తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్థి మార్పు ఉంటుందా ?
తంబళ్లపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఖరారు విషయం తెలుగుదేశం పార్టీలో కాక రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అనుచరులు ఏకంగా పెట్రోల్ డబ్బాలతో పార్టీ అధినేత చంద్రబాబు ఇంటినే ముట్టడించారు. శంకర్ యాదవ్ కు టిక్కెట్ను కేటాయించకపోతే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో చంద్రబాబు నాయుడు శంకర్ యాదవ్ ని పిలిచి చర్చించారు. మళ్లీ నియోజకవర్గంలో ఎంవిఆర్ ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ చేస్తామని ఎవరికి అనుకూలంగా వస్తే వారికి టికెట్ ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. బిసి అభ్యర్థిని పక్కనపెట్టి రెడ్డి సామాజికవర్గానికి టిక్కెట్టు ఇవ్వడం జిల్లాలో చర్చనీయాంశం అయ్యింది.
2004 ఎన్నికలలో శంకర్ యాదవ్ తంబళ్లపల్లె నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. తిరిగి 2019 ఎన్నికల్లో ఆయన పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటినుంచి శంకర్ యాదవ్ నియోజకవర్గాన్ని సక్రమంగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఆయన వ్యాపారానికే పరిమితమై రాష్ట్ర పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు కూడా నిర్వహించలేదని అంటున్నారు. దీంతో శంకర్ యాదవ్ మార్పు ఉంటుందని తొలినుంచి ఊహిస్తున్నారు. కొద్ది రోజులు ఇంచార్జ్ పోస్ట్ నుంచి శంకర్ ను తప్పించి, మళ్లీ తాత్కాలిక ఇన్చార్జిగా మూడు నెలల కాలానికి నియమించారు. తాత్కాలికంగా నియమించినా, ఇప్పటివరకు ఆయనే ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. అయినా శంకర్ యాదవ్ వైఖరిలో మార్పు లేదంటున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా అంగళ్ళకు వచ్చారు. అక్కడ వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద భారీగా దాడులు చేశారు. అక్కడికి వచ్చిన చంద్రబాబు నాయుడు మీద కూడా రాళ్లు వేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుల వాహనాలను ధ్వంసం చేశారు. తిరిగి చంద్రబాబు నాయుడుతో సహా 500 మందికిపైగా టిడిపి కార్యకర్తల మీద కేసులు నమోదు చేశారు. అదే రోజు పుంగనూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో కూడా పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు మాజీ శాసనసభ్యులు, ఇన్చార్జులు, మరో 500 మంది కార్యకర్తల మీద కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో శంకర్ యాదవ్ మీద మాత్రం పోలీసు కేసు నమోదు కాలేదు. ఈ విషయమై విసృతంగా చర్చ జరిగింది. దాడి సమయంలో, ఆ తర్వాత శంకర్ యాదవ్ సరైన రీతిలో స్పందించలేదని శంకర్ యాదవ్ ను పక్కనపెట్టి, ములకలచెరువు మండలానికి చెందిన దాసరపల్లి జయచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడు ఎంపిక చేసినట్లు సమచారం.
ఊహించని విధంగా దాసరపల్లి జై చంద్రారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో శంకర్ యాదవ్ అనుచరులు బగ్గుమన్నారు. శంకర్ యాదవ్ అనుచరులు ఏకంగా పెట్రోల్ డబ్బాలతో చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. శంకర్ యాదవ్ కు మళ్ళి టికెట్ ఇవ్వాల్సిందిగా నినాదాలు చేశారు. దాసరపల్లి జయచంద్రారెడ్డి వైసీపీ కోవర్టు అని నినాదాలు చేశారు. ఆయనకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో వ్యాపార లావాదేవీలు ఉన్నాయని ఆయన పెద్దిరెడ్డి బినామీ అని ఆరోపించారు. జిల్లాలోని పలువులు తెలుగుదేశం పార్టీ నేతలలో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. జయచంద్రారెడ్డికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డితో సన్నహిత సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. ఆయన పార్టీ ఫండ్ ఇవ్వడంతో టికెట్ కేటాయించాలని ఆరోపిస్తున్నారు. ఈ విషయం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. దాసరపల్లి జయచంద్రారెడ్డికి టికెట్ ఇస్తే రానున్న ఎన్నికల్లో పార్టీకి పనిచేయమని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. మండల పార్టీ కార్యవర్గ సభ్యులు రాజనామాలకు కూడా సిద్ధమయ్యారు. దీంతో చంద్రబాబు నాయుడు ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.