చిత్తూరు ఎంపీ రేసులో డా. సురేంద్రబాబు
చిత్తూరు పార్లమెంటు టిక్కెట్టు కోసం డాక్టర్ గుండ్లూరు సురేంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మాజీమంత్రి డా. నారాయణను కలిసి తన బయో డేటాను అందచేశారు. చిత్తూరు ఎంపీ గా తనకు అవకాశం ఇస్తే, తప్పక గెలుస్తామని ధీమాను వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తనకు విస్తృతంగా పరిచయాలు ఉన్నాయని, తన గెలుపు కోసం శ్రమించే బంధుమిత్రులు ఉన్నారని వివరించారు. ఒక డాక్టర్ గా, ఒక సామాజిక కార్యకర్తగా, ఒక జాతీయవాదిగా వివేకానందుడి స్ఫూర్తితో రాజకీయాలలో పని చేస్తానన్నారు. టీడీపీ అధిష్టానం కూడా సురేంద్రబాబు అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
గుండ్లూరు సురేంద్రబాబు ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇండియన్ అకాడమీ అఫ్ పిడియాట్రిక్స్ విభాగంలో జనరల్ సెక్రెటరీగా, సిఐఎంఎస్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల లో సొంత హాస్పిటల్ అమృత పిల్లల హాస్పిటల్ ప్రారంభించి పేదల వైద్యుడిగా పేరు పొందారు. అయన చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలోని కొత్తపల్లిలోని ఒక పేద దళిత కుటుంబంలో జన్మించారు. ఓ వైపు కూలీ పనులు చేసుకుంటూనే తన చదువును కొనసాగించారు. గ్యారంపల్లి గురుకుల పాఠశాలలో చేరిన సురేంద్రకు 2000 సంవత్సరంలో జరిగిన పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో 545/600 మార్కులతో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించి 2001 లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రతిభ అవార్డును అందుకున్నారు. చిత్తూరు వివేకానంద జూనియర్ కళాశాలలో చేరి ఇంటర్ లో 93.7% మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. గ్రామ పెద్దలు కొంత ఆర్థిక సహాయం ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ లో చేరి 2005 సంవత్సరంలో ఉస్మానియా వైద్య కళాశాలలో వైద్య విద్యలో ఫ్రీ సీటును సాధించారు. 2006లో యుఎస్ఎకు చెందిన అంగిరాస్ ఫౌండేషన్ నుంచి మెరిట్ స్టూడెంట్ స్కాలర్షిప్ అవార్డు పొందారు.
స్వామి వివేకానంద రచనలు ఇచ్చిన స్ఫూర్తి, ప్రేరణతో అతనిలో ఉన్న ఉన్నత భావాలు, మహోన్నత ఆశయాలు, కృషి, పట్టుదల అతడిని నాయకత్వం వైపు నడిపించాయి. 2007 లో యజ్ఞ అనే NGO ను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. యజ్ఞ ద్వారా చాలా మంది నిరుపేద అనాధ పిల్లలకు ఆశ్రయం, ఆవాసం కల్పిస్తున్నారు. ఆయనలోని నాయకత్వ లక్షణాలను గుర్తించి ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థులు సురేంద్ర బాబును 2007 సంవత్సరంలో 'ఓఎంఎస్ డి' కు ప్రెసిడెంట్ గా ఎంపిక చేశారు. తన ఆధ్వర్యంలో ప్రతీ ఏటా జాతీయ యువజన దినోత్సవ వేడుకలు ఉస్మానియాలో ఘనంగా నంగా జరిపించారు. 2008 వ సంవత్సరంలో 'జూడా'లో కీలక పాత్ర పోషించారు. వీటితో పాటు ఆరోగ్య భారతి, సేవా భారతి లో వాలంటీర్ గా పని చేశారు. ప్రతి యేటా గణేష్ పండగను ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఘనంగా జరిపించి యువతలో జాతీయవాదానికి బీజాలు వేసారు.
తన MBBS విద్యను పూర్తి చేసీ, ఒక సంవత్సరం కేరళలోని తిరూర్ నర్సింగ్ హోమ్ లో డాక్టర్ గా పని చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ లో టీబీ వ్యాధిగ్రస్తుల వార్డులో కూడా పని చేశారు. ఆ తర్వాత 2015 వ సంవత్సరంలో దేశంలోనే ప్రముఖమైన PGI, చండీఘర్ లో MD పీడియాట్రిక్స్ లో సీటు సంపాదించారు. 2018 సంవత్సరంలో తన PG విద్యను పూర్తి చేసుకుని 2019 సం.లో తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల లో సొంత హాస్పిటల్ "అమృత పిల్లల హాస్పిటల్" ప్రారంభించి పేదల వైద్యుడిగా పేరు పొంది వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ సమాజానికి ఇంకేదయినా చేయాలనే సంకల్పంతో విద్య, వైద్యం, స్పూర్తి లక్ష్యంగా 2020 జనవరి నెలలో " నరేన్ ఫౌండేషన్" పేరుతో ఒక NGO ను స్థాపించారు. ఈ ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 12న జాతీయ యువజన దినోత్సవ వేడుకలు జరుపుతూ ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ యువతలో స్పూర్తిని నింపుతున్నారు.
దుబ్బాక ఊరిలో వివేకానంద పిల్లల హాస్పిటల్ మరియు అమృత జనరల్ హాస్పిటల్ స్థాపించారు. అలాగే ముస్తాబాద్ లో సోమశేఖర పిల్లల హాస్పిటల్, పెద్దపల్లిలో వివేకానంద పిల్లల హాస్పిటల్ స్థాపించి అతి తక్కువ ఖర్చుతో ఆదినిక వైద్య సేవలు అందిస్తున్నారు. వీటితో పాటు సిరిసిల్ల జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అధునాతన వైద్య సదుపాయాలు కలిగిన కార్పొరేట్ హాస్పిటల్స్ కి ధీటుగా "హిమాన్షి అడ్వాన్స్డ్ & నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ సెంటర్" ప్రారంభించి పిల్లలందరికీ అతి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. 2022 సం. లో ఈ హాస్పిటల్స్ అన్నింటికీ "జయ వారాహి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్" అనే పేరు పెట్టి ఒకే గొడుగు కిందికి తెచ్చి ఆదునిక వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకే అందిస్తున్నారు. అంతే కాకుండా ఈ హాస్పిటల్స్ ద్వారా ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తూ ప్రజలందరికీ నిరంతర వైద్య సేవలు అందిస్తున్నారు. వివిధ గ్రామాల్లో ఇప్పటి వరకు మొత్తం 50 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి మందులను అందించారు. ఇలాంటి సేవాదృక్పధం ఉన్న వ్యక్తులు రాజకీయంగా ఎదిగి తమ సేవలను మరింత విస్తరించాలని ఆశిద్దాం.