం ధీమాగా ఉన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *