టీడీపీకి బీసీ నేత అశోక్ రాజు రాం.. రాం..
నగరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ బీసీ నేత, విద్యా సంస్థల అధిపతి డాక్టర్ కొండూరు అశోక్ రాజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు గురువారం ఆయన తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన ప్రకటించారు. నగరి అసెంబ్లీ టికెట్టును ఎవరితో సంప్రదించకుండా ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు ప్రకటించడం పట్ల తాను తీవ్ర కలత చెందినట్లు అశోక్ రాజు తెలిపారు. చంద్రబాబు నాయుడు వైఖరికి, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ అభ్యర్థిత్వాన్ని అంగికరించలేక తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వివరించారు.
డాక్టర్ కొండూరు అశోక్ రాజు నగరి నియోజకవర్గంలో బలమైన బీసీ రాజుల సామాజికవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత. ఆయన ప్రారంభంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు దగ్గర పిఏగా పనిచేశారు. అనంతరం నగరిలో ఇంజనీరింగ్ కళాకారులను స్థాపించి, ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. దానితో పాటు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. గత మూడు ఎన్నికలలో అశోక్ రాజు నగరి అసెంబ్లీ టికెట్లు ఆశిస్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం ఆయనకు టికెట్టు అందినట్లే అంది చేజారిపోతుంది.
గురువారం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అశోక్ రాజు మాట్లాడుతూ.. నగిరి టిడిపి అభ్యర్థి గాలి భానుప్రకాష్ మీద సంచలన ఆరోపణలు చేశారు. ఆయన గంజాయి కేసులో నిందితుడని విమర్శించారు. ఆయన నియోజకవర్గంలో ఎవరిని కలుపుకొని పోవడం లేదని, కార్యకర్తలు, నాయకులతో సత్సంబంధాలు లేవని తెలిపారు. ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన అభ్యర్థిత్వాన్ని నగరి నియోజకవర్గ ప్రజలు అంగీకరించడం లేదన్నారు. అలాగే గాలి భానుప్రకాష్ తల్లి సరస్వతమ్మ, తమ్ముడు జగదీష్ లు కూడా గాలి భానుప్రకాష్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి, స్వర్గీయ ముద్దుకృష్ణమనాయుడు ఆత్మకు శాంతి చేకూరాలంటే చిన్న కుమారుడు జగదీష్ టికెట్టు ఇవ్వాలని ముద్దు కృష్ణమ నాయుడు సతీమణి గాలి సరస్వతమ్మ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
నగిరిలో పార్టీ నాయకులను, కార్యకర్తలను గౌరవించని భానుప్రకాష్ ను నగిరి నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల అశోక్ రాజు నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు టికెట్టు ప్రకటించే ముందు ఎవరిని సంప్రదించలేదన్నారు. దీంతో మనస్థాపం చెందిన తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపమన్నారు. తన రాజకీయ భవిష్యత్తు గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. తన శ్రేయోభిలాషులు, తనతో కలిసి వచ్చే పార్టీ నాయకులతో సమాలోచనలు జరిపి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటానని అశోక్ రాజు తెలిపారు.