పుంగనూరులో సైకిల్ తొక్కేది ఎవరు ?
పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరనే విషయమై రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటి అనివార్యం. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పుంగనూరు నుండి మూడు పర్యాయాలు గెలుపొందిన పెద్దిరెడ్డి నాలుగో పర్యాయం కూడా గెలుపు సాధించడానికి సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీలో మాత్రం ఎలాంటి చలనం కనిపించడం లేదు. అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేస్తారన్న విషయమై ఉత్కంఠ కొనసాగుతోంది.
తొలుత పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. ఆ నియోజకవర్గంలో నుంచి నూతనకాల్వ రామకృష్ణారెడ్డి వరుసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత రెండు పర్యాయాలు ఆయన కుమారుడు అమర్నాథరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గం విభజన జరిగిన నాటి నుంచి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎదురుగాలి ప్రారంభమైంది. నియోజకవర్గానికి బలమైన నాయకత్వం లేకపోవడంతో అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయకేతనం ఎగరేస్తున్నారు. అమర్నాథ్ రెడ్డి పలమనేరుకు వెళ్ళడంతో పుంగనూరులో నాయకత్వ లేమి ఏర్పడింది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు వరుస ప్రయోగాలు చేస్తున్నారు. ఒకసారి బీసీ అభ్యర్థి వెంకటరమణ రాజును, మరోసారి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మరదలు అనీషా రెడ్డిని బరిలోకి దించారు. ఎన్నికల కాగానే ఆమెను తప్పించి పులిచెర్లకి చెందిన చల్లా బాబుకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. దీంతో నియోజకవర్గానికి సుస్థిరమైన నాయకత్వం కరువైంది.
మంత్రి రామచంద్రారెడ్డి వంటి బలమైన నేత ఉన్న నియోజకవర్గంలో ఆయనను కట్టడి చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. సొంత పార్టీలో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. బలమైన ప్రత్యర్థి ఉన్న నియోజకవర్గంలో సంవత్సరానికి ముందే బలమైన అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉందని భావిస్తున్నారు. అయితే, ఎన్నికలకు 40 రోజుల సమయం మాత్రమే ఉన్నా, ఇప్పటివరకు సరైన నిర్ణయం తీసుకోలేదు. మీనమేషాలు లెక్కిస్తూ, ప్రత్యర్థినీ మరింత బలవంతం చేస్తున్నారు. గతంలో రామచంద్ర రెడ్డి పైన పోటీ చేసిన బిసినేత వెంకటరమణ రాజు చంద్రబాబు మీద అలిగి వైసీపీలో చేరారు.
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అనిషారెడ్డిని అర్ధాంతరంగా తప్పించడంతో ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు పుంగనూరు చంద్రబాబు రాక సందర్భంగా ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జి చల్లా బాబు అనుసరించిన వ్యూహం కారణంగా నవ్వుల పాలయ్యారు. చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వెయ్యి మందికి పైగా కేసులు పెట్టించుకున్నారు. రెండు, మూడు నెలల పాటు అజ్ఞాతంలో గడిపారు. చంద్రబాబు కూడా అరెస్టు అయ్యారు. 150 మంది మీద పోలీసుల రౌడీషీట్లు తెరచారు. అందులో నియోజకవర్గ ఇన్చార్జి చల్లా బాబు కూడా ఉన్నారు. రానున్న ఎన్నికలలో అతనిని అభ్యర్థిగా ప్రకటిస్తే రౌడీ షీట్ కారణంగా నియోజకవర్గంలో తిరగకుండా పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రమాదం ఉంది.
ప్రస్తుతం పుంగనూరు అసెంబ్లీ టికెట్టును గత ఎన్నికల్లో పోటీ చేసిన అనీషా రెడ్డి తో పాటు నియోజకవర్గ ప్రస్తుత ఇంచార్జ్ చల్లా బాబు, సోమలకు చెందిన సురేష్ ఆశిస్తున్నారు. అయితే చంద్రబాబు ఏ విషయం తేల్చలేదు. ఇటీవల అనీషా రెడ్డి, శ్రీనాధ రెడ్డిలు చంద్రబాబు నాయుడును కలవగా ఆప్యాయంగా పలకరించారు. అయితే టికెట్ విషయమై ప్రస్తావించలేదు. అలాగే చల్లా బాబు రెండు మూడు పర్యాయాలు కేంద్ర పార్టీ కార్యాలయానికి వెళ్లినా, చంద్రబాబు ఆయన ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. ఫలితంగా టికెట్టు ఎవరికి ఖరారు చేస్తారన్న ఆసక్తి నెలకొంది.