27, ఫిబ్రవరి 2024, మంగళవారం

జీడీ నెల్లూరు వైసీపీ అభ్యర్థిగా కృపాలక్ష్మీ?


గంగాధర నెల్లూరు వైసిపి అభ్యర్థి మరో మారు మరే సూచనలు కనిపిస్తున్నాయి.  టికెట్టు  డిప్యూటీ సిఎం నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మిని వరిస్తుందని విశ్వసనీయ సమాచారం. ఆమె సోమవారం కుప్పంలో జగన్ ను కలసి ఆశీర్వాదం తీసుకున్నారు. వయా మీడియాగా స్వామి ప్రత్యర్థులు కూడా ఆమె అయితే అడ్డు చెప్పక పోవచ్చు అంటున్నారు. రాజంపేట ఎంపి మిథున్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఈ మేరకు కృపాలక్ష్మికి తెలియచేశారని సమాచారం. అయితే, కృపాలక్ష్మీ మాత్రం తండ్రి, ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి పోటీ చేస్తే బాగుంటుందని అన్నట్లు తెలిసింది. అధిష్టానం మాత్రం కృపాలక్షి పట్ల మొగ్గుచూపుతున్నారని తెలిసింది.
తొలినుంచీ స్వామి టికెట్టు వ్యవహారం వివాదాస్పదంగా ఉంది. స్థానిక, జిల్లా నేతల వ్యతిరేకత నేపథ్యంలో ఆయనకు టికెట్టు రాదని వార్తలు వచ్చాయి. 


ప్రభుత్వ సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి, ఆయన వర్గం  నేతలు స్వామిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీరికి జిల్లాకు చెందిన కీలక నేత ఆశీస్సులు ఉన్నాయి. దీనితో స్వామిని చిత్తూరు ఎంపీగా పంపి ఎంపి రెడ్డప్పకు ఎమ్మెల్యే టికెట్టు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. అయితే స్వామి జగన్ ను కలసి తిరిగి ఎమ్మెల్యే టికెట్టు తనకే అనిపించుకున్నారు.  అయితే పట్టు విడవని విక్రమార్కుడిలా జ్ఞానేంద్ర రెడ్డి వర్గం జగన్ వెంట పడుతున్నది.  ఆయనకు నియోజక వర్గంలో చాలా వ్యతిరేకత ఉందని గెలుపు కష్టం అంటూ జగన్ కు వర్తమానం పంపుతున్నారు.


 సోమవారం కుప్పం వచ్చిన జగన్ ను, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి దయాసాగర్  కలిసి స్వామికి టికెట్టు ఇస్తే సీటు పోగొట్టు కోవలసి వస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో స్వామిని ఔను అనలేక, ప్రత్యర్ధులను కాదనలేక  మధ్యే మార్గంగా ఆయన కుమార్తెకు టికెట్టు ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్టు తెలిసింది. దీంతో టికెట్టు మూడవ సారి మారినట్టు అవుతుంది. ఇదిలా ఉండగా స్వామిని కాదనుకుంటే మాజీ మంత్రి డాక్టర్ కుతూహలమ్మ కుమారుడు హరికృష అయితే మంచిదని ఒక వర్గం అంటున్నది. ఆయన గతంలో టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన పట్ల ప్రజల్లో సానుభూతి ఉందంటున్నారు. పైగా ఆయన అయితే టిడిపిలో బలమైన వర్గం బయటికి వచ్చి మద్దతు ఇస్తుందని అంటున్నారు. 


కాగా వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ రెడ్డి కూడా టికెట్టు ఆశిస్తున్నారు. మాజీ టిడిపి ఎంపీ శివప్రసాద్ చెల్లులు అయిన ఆమెకు నియోజక వర్గంలో మంచి బంధువర్గం ఉందని అంటున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ గాలి వీయడం, రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గం పూర్తిగా మద్దతు ఇవ్వడం వల్ల నారాయణ స్వామి గెలిచారని విశ్లేషిస్తున్నారు. అయితే ఇప్పుడు జగన్ గాలి తగ్గడం, రెడ్డి సామాజికవర్గం వ్యతిరేకత వల్ల మంచి అభ్యర్థిని పెట్టకపోతే పార్టీ నష్టపోతుందని కొందరు సీనియర్ నాయకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో స్వామి కొన సాగుతారా ! కూతురిని టికెట్టు వరిస్తుందా లేక కొత్త అభ్యర్థి తెరపైకి వస్తారా అన్నది రెండు మూడు రోజుల్లో తేలిపోతుంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *