24, ఫిబ్రవరి 2024, శనివారం

మళ్ళి జి డి నెల్లూరు వైసిపి అభ్యర్థి మార్పు ఉంటుందా?



జి డి నెల్లూరు వైసిపి అభ్యర్థి వ్యవహారం భేతాళుని కథలను గుర్తుకు తెస్తోంది. భేతాళుడు మళ్ళీ చెట్టు ఎక్కినట్టు అభ్యర్థుల పేర్లు వెలుగులోకి వచ్చి మళ్ళీ మాయం అవుతున్నాయి. ఉప ముఖ్య మంత్రి కె నారాయణ స్వామిని కాదని ఇక్కడ మరొకరికి టికెట్టు ఇప్పించాలని కొందరు కీలక నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి ప్రత్యక్షంగా స్వామి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పరోక్షంగా అందుకు సహకారం అందిస్తున్నారని అంటున్నారు. 

ఈ నేపథ్యంలో నారాయణ స్వామికి చిత్తూరు లోక్ సభ, ఎంపి ఎన్ రెడ్డప్పకు జి డి నెల్లూరు అసెంబ్లీ టికెట్టు ఇస్తామని జగన్ ప్రకటించారు. అదే సమయంలో మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ అక్క కుమారుడు నూకతోటి రాజేష్ కు టికెట్టు ఇప్పించాలని పెద్దిరెడ్డి ప్రయత్నం చేశారు. నారాయణ స్వామిని తిరుపతి ఎంపిగా పంపాలని భావించారు. అయితే స్వామి నేరుగా జగన్ ను కలసి పట్టు పట్టడంతో తిరిగి జి డి నెల్లూరు ఆయనకే ఇస్తామని తెలిపారు. రాజేష్ కు సత్యవేడు స్థానం కేటాయించారు. స్వామి, జ్ఞానేంద్ర మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నం చేశారు. అయితే కుతూహలమ్మ కుమారుడు డాక్టర్ హరికృష్ణ చాపకింద నీరులా టికెట్టు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మిథున్ రెడ్డి మద్దతు ఉందని తెలిసింది. స్వామిని తిరుపతి ఎంపిగా పంపి హరికృష్ణకు జి డి నెల్లూరు టికెట్టు ఇస్తే గెలుపు సులభం అన్న భావనకు వచ్చారు. ఆయన 2019 ఎన్నికల్లో ఇక్కడ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

 ఇదిలా ఉండగా హటాత్తుగా వైసిపి అధికార ప్రతినిధి  నారమల్లి పద్మజ రెడ్డి రంగ ప్రవేశం చేశారు. మాజీ ఎంపి శివప్రసాద్ చెల్లెలు అయిన ఆమె జి డి నెల్లూరు మండలానికి చెందిన సుబ్రమణ్యం రెడ్డిని వివాహం చేసుకున్నారు. గతంలో ఆమె పలు సార్లు కాంగ్రెస్ టికెట్టు ఆశించారు. ఉప్పు ఆమెకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆశీస్సులు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. రెండు రోజుల క్రితం నారాయణ స్వామిని అధిష్టానం విజయవాడకు పిలిపించి మాట్లాడినట్టు సమాచారం. అయితే ఆయన జి డి నెల్లూరు కోసం పట్టుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో స్వామి పట్టు నిలుపుకుంటారా లేక మరొకరు టికెట్టు పట్టుకెలుతారా అన్నది వేచి చూడాలి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *