రాజకీయ అజ్ఞాతం వీడిన అనీషా రెడ్డి
గత కొంతకాలంగా జిల్లాలో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న నూతనకాల్వ అనీషా రెడ్డి నిజం గెలవాలి యాత్ర ద్వారా మళ్లీ క్రియాశీలకం అయ్యారు. ఆమె బుధవారం కుప్పం, పలమనేరు నియోజకవర్గంలో జరిగిన నిజం గెలవాలి కార్యక్రమంలో నారా భువనేశ్వరితో పాటు పాల్గొన్నారు. అలాగే గురువారం పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన నారా భువనేశ్వరి పర్యటనలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. చాలా కాలం తర్వాత ఆమె నియోజకవర్గంలో పర్యటించడంతో నియోజకవర్గ టిడిపి శ్రేణులు, కార్యకర్తలలో ఆనందోత్సవాలు వెళ్లివెరుస్తున్నాయి.
గత ఎన్నికల్లో నూతనకాల్వ అనీషారెడ్డి పుంగనూరు నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతులో ఓడిపోయారు. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్చార్జిగా ఆమెను తప్పించి, పులిచర్లకు చెందిన చల్లా బాబుకు బాధ్యతలు అప్పగించారు. ఆనాటి నుంచి చల్లా బాబు నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తుండడంతో అనీషా రెడ్డి క్రియాశీలక రాజకీయాలకు ముఖం చాటేశారు. ఆమెకు పార్టీలో ఎలాంటి పదవి లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు, సభలు, సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో తిరిగి రాజకీయంగా క్రియాశీలకం కావాల్సిందిగా పలువురు నచ్చచెప్పారు. పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కలిసి మళ్లీ క్రియాశీలక రాజకీయాలలో పాల్గొనవలసిందిగా కోరారు. దీంతో అలక, రాజకీయ అజ్ఞాతవాసం వీడిన అనీషా రెడ్డి గురువారం నారా భువనేశ్వరి కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారు.
అంతకు ముందు జైలు నుండి చంద్రబాబు విడుదలై, తిరుమలకు వచ్చినపుడు, అనీషా రెడ్డి భర్త, మాజీ మంత్రి అమరనాధ రెడ్డి సోదరుడు శ్రీనాధ రెడ్డి కలిశారు. చంద్రబాబు చాలా ఆప్యాయంగా, ఆలింగనం చేసుకొని ముచ్చటించారు. ఒక సారి పార్టీ కార్యాలయంలో కలువల్చిందిగా సూచించారు. మల్లీ చంద్రబాబు సంక్రాంతి సందర్భంగా నారావారి పల్లికి వచ్చినపుడు శ్రీనాధ రెడ్డి, అనీషా రెడ్డి ఇద్దరు వెళ్లి కలిశారు. అరగంట పాటు చంద్రబాబు వాళ్ళతో మాట్లాడారు. తిరిగి క్రియాశీలకం కావాలని చెప్పారు. భువనేశ్వరి కుప్పం పర్యటన సందర్భంగా 15 నిమిషాల పాటు బస్సులో ఏకాంతంగా అనీషా రెడ్డితో చర్చించారు. ఆ విషయాలు బయటికి పొక్కకున్నా, రాజకీయంగా మళ్లీ క్రియాశీలకం కావాలని అనీషా రెడ్డిని కోలినట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారాన్ని చేపడుతుందని, ఇందుకు తన వంతు సహాయ సహకారాలను కోరినట్టు తెలుస్తోంది. రాజకీయాలలో మహిళలకు మంచి భవిష్యత్తు ఉంటుందని, మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు జరిగితే మహిళలదే రాజ్యాధికారమని పేర్కొన్నట్లు సమాచారం.
దీంతో గురువారం పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన నిజం గెలవాలి కార్యక్రమంలో కూడా చురుగ్గా అనీషా రెడ్డి పాల్గొన్నారు. నారా భువనేశ్వరితో పాటు గ్రామ గ్రామాన దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకున్నారు. చాలా విరామం తర్వాత మళ్లీ రాజకీయ అరంగ్రేటం చేయడంతో టిడిపి కార్యకర్తలు, నాయకులు ఆమెను అపూర్వంగా ఆదరించారు. శాలువాలు, పూలదండలతో ఆదరాభిమానాలు చూపించారు. తమను మరిచిపోవద్దని నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ఆమెను కోరారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఎల్లవేళలా పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని అనీషా రెడ్డి తెలిపారు.