పాపాల పెద్దిరెడ్డీ ! నీ భారతం పడుతా .... చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పాపాల పెద్దిరెడ్డి తిన్నది అంతా కక్కిస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం గంగాధర నెల్లూరు మండలం రామానాయుడు పల్లిలో జరిగిన రా కదిలి రా తెలుగుదేశం పార్టీ బహిరంగ సభలో మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలు మితిమీరుతున్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇసుక, మద్యం, గ్రానైట్, కలప ఇలా అన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. జిల్లాలోని మంత్రులను, ఎమ్మెల్యేలను స్మగ్లర్లు, దొంగలుగా వర్ణించారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
జిల్లాలోని గ్రానైట్ ఓనర్లు పెద్దిరెడ్డికి కప్పం కడుతున్నామని తెలిపారు. ఆయన డైరీకి పాలు పోయించుకుని తక్కువ మొత్తం ఇస్తున్నారని, మామిడి రైతులకు తక్కువ ధర ఇస్తున్నారని విమర్శించారు. కుప్పంకు కప్పం కోసం రెండు నెలలకు ఒకసారి వెళుతున్నారని ఆరోపించారు. మంత్రి అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలు గుర్తుపెట్టుకుంటామని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తిన్నదంతా కక్కిస్తామన్నారు. అంగళ్ళలో 600 మంది తెదేపా కార్యకర్తల మీద కేసులు బనాయించడం పట్ల ఆవేదనను వ్యక్తం చేశారు. తాను అధికారం లెక్క వస్తే 60 వేల మంది మీద కేసులు పెట్టి మీ సంగతి చూడగలనని, తెలుగుదేశం పార్టీ న్యాయం, ధర్మం కోసం పనిచేస్తుందన్నారు. చిత్తూరు జిల్లాలో కూడా పులివెందుల పంచాయతీ నడుస్తుందని పేర్కొన్నారు.
దళితులకు అడుగడుగునా అవమానాలే.
జాగన్ పాలనలో దళితులకు అడుగడుగునా అవమానాలు జరుతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గంగాధర నెల్లూరుకు చెందిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అడుగడుగునా అవమాన పరుస్తున్నారని తెలిపారు. రెడ్లు కూర్చుంటే ఉప ముఖ్యమంత్రి అయిన నారాయణస్వామి చేతులు కట్టుకొని నిలబడుతున్నారని పేర్కొన్నారు. వైసీపీ వాళ్లు నారాయణస్వామిని పార్లమెంటుకు పంపి తిరిగి అసెంబ్లీకి తీసుకువచ్చారని అన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఏం ఏస్ బాబును అవినీతిపరుడు అంటూ ముద్ర వేసి రెడ్ల పాదాల కింద నలిపి వేశారన్నారు. తమ బాధను చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి కనీసం అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యేలు అవినీతిపరులు కారా అని చంద్రబాబు ప్రశ్నించారు. మరో ఎస్సీ ఎమ్మెల్యే ఆదిమూలమును అవినీతి ముద్ర వేసి ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వకుండా చేశారన్నారు. మంత్రి పెద్దిరెడ్డి 200 ట్రిప్పర్లతో ఇసుకను తమిళనాడుకు తరలించి ఆ అవినీతిని ఆదిమూలం ఖాతాలో వేశారని పేర్కొన్నారు. వైసీపీకి పోటీ చేయడానికి అభ్యర్థులు లేకుండా ఒక నియోజకవర్గంలో నుంచి అభ్యర్థిని మరో నియోజకవర్గానికి బదిలీ చేస్తున్నారని పేర్కొన్నారు. చిత్తూరుకు జంగాలపల్లి శ్రీనివాసులు ఇసుక, భూములు దోసుకున్నారన్నారు. మున్సిపాలిటీలో ఆయన అన్న కొడుకుది మొత్తం పెత్తనం అన్నారు. నకిలీ బిల్లులతో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని పేర్కొన్నారు. చిత్తూరుకు చెందిన బడా స్మగ్లర్ కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని ఎద్దేవ వేశారు. ఇదేనా మీరు చేసే న్యాయమంటూ ప్రశ్నించారు. చిత్తూరు అయ్యప్ప లే ఔట్ లో 30 కోట్ల రూపాయలు దోపిడీకి గురయ్యాయని, వాటికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు సైతం చేయలేదన్నారు. తమిళనాడుకు చెందిన దొంగలు 30 కోట్లను దోచుకుని వెళితే దొంగకు తేలు కుట్టినట్లు మిన్నుకున్నారని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే లెక్కలు చెప్పాల్సి వస్తుందని ఫిర్యాదు కూడా చేయలేదని పేర్కొన్నారు. నగరికి చెందిన ఎమ్మెల్యే మంత్రి మహిళల భద్రత కోసం పని చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఆమె వేరే రాష్ట్రానికి వెళ్లి గంతులు వేస్తుందని, కనీసం మంత్రి హోదాను కూడా నిలబెట్టడం లేదన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ చేస్తామని సొంత పార్టీ కౌన్సిలర్ నుంచి 70 లక్షలు తీసుకున్న దానికి సమాధానం చెప్పాలన్నారు. నగిరిలో నలుగురు ఎమ్మెల్యేలు అవినీతిని వాటాలు పంచుకొని తింటున్నారని చంద్రబాబు చెప్పారు. చంద్రగిరి, తిరుపతిని దొంగ ఓట్లకు అడ్డాగా చేశారని విమర్శించారు. అటువంటి వ్యక్తిని ఒంగోలుకు ఎంపీగా పంపి, ఆయన కొడుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని ఎద్దేవా వేశారు. పెద్దిరెడ్డి కనుసన్నల్లో మసలుకుంటున్న పలమనేరు ఎమ్మెల్యే నియోజకవర్గంలో గ్రానైట్ ను దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో టిడిపి జనసేన గాలి విస్తోందని, పులివెందులలోనే జగన్ ఫీజు పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. పుంగనూరులో కూడా సీను మారిందని పెద్దిరెడ్డి ఓడిపోతారని జోస్యం చెప్పారు.
జిల్లాకు వరాల వర్షం
జిల్లా గంగాధర నెల్లూరు మండలం రామానాయుడు పల్లి లో జరిగిన రా కదిలి రా తెలుగుదేశం పార్టీ బహిరంగ సభలో ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాకు వరాల వర్షం కురిపించారు. చిత్తూరు జిల్లా వాసిగా చిత్తూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే హంద్రీ నీవా కాలువను పూర్తి చేస్తామని, కృష్ణాపురంకు నీళ్లు తీసుకు వస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఎన్టీఆర్ జలాశయం నుంచి చెరువులను అనుసంధానం చేసి చెరువులను నింపుతారని పేర్కొన్నారు. స్వర్ణముఖి నీటిని మళ్ళించి, తొందరలోనే నగరికి నీళ్లు అందిస్తామని పేర్కొన్నారు. తలకోనలోని శివాలయాన్ని ప్రసిద్ధ శివ క్షేత్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ముతబడిన నిండ్ర చక్కెర ఫ్యాక్టరీని తిరిగి తెరిపించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.