శ్రీకాళహస్తి టిక్కెట్టు రేసులో బీసీ నేత గురవారెడ్డి
తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి అసెంబ్లీ సీటును బీసీ నేత, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురవారెడ్డి ఆశిస్తున్నారు. ఆయన గత 32 సంవత్సరాలుగా పార్టీకి అంకితం కలిగిన నాయకుడిగా పనిచేస్తున్నారు. జిల్లాలో పలు హోదాల్లో తెలుగుదేశం పార్టీని పటిష్టం చేశారు. పార్టీ కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొని, మంచి అనుభవం ఘటించారు. ఆయన ప్రస్తుతం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా, శ్రీకాళహస్తి నియోజకవర్గం క్లస్టర్ ఇంచార్జిగా, తంబళ్లపల్లె నియోజకవర్గం పార్టీ పరిశీలనకుడిగా విధులను నిర్వహిస్తున్నారు. అయినా, ఇప్పటివరకు ఎలాంటి అధికార పదవిని చేపట్టలేదు. జిల్లాలో ఇప్పటివరకు బీసీ నేతలకు చంద్రబాబు టికెట్టును ప్రకటించలేదు. కావున బీసీ నేత అయిన తనకు టిక్కెట్టు కేటాయించాల్సిందిగా ఆయన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కలిసి కోరారు. ఇందుకు పార్టీ అధినేత కూడా ఇందుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన రెడ్డివారి గురవారెడ్డి వివాహానికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నటసింహం, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వారి స్వగ్రామమైన ఏర్పేడు మండలం బండారుపల్లి గ్రామానికి వచ్చి ఆశీర్వదించడం విశేషం.
జిల్లాలో వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గం గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన వైసిపి అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసిపి జిల్లా అధ్యక్షుడిగా వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన భరత్ ను నియమించారు. అలాగే ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. రానున్న ఎన్నికల్లో కుప్పం అభ్యర్థిగా ఖరారు చేశారు. ఈ పర్యాయం ఎన్నికల్లో భరత్ గెలుపొందితే మంత్రిగా చేస్తానని కూడా కుప్పం ప్రజలకు జగన్ హామీ ఇచ్చారు. అలాగే డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యంను తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీ పార్టీలో చేర్చుకొని ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. జిల్లాలో వైసిపి పార్టీ పార్టీపరంగా పదవుల పరంగా వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి పెద్దపీట వేసింది. కావున రానున్న ఎన్నికల్లో గురవా రెడ్డికి కూడా తప్పక టికెట్టు వస్తుందని ఆ సామాజికవర్గానికి చెందిన వారు ధీమాను వ్యక్తం చేశారు. రెడ్డివారి గురవారెడ్డి 1992 వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో అడిగిడారు. 1993లో మండల ఎన్నికల కమిటీ ప్రత్యేక ఆహ్వానితునిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో యువత, బిసి సెల్ లో పలు హోదాల్లో పనిచేశారు. పట్టబద్రుల, పంచాయతి, ఎం పి టి సి ఎం ఎల్ సి ఎన్నికలలో తంబళ్లపల్లి, శ్రీకాళహస్తి నియోజకవర్గాలలో చురుగ్గా వ్యవహరించారు. అధికార పార్టీ ఆగడాలను ఎదుర్కొన్నారు.
పార్టీ ఆదేశానుసారం గురవారెడ్డి పార్టీ సంస్థాగత ఎన్నికలకు పలుచోట్ల పరిశీలకుడిగా వ్యవహరించారు. పార్టీ తరపున ఏ కార్యక్రమం జరిగినా. ముందుండి విజయవంతం చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి అనే కార్యక్రమంలో ఆగస్టులో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తంబళ్లపల్లె నియోజకవర్గంలోని అంగళ్ళలో జరిగిన రాళ్ల దాడి సందర్భంగా తంబళ్లపల్లి నాయకులపై అక్రమ కేసులు బనాయించారు. పార్టీ ఆదేశానుసారం ఇన్చార్జిని సమన్యయం చేసుకుంటూ పరిశీలకుడిగా జైలుకు వెళ్ళిన వారి కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి, పార్టీ, ఇంచార్జి అందచేసిన ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పార్టీ ఆదేశానుసారం ఇదేం కర్మ, బాదుడే బాదుడు, నిజం గెలవాలి, భవిష్యత్తు గ్యారెంటీ - బాబు ష్యురిటి కార్యక్రమాలను శ్రీకాళహస్తి, తంబళ్లపల్లె నియోజకవర్గం విజయవంతం చేశారు.
నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో కుప్పం నుండి తంబళ్లపల్లి, పూతలపట్టు, శ్రీకాళహస్తి, సుళ్ళురుపేట, గూడూరు, నెల్లూరు అర్బన్, కోవూరు, కావాలి, ఉదయగిరి నియోజకవర్గాలలో జనసమికరణ సమన్యయం చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పడు మండలంలో లోకేష్ తొ వన్నెకుల క్షత్రియులతో ముఖాముఖి ఏర్పాటుచేశారు. పార్లమెంటు తిరుపతి ఉపఎన్నికలలో వన్నెరెడ్ల సమీకరణ భాద్యత చంద్రబాబు గురవారెడ్డికి అప్పగించారు. దానిని సమర్థవంతం నెరవేర్చారు. అధికార పదవులు రాకున్నా, పార్టీ సేవకే అంకితం అయ్యారు. వన్నె రెడ్లలో సీనియర్ నాయకుడు. ఒకే పార్టీని నమ్ముకొని ఉన్నారు.
పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ నిరసన తెలియజేసినందుకు శ్రీకాళహస్తి పోలీసులు గురవా రెడ్డి మీద హత్యాయత్నం కేసును నమోదుచేసి, అరెస్టు చేసి ఎనిమిది రోజులపాటు జైలులో ఉంచారు. విడుదలైన తర్వాత బాబుతో నేను కార్యక్రమాన్ని నియోజకవర్గంలో, క్లస్టర్ లో విజయవంతంగా నిర్వహించారు. బాబు క్షేమంగా విడుదల కావాలని దేవాలయాలలో పూజల నిర్వహించి, మోత మోగిద్దాం, కాంతిలో క్రాంతి, సత్యమేవ జయతే, జగనాసుర దగ్దం వాటి కార్యక్రమాలతో, పాటు నిరసనలు, రిలే నిరాహార దీక్షలలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 అక్రమ కేసులను గురవా రెడ్డి మీద నమోదు చేశారు. ఇప్పటికీ కోర్టు వాయిదాలకు తిరుగుతున్నారు. 2008 ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదాలో చంద్రబాబు మీకోసం బస్సు యాత్ర ప్రారంభించినప్పుడు బస్సు యాత్రలో పాల్గొన్నారు. అలాగే 2012 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసినపుడు వారితోపాటు 150 రోజులు ఉండి 1900 కిలోమీటర్ల పాదయాత్రను చేశారు. రైతు సమస్యలపై దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఉద్యమంలో అధినేత చంద్రబాబుతో సమైఖ్యాంధ్ర ఉద్యమం, ధర్మపోరాట దీక్షలో గురవారెడ్డి చురుగ్గా పాల్గొన్నారు. అలాగే శ్రీకాళహస్తి శాసనసభ్యుడు మధుసూదన రెడ్డి అవినీతి, అక్రమాలను బహిర్గతం చేస్తూ నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేసి చేస్తున్నారు.
ఈ విషయమై గురువా రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు మూడు లక్షలకు పైగా ఉన్నారన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మాత్రం 50 వేలకు పైగా ఉన్నారని తెలిపారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో లక్షా30 వేల మంది తమ కుల సామాజిక ఓటర్లు ఉన్నారనీ వివరించారు. తనకు టికెట్టు ఇస్తే అందరి సహాయ సహకారంతో ఎన్నికలలో శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థానాన్ని గెలిచి, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కానుకగా ఇస్తానని రెడ్డివారి గురువారెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.