చిత్తూరు టీడీపీ టిక్కెట్టు రేసులో DK తేజశ్వరి
చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు క్రమంగా మారుతున్నాయి. కొత్త అభ్యర్థులు రంగప్రవేశం చేస్తున్నారు. ఇదివరకు టిక్కెట్ వినాశించిన కొందరు మిన్నకుంటున్నారు. చిత్తూరు నియోజకవర్గంలో టికెట్ల వ్యవహారం గందరగోళంగా తయారయ్యింది. కనీసం నియోజకవర్గానికి ఇంచార్జి కూడా లేరు. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో ఒకటి రెండు పేర్లతో దాదాపుగా జాబితాలు ఖరారయ్యాయి. అయితే చిత్తూరు నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి గందరగోళం, అయోమయంగా ఉంది.
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఏ ఎస్ మనోహర్ ఎన్నికల తర్వాత రాజకీయాలకు, తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. దీంతో నియోజకవర్గంలో కొత్త నాయకులు తెర మీదకు వచ్చారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కాజూరు బాలాజీ, మున్సిపల్ మాజీ మేయర్ కటారి హేమలతలు మొదటినుంచి తెలుగుదేశం పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. పార్టీ ఇచ్చిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీకి అండదండగా ఉంటున్నారు. నగర పార్టీ అధ్యక్షురాలు అయిన హేమలత అన్ని కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్నారు. అనంతరం చిత్తూరు ఎమ్మెల్యేగా నాలుగు పర్యాయాల పనిచేసిన సీకే బాబు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన ఒకటి రెండు కార్యక్రమాల్లో పాల్గొని, తర్వాత స్థానిక నాయకులతో ఆయనకు సమన్వయం కుదరకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కూడా చిత్తూరు టికెట్లను ఆశిస్తున్నారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ గా, చిత్తూరు ఎంపీపీ గా పని చేసిన చంద్ర ప్రకాష్ కూడా తెరమీదకి వచ్చారు. ఆయన సతీమణి గీర్వాణి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. ఆయన కూడా టికెట్ ఆశిస్తూ పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అలాగే బంగారుపాలెంకు చెందిన హోటల్ భాస్కర అధినేత ఎన్ పి జయప్రకాష్ కూడా టికెట్ ని ఆశించారు. ఇది ఇలా ఉండగా గుడిపాల మండలానికి చెందిన గురజాల జగన్మోహన్ నాయుడు ఇటీవల కాలంలో క్రియాశీలకమయ్యారు. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలన్నీ ఆయన ఆధ్వర్యంలోని జరుగుతున్నాయి. పేదలకు నాలుగు చక్రాల బండ్లను పంచడం, నిత్యావసర వస్తువులు పంచడం తదితర కార్యక్రమాలతో జగన్ మోహన్ నాయుడు ప్రజల్లోకి చొచ్చుకు పోతున్నారు. దాన ధర్మాలు కూడా చేస్తున్నారు. యువగళం ముగింపు యాత్రకు కూడా ఆయన 40 లక్ష రూపాయల వ్యయంతో ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ఆధ్వర్యంలో టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులందరూ చిత్తూరు పట్టణంలో ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నారు.
గంగాధర నెల్లూరులో జరిగిన రా కదలిరా సభ వేదిక మీద డీకే ఆదికేశవులు కుమార్తె డీకే తేజశ్వరి రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ నాటి నుంచి చిత్తూరులో టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులతో పాటు ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తనకు టికెట్ ఇవ్వాల్సిందిగా ఆమె అధిష్టానంను కోరుతున్నారు. గతంలో ఆమె తండ్రి ఆదికేశవులు చిత్తూరు పార్లమెంటు సభ్యులుగా, టిటిడి చైర్మన్ గా పనిచేశారు. అలాగే తల్లి సత్యప్రభ చిత్తూరు శాసన సభ్యురాలుగా పనిచేశారు. గత ఎన్నికల్లో రాజంపేట టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికలలో డీకే ఆదికేశవులు కుమారుడు డీకే శ్రీనివాసులు రాజకీయ అరంగేట్రం చేస్తారని పలువురు భావించారు. ఆయన కోసం తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కూడా ప్రయత్నం చేశారు. అయితే డీకే శ్రీనివాసులు రాజకీయాలలో రావడానికి విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ఆయన సోదరి తేజశ్వరి చిత్తూరులో రాజకీయరంగ ప్రవేశం చేసినట్లు చెబుతున్నారు. సాధారణంగా చిత్తూరు అసెంబ్లీ టికెట్లు తెలుగుదేశం పార్టీ బలిజ సామాజిక వర్గానికి కేటాయించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ పర్యాయం కూడా బలిజ సామాజిక వర్గానికి కేటాయించాలని అనుకుంటే డీకే ఆదికేశవులు కుమార్తె డీకే తేజశ్వరికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.