3, ఫిబ్రవరి 2024, శనివారం

6న టీడీపీ మొదటి జాబితా ?

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగు తమ్ముళ్లు టిక్కెట్ల ప్రకటన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అధికార వైసీపీ ఇప్పటికే ఆరు జాబితాలను విడుదల చేసింది. ప్రతిపక్ష తెలుగుదేశం నుండి ఇప్పటివరకు ఉలుకూపలుకూ లేదు. ఎవరిని అడిగినా తమకు ఏమి తెలియదనే సమాధానం వస్తుంది. ఆశావహులు మాత్రం నరాలు తెగే ఉత్కంఠతో చంద్రబాబు ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. టిక్కెట్లు ఖరారు కాకపోవడంతో టీడీపీ నాయకుల్లో అభద్రతా భావం కనిపిస్తుంది. చివరి నిమిషంలో టిక్కెట్లు ఇస్తే ఎన్నికలను అలా ఎదుర్కొనాలనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.

 టిడిపి టికెట్ల కోసం ఆశావహులు ఎదురు చూస్తుండగా ముఖ్యమంత్రి జగన్ అభ్యర్థుల ఖరారులో ముందున్నారు. జగన్  ముగ్గురు సిటింగ్ ఎమ్మెల్యేలను మార్చారు. మిగిలిన వారందరినీ కొనసాగిస్తున్నారు. కొత్తగా చిత్తూరు టికెట్టు ఎం సి విజయానంద రెడ్డికి, పూతలపట్టు డాక్టర్ సునీల్ కు, సత్యవేడు నూకతోటి రాజేష్ కు ఇచ్చారు. చంద్రగిరి, తిరుపతిలో ఎమ్మెల్యేల కొడుకులకు ఇచ్చారు. డిప్యూటీ సీఎం  నారాయణ స్వామి, ఎంపిలు రెడ్డప్పకు తిరిగి  సిటింగ్ స్థానాలు కేటాయించారు. తిరుపతి ఎంపీగా గురుమూర్తికి మళ్ళీ అవకాశం కల్పించారు. పుంగనూరు నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ ఖాయం. పీలేరు విషయంలో కొంత తడబాటు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత  ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి పేరు ఖరారు కావచ్చు. లేకుంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. తంబళ్ళపల్లె నుండి ద్వారకనాధ రెడ్డి, శ్రీకాళహస్తి నుండి బియ్యం మధుసూదన్ రెడ్డికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. నగరి నియోజక  వర్గం నుండి మంత్రి రోజను కొనసాగిస్తారా లేక పార్లమెంటుకు పంపుతారా అనే విషయం తేలలేదు. రోజా మాత్రం నగరి నుండి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికే మొగ్గు చూపుతున్నారు.

 వైసీపీలో టిక్కెట్ల వ్యవహారం దాదాపుగా ఓక కొలిక్కి రాగా, టిడిపిలో ఇప్పటి వరకు ఒకరి టికెట్టు కూడా ప్రకటించలేదు. ఎవరికి టికెట్టు వస్తుందో చెప్పలేని స్థితి కొనసాగుతున్నది. చంద్రబాబు హైదరాబాదులో సర్వేలను ముందేసుకుని అభ్యర్థుల ఎంపికకు కసరత్తులు చేస్తున్నారు. లోకేష్ ఒక్కరినే పక్కన పెట్టుకుని ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఆదివారం, లేదా సోమవారానికి జాబితా పూర్తి చేస్తారని అంటున్నారు. మంగళవారం జి డి నెల్లూరులో జరిగే రా కదలి రా కార్యక్రమంలో పాల్గొంటారు. అప్పటిలోగా జాబితా పూర్తి చేసి, కొన్ని పేర్లతో మొదటి జాబితా విడుదల చేస్తారని  టీడీపీ నేతలు భావిస్తున్నారు.

ప్రాథమిక సమాచారం మేరకు కుప్పం టికెట్టు చంద్రబాబుకు, పలమనేరు అమరనాథ రెడ్డికి, పీలేరు కిషోర్ కుమార్ రెడ్డికి, జి డి నెల్లూరు థామస్ కు ఖాయం అంటున్నారు. జనసేన పట్టు పట్టక పోతే చిత్తూరు  గురజాల జగన్ మోహన్ నాయుడుకు  దక్కే అవకాశం ఉందంటున్నారు. పుంగనూరు విషయంలో సందిగ్ధం నెలకొన్నది. ఇక్కడ ఇంచార్జి చల్లా రామచంద్రా రెడ్డికి గ్యారెంటీ లేదంటున్నారు. మదనపల్లె కోసం జనసేన పట్టుపడుతున్నది. తంబళ్ళపల్లెలో శంకర్ యాదవ్, శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డికి అవకాశం ఉందంటున్నారు. సత్యవేడు టికెట్టు వైసిపి ఎమ్మెల్యే ఆదిమూలంకు వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు. నగరి టికెట్టు గాలి భాను ప్రకాష్, ఎన్ బి హర్ష వర్ధన్ రెడ్డి మధ్య పోటీ నెలకొన్నది. చంద్రగిరి స్థానం కోసం ఇంచార్జి పులివర్తి నాని, ఇందు శేఖర్  పేర్లు పరిశీలిస్తున్నారు. 

తిరుపతి టికెట్టు కోసం జనసేన పట్టు పడుతున్నది. అయితే ఈ స్థానం టిడిపికే ఇస్తారని తెలిసింది. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు కొందరు బలిజ నేతలు, నరసింహ యాదవ్ ఆశిస్తున్నారు. పూతలపట్టు టికెట్టు ఇంచార్జి మురళి, అనగల్లు మునిరత్నం, సినీనటుడు సప్తగిరిలో ఒకరికి రావచ్చు అంటున్నారు. ఏది ఏమైనా టికెట్టు ఆశించే నేతలు మాత్రం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల్లా ఉన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *