5, ఫిబ్రవరి 2024, సోమవారం

పవన్ తీరుపై నేతల అసంతృప్తి !




 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరి పట్ల ఉమ్మడి చిత్తూరు జిల్లా టిడిపి, జనసేన నేతల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. కొందరు పొత్తు తమ పాలిట విపత్తుగా  మారిందంటున్నారు. సీట్ల కేటాయింపు తీరు విమర్శలకు తావిస్తోంది. జనసేనకు ఎలాంటి బలం లేక పోయినా కులం ఓట్లు చూసి టికెట్లు అడగడం పట్ల టిడిపి నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లి, గంగాధర నెల్లూరు, శ్రీకాళహస్తి నియోజకవర్గాలలో జనసేనకు బలమైన అభ్యర్థులు ఉన్నారు. పార్టీ కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఇలాంటి నియోజకవర్గాలను పట్టించుకోకుండా కేవలం బలిజ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న తిరుపతి, చిత్తూరు నియోజక వర్గాలను జనసేన అడిగినట్లు, అవి ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి చిత్తూరులో ఇప్పటివరకు అభ్యర్థి నేను అని ఎవరూ ముందుకు రాలేదు. మదనపల్లి, గంగాధర నెల్లూరు, శ్రీకాళహస్తి నియోజకవర్గాలలో అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అక్కడ జనసేన టిక్కెట్ల కోసం పట్టుపట్టకపోవడం, బలిజలు ఎక్కువ ఉన్న సీట్లు అడగడంతో సొంత పార్టీలో, మిత్రపక్షంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


2019 ఎన్నికల్లో  తిరుపతి నియోజక వర్గంలో టిడిపి అభ్యర్థి ఎం సుగుణమ్మ వైసిపి అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి చేతిలో కేవలం 708 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఇక్కడ జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన చదలవాడ కృష్ణమూర్తికి కేవలం 12315 ఓట్లు మాత్రమే వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు అయిన చదలవాడ పోటీ చేస్తేనే అంత తక్కువ వచ్చిన స్థానాన్ని జనసేన అడగడములో  అర్థం లేదంటున్నారు. పైగా జనసేన టికెట్టు ఆశిస్తున్న డాక్టర్ హరిప్రసాద్, కిరణ్ రాయల్ కు సర్వేలలో చాలా తక్కువ శాతం స్కోర్ వచ్చిందని అంటున్నారు. సుగుణమ్మ తప్ప ఇక్కడ ఎవరికి టికెట్టు ఇచ్చినా ఓటమి తప్పదని టిడిపి సీనియర్ నాయకులు అంటున్నారు. గత ఎన్నికల్లో జనసేన పోటీ వల్లనే బలిజ సామాజిక వర్గానికి చెందిన సుగుణమ్మ ఓటమి పాలయ్యారని  అంటున్నారు. 


ఇక చిత్తూరులో జనసేన పార్టీకి దిక్కు లేక పోయినా టికెట్టు అధించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ వైసిపి అభ్యర్థి విజయానంద రెడ్డిని ఎదుర్కొనే బలమైన నేత కోసం అన్వేషించడం మాని, కులం ఆధారంగా టికెట్టు అడగడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. టిడిపిలో బలమైన బలిజ సామాజిక వర్గం నాయకులు ఉండగా జనసేన టికెట్టు అడగడం పట్ల ఆ వర్గంలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. చిత్తూరు, తిరుపతి నియోజక వర్గాలలో టిడిపి బలిజ సామాజిక వర్గానికి చెందిన వారికే టికెట్టు ఇస్తుందని, జనసేనకు కేటాయిస్తే నష్టపోతామని అంటున్నారు. గత ఎన్నికల్లో  పుంగనూరు నియోజక వర్గంలో జనసేన  అభ్యర్ధి రామచంద్ర యాదవ్ కు 16,452 వచ్చాయి. జిల్లాలో అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన పుంగనూరు ఎందుకు అడగడం లేదంటున్నారు. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని ఎదుర్కోవడం కష్టం కాబట్టి పవన్ భయపడుతున్నారని అంటున్నారు. 


గత ఎన్నికల్లో  మదనపల్లె నియోజక వర్గంలో  జనసేన అభ్యర్ధి గంగారపు స్వాతి కి 14,601 ఓట్లు వచ్చాయి. అయితే ఆమె కమ్మ సామాజిక వర్గం కాబట్టి పవన్ టికెట్టు కోసం పట్టు పడ్డడం లేదన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జి డి నెల్లూరు ఎస్సీ నియోజక వర్గం ఇంచార్జి డాక్టర్ పొన్న యుగంధర్ నిత్యం ఉప ముఖ్య మంత్రి కె నారాయణ స్వామితో పోరాటం చేస్తుంటారు. అలాంటి వ్యక్తిని విస్మరించడం తగదని ఆ వర్గం వారు అంటున్నారు. పవన్ అడిగే స్థానాలలో  అధిక శాతం కాపు, బలిజ స్థానాలు ఉండటం కుల తత్వానికి సంకేతంగా భావించక తప్పదంటున్నారు. టిడిపి కమ్మ వారికి, జనసేన కాపు నేతలు టికెట్లు ఇవ్వడం చూసిన వారు జగన్ రెడ్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంలో తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా టిడిపి జనసేన పార్టీలు టికెట్ల కేటాయింపులో కుల సమతుల్యత పాటించాలని కోరుతున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *