సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తున్న టిడిపి టిక్కెట్ల వ్యవహారం
తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ టికెట్ల వ్యవహారం సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. జిల్లాలో రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. రోజురోజుకు మారుతున్న ఐ వి ఆర్ సర్వేలతో అభ్యర్థులకు ఏం జరుగుతుందో అర్థం కాక తలలు పట్టుకుని కూర్చుంటున్నారు. జిల్లాలో టిడిపి అభ్యర్థులకు ఎవరికి టిక్కెట్ వస్తుందో, ఎవరికి రాదో తెలియని అయోమయ పరిస్థితి. అలాగే జనసేన, బిజెపి పొత్తులలో భాగంగా ఏ స్థానాలను కోల్పోవలసి వస్తుందోనన్న ఆందోళన. జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలలో ఒక రకంగా అయోమయం, గందరగోళం నెలకొంది. జిల్లాలో కుప్పం నుంచి చంద్రబాబు, పీలేరు నుంచి నల్లారి కిరణ్ కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేయడం ఖాయం. అలాగే మాజీ మంత్రి అమర్నాథ రెడ్డి కూడా. జిల్లాలోన మిగిలిన 11 నియోజకవర్గాలలో ఎవరికీ స్పష్టత లేదు. ఎవరికి టికెట్ వస్తుందో, ఎవరికీ రాదో తెలియని అయోమయ, గందరగోళ పరిస్థితి. దీనికి తోడు కొత్త అభ్యర్థులు రంగప్రవేశం చేస్తున్నారు. ఫలితంగా జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిరాశా, నిస్సృహలకు గురవుతున్నారు. నిరుత్సాహం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. కొంతమంది టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులకు రాజకీయాలు అంటే విరక్తి కలుగుతోంది. ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామా అని ఆవేదన చెందుతున్నారు.
వైసిపి అభ్యర్థులు దాదాపు ఖరారు అయ్యారు. అన్ని నియోజకవర్గాలలో కార్యకర్తలను కూడకట్టుకుని ప్రచారం మొదలు పెట్టారు. అయితే టిడిపి పరిస్తితి ఇందుకు భిన్నంగా ఉంది. కుప్పంలో చంద్రబాబు పోటీ చేస్తారు. పీలేరులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి టికెట్టు ఖాయం అయ్యింది. పలమనేరు టికెట్టు అమరనాద రెడ్డికే ఇస్తారు అనడంలో సందేహం లేదు. అయితే ఆఖరు నిమిషంలో ఆయనను పుంగనూరు పంపే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతున్నది. మిగిలిన నియోజక వర్గాలలో ఎవరికి హామీ దొరకలేదు. దీనితో అక్కడి ఇంచార్జిలలో ఒక విధమైన నిస్తేజం ఆవహించింది. కొన్ని నియోజక వర్గాలలో రోజుకు ఒక పేరుతో ఐ వీ ఆర్ ఎస్ మెసేజ్ లు వస్తున్నాయి. అంతా అయోమయం, గందరగోళంగా మారింది.
చిత్తూరు నియోజక వర్గంలో పలు పేర్లు పరిశీలించారు. ఇక్కడ బలిజ సామాజిక వర్గానికి టికెట్టు ఇస్తారని లేదా జన సేనకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. తాజాగా గురజాల జగన్ మోహన్ నాయుడు, సి కె బాబు, సి ఆర్ రాజన్ పేర్లతో ఐ వీ ఆర్ ఎస్ సర్వే చేశారు.కొత్తగా డీకే తేజశ్వరి రంగప్రవేశం చేశారు. జి డి నెల్లూరు నియోజక వర్గంలో డాక్టర్ థామస్ ఒకరి పేరుపై మూడు సార్లు సర్వే చేశారు. జి.డి నెల్లూరులో రా కదలి రా సభ జరిగిన తరువాత ఆయన ప్రచారం జోరు తగ్గించారు. గత వారంలో రెండు సార్లు హైదరాబాద్ లో చంద్రబాబును కలిశారు. అక్కడ జనసేన ఇంచార్జి డాక్టర్ పొన్న యుగంధర్ కూడా టికెట్టు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పూతలపట్టు నియోజక వర్గంలో ఇంచార్జి డాక్టర్ మురళిని కాదని ఆనగంటి మునిరత్నం, డాక్టర్ చందన స్రవంతి పేర్లు తెరపైకి వచ్చాయి.
నగరి ఇంచార్జి గాలి భాను ప్రకాష్, చంద్రగిరి ఇంచార్జి పులివర్తి నానికి ఇంత వరకు భరోసా దొరక లేదు. ఈ రెండింటిలో ఒక స్థానం తన కుమారుడు ఎన్ బి హర్ష వర్ధన్ రెడ్డికి ఇవ్వాలని రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి పట్టు పడుతున్నారు. చిత్తూరు జగన్ మోహన్ నాయుడుకు కేటాయిస్తే హర్షవర్ధన్ కు తప్పక అవకాశం ఉంటుంది అంటున్నారు. శ్రీకాళహస్తి ఇంచార్జి సుధీర్ రెడ్డి పరిస్తితి అగమ్య గోచరంగా ఉంది. ఆయనతో పాటు ఆయన తల్లి బృందమ్మ, భార్య రిషితా రెడ్డి పేర్లు సర్వేలో చోటు చేసుకున్నాయి. దీనితో ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడుకు పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. పొత్తు ఖరారు అయితే ఈ స్థానం బిజెపి నేత కోలా ఆనంద్ కు కేటాయించే అవకాశం ఉందంటున్నారు.
సత్యవేడు ఇంచార్జి హెలెన్ తో డెంటల్ డాక్టర్ చందన స్రవంతి, జేడి రాజశేఖర్ పోటీ పడుతుండగా, కొత్తగా కిరణ్ కుమార్ జయరాం రంగప్రవేశం చేశారు. తిరుపతి ఇంచార్జి సుగుణమ్మ టికెట్టు సందిగ్ధంలో పడింది. అక్కడ ఆమెను కాదని ఆమె సామాజిక వర్గానికి చెందిన ఊకా విజయకుమార్, కోడూరు బాలసుబ్రమణ్యం, జె బి శ్రీనివాస్ కలసి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే జనసేన టికెట్టు కోసం డాక్టర్ హరిప్రసాద్, కిరణ్ రాయల్ పట్టు పడుతున్నారు. మదనపల్లి ఇంచార్జి దొమ్మలపాటి రమేష్ ను కాదని మాజీ ఎంల షాజహాన్ బాషా పేరుతో ఐ వీ ఆర్ ఎస్ రావడం విశేషం. తంబళ్లపల్లె ఇంచార్జి శంకర్ యాదవ్ ను కాదని ప్రవీణ్ కుమార్ రెడ్డి, జయచంద్రా రెడ్డి పేర్లు తెరపైకి వచ్చాయి. పుంగనూరు నియోజక వర్గంలో చల్లా రామచంద్రా రెడ్డిని తప్పించి, అమరనాద రెడ్డి లేదా అనీషా రెడ్డికి టికెట్టు ఇస్తారన్న ప్రచారం జరుగుతున్నది. దీంతో అన్ని నియోజక వర్గాలలో ఆశావహులు ఆశా నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.