21, ఫిబ్రవరి 2024, బుధవారం

పలమనేరు వైసీపీ అభ్యర్థి ఎవరు ?


పలమనేరు వైసీపీ అభ్యర్థి ఎవరనే  విషయమై రాజకీయ వర్గాలలో జోరుగా ఊహాగానాలు సాగుతోంది. పలమనేరు నియోజకవర్గంలో రోజురోజుకు వైసిపి రాజకీయం మారుతుంది. తొలుత ప్రస్తుత ఎమ్మెల్యే వెంకటే గౌడకు టిక్కెట్టు ఖరారు అని ప్రచారం జరిగింది. కొద్దిరోజులకు తెలుగుదేశం పార్టీలో అసంతృప్తిగా ఉన్న సుభాష్ చంద్రబోస్ పార్టీలో చేరారు. దీంతో బోస్ కు టికెట్ హామీ ఇచ్చి ఆయనను పార్టీలోకి ఆహ్వానించాలని ప్రచారం జరిగింది. ఇటీవల కాలంలో అధిష్టానం ఆదేశిస్తే పలమనేరు ఎమ్మెల్యేగా తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని జిల్లా పరిషత్ చైర్మన్ గోవింద శ్రీనివాసులు సంచలన ప్రకటన చేశారు. దీనికి అంతే ధీటుగా ఎమ్మెల్యే టిక్కెట్టు తన జేబులో ఉందని, రానున్న ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని గౌడ సమాధానం ఇచ్చారు.  అధిష్టానానికి వీర విదేయుడైన జిల్లా పరిషత్ చైర్మన్ ఆ వ్యాఖ్యలు చేయడం వెనుక ఏదో అంతరార్థం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఎవరు అభ్యర్థి అన్న విషయమై అధిష్టానం ఊహాగానాలకు తెరదించే ప్రయత్నం చేయలేదు. ఏడవ జాబితాలో కూడా పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ పేరు లేకపోవడంతో అభ్యర్థి మార్పు ఉండవచ్చునన్న ఊహాగానాలు జోరందుకున్నాయి.


చిత్తూరు జిల్లా పలమనేరులో 2019 లో జరిగిన ఎన్నికల్లో ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని యువకుడు రాజకీయ దిగ్గజం, మంత్రి అమర్నాథ రెడ్డిని ఓడించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొదట నుండి జిల్లా మంత్రి పెద్దిరెడ్డికి సన్నిహితుడుగా మెలుగుతూ రాజకీయాలు సాగించారు. అప్పటినుండి గడపగడపకు వైయస్సార్ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్లారు.  వెంకట్ గౌడ రాబోయే ఎన్నికలకు వైసీపీ అభ్యర్థి తనే అంటూ సీటు పక్కా అనే సంకేతాలు ఇస్తూ ప్రత్యామ్యాయం లేకుండా చేసుకున్నారు. అక్కడే కథ అడ్డం తిరిగింది. నియోజకవర్గ ప్రజలకు దగ్గర ఉంటూనే అధిష్టానానికి దూరంగా ఉండడం, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ముఖ్యమంత్రి వచ్చినా, సన్నాహాక సమావేశాలు జరిగిన కనిపించక మంత్రి పెద్దిరెడ్డికి తలనొప్పిగా మారారు. ఇదే సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన సొంత పార్టీలో అసంతృప్తులను బుజ్జగించడంలో విఫలమయ్యారని చర్చ ప్రారంభం అయ్యింది.


నియోజకవర్గంలోని పార్టీ సీనియర్ నాయకులైన పెద్ద పంజాని విజయభాస్కర్ రెడ్డి, సివి కుమార్, రాకేష్ రెడ్డికి వంటి వారు పార్టీకి దూరమయ్యారు. సొంత పార్టీ నేతలతోను ఎమ్మెల్యేకు సఖ్యత లేకపోవడంతో ఇబ్బంది అయ్యింది. ముఖ్యంగా సొంత మండలమైన వి.కోటలో జెడ్పి చైర్మన్ శ్రీనివాసులుతో ప్రతి విషయంలో బహిరంగంగానే వెంకటే గౌడ విభేదిస్తూ వస్తున్నారు. ప్రతి మండలంలోనూ ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఉంది అనడంలో సందేహం లేదు. దీనికి తోడు ఎమ్మెల్యే తన నుండి బలవంతంగా క్వారీ లాక్కున్నాడన్న జనార్ధన నాయుడు అనే వ్యక్తి ఆరోపణలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కుప్పంలో జరిగిన చంద్రబాబు యాత్రలో వెంకటే గౌడ గురించి తనకు జరిగిన అన్యాయాన్ని బహిరంగంగా ప్రజలకు జనార్ధన నాయుడు వివరించారు. ఎమ్మెల్యే అనుచరుల, కౌన్సిలర్ల భూకబ్జాలు, ఇసుక దందాలు వంటి ఆరోపణలతో నిత్యం గౌడ వార్తలలో నిలిచారు. టిడిపి అభ్యర్థి మాజీ మంత్రి అమర్నాథరెడ్డి వెంకట్ గౌడ ఆగడాలను, వారి అనుచరులు చేస్తున్న అరాచకాలను గ్రామగ్రామాన ప్రజలకు  వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటే గౌడకు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు జరిగుతున్నాయి. వీటన్నింటిని చూస్తున్న ప్రజలు విసిగిపోయారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నాయకుడు ఆర్వీ సుభాష్ చంద్రబోస్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు, ఆయన ప్రభావం పెద్దగా నియోజకవర్గ రాజకీయాల మీద దృష్టిని సారించడం లేదని పలమనేరు ప్రజలు అంటున్నారు.


మండల స్థాయిలో జరుగుతున్న జగనన్న ఆసరా కార్యక్రమాన్ని కూడా మధ్యలో నిలుపుదల చేసిన ఎమ్మెల్యే ప్రవర్తన నాయకులకు అర్థం కావడం లేదు. నియోజకవర్గ నాయకులకు కూడా ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఎమ్మెల్యే గౌడ వ్యవహారాన్ని గమనిస్తున్న పెద్దిరెడ్డి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు  ఆలోచిస్తున్నారంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. నియోజకవర్గంలో తాను చేసిన కాంట్రాక్టులకు నిధులను మంజూరు చేయాలంటూ కూడా అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు టికెట్టు నాది అని చెప్పుకుంటున్న వెంకట్ గౌడ రానున్న ఎన్నికల బరిలో దిగుతాడా లేదా అన్న విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.


ఈ నేపథ్యంలోనే పలమనేరు నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. పలమనేరు అసెంబ్లీ అభ్యర్థిగా తనకు అధిష్టానం అవకాశం ఇస్తే పోటీ చేస్తానని జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ప్రకటించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా వున్న వెంకటే గౌడను మార్చాలని, ఆయన స్థానంలో పోటీ చేయాలని అధిష్ఠానం నిర్ణయిస్తే కచ్చితంగా పోటీ చేసి గెలిచి పలమనేరు నియోజకవర్గాన్ని వైసీపీ ఖాతాలో వేస్తానని జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ధీమాగా ఉన్నారు. తన అభ్యర్థిత్వానికి పలమనేరు మున్సిపల్ చైర్ పర్సన్ చాముండేశ్వరి సుధ, మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ రెడ్డి, పెద్దపంజాణి, బైరెడ్డిపల్లి, పలమనేరు, గంగవరం ఎంపీపీలు రెడ్డెప్ప, రెడ్డెప్ప, శ్రీదేవి, మురళీమోహన్ రెడ్డి తదితరులు మద్దతు ఇస్తున్నారని వివరించారు. పలమనేరు స్థానానికి పోటీ చేసే విషయమై చైర్మన్  తన అనుచరులతో కూడా మంతనాలు చేశారు. దీంతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు ఉండడంతో ఈసారి కచ్చితంగా జడ్పీ చైర్మన్ శ్రీనివాసులకి టికెట్ వస్తుందని పలమనేరు నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారు. మొత్తం మీద రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి, మాజీమంత్రి అమరనాథ రెడ్డిపై వైసిపి అధిష్టానం ఎవరిని అభ్యర్థిగా నిర్ణయిస్తుందో రాజకీయ పరిశీలకులు, నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *