19, ఫిబ్రవరి 2024, సోమవారం

హ్యాట్రిక్ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకొని టీడీపీ !




 ఎవరైనా ఓటమి నుండి అనేక గుణపాఠాలు నేర్చుకుంటారు. ఆ ఓటమిని అధిగమించడానికి శత విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఒకసారి చేసిన తప్పు లేక పొరబాటు మరోసారి చేయకుండా జాగర్తలు తీసుకుంటారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ నానాటికీ దిగజారిపోతోంది. ఇప్పుడు కూడా రెండు, మూడు నియోజకవర్గాలు తప్ప ఖచ్చితంగా గెలుస్తామన్న నియోజకవర్గాలు లేవు. టీడీపీ పార్టీ మొత్తం జగన్ వ్యతిరేకత, చంద్రబాబు జైలుకు వెళ్లడంతో లభించిన సానుభూతి, పవన్ కల్యాణ్ తొంపొత్తు కారణంగా గెలుస్తామన్న ఆశాభావం తప్ప సొంత బలం కనిపించడం లేదు. ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల ఎంపిక చాలా ముఖ్యం. ఇప్పుడు అది కూడా ఒక వ్యాపారంగా మారిందని తెలుస్తోంది. ప్రజలలో  పట్టుకున్న నాయకులను పక్కనపెట్టి, డబ్బుకు విలువ ఇవ్వడం పట్ల ఆ పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వంత జిల్లాలో ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకో లేదని ఆ పార్టీ సీనియర్ నేతలు వాపోతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టిడిపి క్రమంగా క్షీణించి పోయింది. 1983, 1994 ఎన్నికల్లో అప్పటిలో ఉన్న 15 నియోజక వర్గాలలో 14 స్థానాలలో గెలిచిన పార్టీ 2019లో ఉన్న 14 నియోజక వర్గాలలో చంద్రబాబు ఒకరి గెలుపుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 


1995 లో చంద్రబాబు ముఖ్య మంత్రి అయ్యారు. తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఐదేళ్లు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఇంట గెలవలేక పోతున్నారు. నియోజక వర్గాల పునర్విభజన తరువాత 2009, 2014, 2019 లో జరిగిన మూడు ఎన్నికల్లోనూ ఆరు నియోజక వర్గాలలో టిడిపి హ్యాట్రిక్ ఓటమి నమోదు చేసుకున్నది. అయితే చంద్రబాబు దీని నుంచి గుణపాఠం నేర్చుకునే ప్రయత్నం చేయలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పుంగనూరు, మదనపల్లి, చంద్రగిరి, పీలేరు, జి డి నెల్లూరు, పూతలపట్టు నియోజక వర్గాలలో వరుసగా ఓటమి పాలయ్యారు. 


పుంగనూరు నియోజక వర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా తరువాత రెండు సార్లు వైసిపి టికెట్టుపై గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఈ సారి అక్కడ ఆయన గెలుపుకు ఢోకా లేదని అంటున్నారు. మదనపల్లె నియోజక వర్గంలో 2009లో కాంగ్రెస్ అభ్యర్థి షాజహాన్ భాషా, 2014లో వైసిపి అభ్యర్ధి దేశాయ్ తిప్పా రెడ్డి, 2019లో వైసిపి అభ్యర్థి మహ్మద్ నవాజ్ బాషా విజయం సాధించారు. చంద్రగిరిలో 2009లో కాంగ్రెస్ అభ్యర్ధి గల్లా అరుణ కుమారి, తరువాత రెండు సార్లు వైసిపి అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలిచారు. పీలేరులో 2009లో కాంగ్రెస్ అభ్యర్ధి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, తరువాత రెండు సార్లు వైసిపి అభ్యర్ధి చింతల రామచంద్రా రెడ్డి విజయం సాధించారు. 


ఇక ఎస్సీలకు రిజర్వ్ చేసిన జి డి నెల్లూరులో 2009 లో కాంగ్రెస్ అభ్యర్థి జి. కుతూహలమ్మ, తరువాత రెండు సార్లు వైసిపి అభ్యర్ధి కె నారాయణ స్వామి గెలిచారు. పూతలపట్టు నియోజక వర్గంలో 2009లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రవి, 2014 వైసిపి అభ్యర్థి సునీల్ కుమార్ 2019 లో వైసిపి అభ్యర్ధి ఎం ఎస్ బాబు గెలుపు సాధించారు. ఈ ఏడు నియోజక వర్గాలలో ఇప్పటికీ టిడిపి తగిన పట్టు సాధించలేక పోతున్నది అంటున్నారు. మిగిలిన నియోజక వర్గాలలో కుప్పం మినహా మిగిలిన చోట్ల టిడిపి బలహీనంగా ఉందని అంటున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *