సర్వేలతో శ్రీకాళహస్తి టిడిపిలో గందరగోళం !
శ్రీకాళహస్తి నియోజక వర్గం టిడిపి అభ్యర్థి ఎంపిక కోసం నిర్వహించిన ఐ వి ఆర్ ఎస్ సర్వేలు గందరగోళం సృష్టించాయి. అర్థం లేని విధంగా సర్వేలు రావడంతో ఇంచార్జి బొజ్జల సుధీర్ రెడ్డి అసహనానికి గురయ్యారు. ఇటీవల అయనతో పాటు ఆయన తల్లి బృందమ్మ పేరును సర్వేలో చేర్చారు. శనివారం ఆయన భార్య రిషితా రెడ్డి పేరుతో పలువురికి ఐ వి ఆర్ ఎస్ మెసేజ్ లు వచ్చాయి. ఆమె మంచి అభ్యర్థి అయితే ఒకటి, నోటా అయితే రెండు నొక్కమని సందేశంలో కోరారు. దీనితో నియోజక వర్గం ఓటర్లలో పలు అనుమానాలు తలెత్తాయి. ఒకే ఇంటిలో ముగ్గురి పేర్లు అడగడం అంతరార్థం ఏమిటి అన్న ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది.
సుధీర్ రెడ్డి తండ్రి మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మీద చంద్రబాబుకు ఉన్న కృతజ్ఞతా భావం వల్ల ఆ కుటుంబ సభ్యులలో మెరుగైన వారికి ఇవ్వడానికే అలా సర్వే చేశారని కొందరు అంటున్నారు. సుధీర్ పని తీరు బాగా లేనందున ఆయన తల్లి లేదా భార్యకు ఇస్తే మంచిదని భావిస్తున్నట్టు సమాచారం. ఆయన భార్య అయితే ఒక యువ మహిళకు ఇచ్చినట్టు ఉంటుందని అంటున్నారు. అయితే ఈ విషయం సుధీర్ రెడ్డికి మింగుడు పడలేదు. దీనితో ఆయన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కు ఫోన్ చేసి తన నిరసన తెలిపారని వార్తలు వచ్చాయి.
తొలి నుంచీ చంద్రబాబు వెన్నంటి ఉన్న తన కుటుంబం పట్ల విశ్వాసం లేక పోవడం పట్ల కొంత విచారం వ్యక్తం చేశారని కొందరు అంటున్నారు. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు పేరు కూడా పరిశీలనలో ఉందని తెలిసింది. ఆయనకు టికెట్టు ఇస్తే సత్యవేడు నియోజక వర్గంలో కూడా లాభం చేకూరే అవకాశం ఉందంటున్నారు.
సుధీర్ రెడ్డి కుటుంబానికి సర్వేలో అనుకూల ఫలితాలు రాక పోతే ఎస్సీవీ నాయుడుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నది. అయితే బిసి అభ్యర్థికి కేటాయించాలని ఆ వర్గం వారు కోరతున్నారు. ఇదిలా ఉండగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువ విద్యా వేత్త కూడా లోకేష్ ను కలసి పోటీకి సిద్దంగా ఉన్నట్టు చెప్పినట్టు తెలిసింది.
ఇదిలా ఉండగా వెంకటగిరి నియోజక వర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణకు టికెట్టు ఇస్తే ఇక్కడ రెడ్డి లేదా బిసి వ్యక్తికి టికెట్టు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఒక వేళ అక్కడ ఎమ్మెల్యే ఆనం రామ నారాయణ రెడ్డికి ఇస్తే ఇక్క కమ్మ సామాజిక వర్గానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు.
తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలలో మూడు స్థానాలు ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ చేశారు. తిరుపతి టికెట్టు బలిజ సామాజిక వర్గానికి సర్వేపల్లి టికెట్టు పోలిట్ బ్యూరో సభ్యడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కి ఇస్తారు. మిగిలిన రెండింటిలో ఒకటి రెడ్డి లేదా బిసికి మరొకటి కమ్మ సామాజికవర్గానికి కేటాయిస్తారు. ఏది ఏమైనా శ్రీకాళహస్తి టికెట్టు ఎవరికి అన్న గందరగోళం కొన్నాళ్ళు కొనసాగేలా ఉంది.