10, ఫిబ్రవరి 2024, శనివారం

12న పేటమిట్ట రామాలయం ప్రారంభం


సర్వాంగ సుందరంగా కోదండరామాలయం 
గల్లా రామచంద్రుని సంకల్పం

ఇక్ష్వాకుల తిలకుడు, సూర్యవంశాన జన్మించిన శ్రీ కోదండ రాముడిని స్వగ్రామంలో కొలువుతీర్చేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త అమర రాజ సంస్థల వ్యవస్థాపకులు గల్లా రామచంద్ర నాయుడు చేపట్టిన బృహత్తర కార్యం అవిష్కృతానికి మరో రెండు రోజులు.


పూతలపట్టు మండలం
పేటమిట్ట గ్రామంలో జన్మనిచ్చిన రామచంద్రనాయుడు.. ఊరి రుణం తీర్చుకోడానికి అభివృద్ధి పనులు చేపట్టారు. అనువంశిక మైన ఆథ్యాత్మిక చింతనకు ప్రతిరూపంగా ఒక రామాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. భక్తితత్వాన్ని  ప్రతిబింబించడమే గాక, భక్తి సంప్రదాయాలను పునరుద్ధరణ లక్ష్యంగా.. గ్రామస్తులందరూ స్నేహపూరిత వాతావరణంతో కలిసి మెలసి ఉండే విధంగా ఆలయ సముదాయం ఉండాలని సంకల్పించారు. పదేళ్ల క్రితం మొదలుపెట్టిన ప్రయత్నాలలో భాగంగా గ్రామస్తులు అందరితో చర్చించి గ్రామదేవత విరూపాక్షమ్మ గుడికి చేరువగా ఉన్న గ్రామనత్తం స్థలంతోపాటు 97 సెంట్ల అదనపు స్థలాన్ని కొనుగోలు చేసి ఆలయ సముదాయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆలయ సముదాయ నిర్మాణానికి 2019 జనవరి నెల 20వ తేదిన ఆగమోక్తంగా భూమిపూజ నిర్వహించారు. స్వంత నిధులతో పాటు ముందుకు వచ్చిన పలువురు గ్రామస్తులు భక్తితో సమర్పించిన విరాళాలతో కోదండరామస్వామి దేవాలయాన్ని నిర్మించారు. సీతా లక్ష్మణ సమేత కోదండ రామస్వామి కొలువై ఉండేలా ప్రధాన ఆలయం నిర్మించి, దానికి ఒకవైపు శ్రీకృష్ణమందిరం, మరోవైపు శ్రీ విఘ్నేశ్వరాలయం ఉండేలా రామాలయ సముదాయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణంలో శిల్ప శాస్త్ర నిపుణుల సహకారంతో మహాబలిపురం నుంచి తెప్పించిన కృష్ణ శిలలతో రూపొందించిన నిలువెత్తు స్తంభాలపై దశావతారమూర్తులను చెక్కించి ఆథ్యాత్మిక సౌందర్యాన్ని పెంపొందించారు. ఆలయ ప్రాంగణంలో గ్రామం అంతా ప్రతిధ్వనించే విధంగా మ్రోగే భారీ గంటను ఏర్పాటు చేసారు. ఇక ఆలయ సముదాయంలోనే సమావేశాలు జరుపుకోడానికి వీలుగా మినీ ఓపెన్ ఆడిటోరియం, పండుగలు, వ్రతాల వంటి సామూహిక కార్యక్రమాలకు అనువుగా ఉండే ఎసి కమ్యూనిటీ హాలు, మధ్యలో చిన్నపిల్లలు ఆడుకోడానికి పార్కు వంటి ఏర్పాట్లు చేసారు.


ఇలా పేటమిట్టను మరో అయోధ్యలా తీర్చిదిద్దడం నభూతో నభవిష్యత్ అన్న రీతిన ఉంది. శ్రీ కోదండ రామస్వామి మహా కుంభాభిషేక ఉత్సవాలు ఈ నెల 12న ప్రారంభం కానున్నాయి. 15 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. 15న విగ్రహ ప్రతిష్ఠ, మహా కుంభాభిషేక ఉత్సవాలు జరగనున్నట్లు రామచంద్ర నాయుడు శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. భక్తులు తరలి వచ్చి స్వామి వారి అనుగ్రహానికి పాత్రులు కావాలని పిలుపునిచ్చారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *