24, ఫిబ్రవరి 2024, శనివారం

ఏడు నియోజకవర్గాలలో వీడిన సస్పెన్స్

 కుప్పం: నారా చంద్రబాబు నాయుడు

పలమనేరు: నూతనకాల్వ అమర్నాథ రెడ్డి

పీలేరు: నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి

నగరి: గాలి భానుప్రకాష్

చిత్తూరు: గురజాల జగన్మోహన్ నాయుడు

గంగాధర నెల్లూరు: డా. ఎం వి థామస్ 

తంబళ్ళపల్లి: దాసరపల్లి జయచంద్రా రెడ్డి


ఎట్టికేలకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో సస్పెన్స్ వీడింది. శనివారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఇందులో ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఏడు మంది అభ్యర్థులను ఖరారు చేశారు. మరో ఏడు పెండింగ్ లో పెట్టారు. శనివారం ప్రకటించిన స్థానాలలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి అమర్నాథరెడ్డి ఉన్నారు. అలాగే పీలేరుకు చెందిన రాష్ట్ర పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి, నగరికి చెందిన భాను ప్రకాష్ గాలి బానుప్రకాష్ పేర్లు కూడా ఉన్నాయి. వీరు పాత అభ్యర్థులుగాకాగా, ఈ పర్యాయం కొత్తగా చిత్తూరు నుండి గురజాల జగన్మోహన్ నాయుడు, గంగాధర్ నెల్లూరు నుంచి ఎంవి థామస్, తంబళ్లపల్లె నుండి దాసరపల్లి జయచంద్రా రెడ్డి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. శనివారం ప్రకటించిన జాబితా ప్రకారం మూడు కమ్మ, మూడు రెడ్డి సామజిక వర్గాలకు టిక్కెట్లు దక్కాయి.


కుప్పం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎనిమిదవ పర్యాయం బరిలోకి దిగుతున్నారు. ఆయన అప్రతిహతంగా ఏడుసార్లు కుప్పం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 8వ పర్యాయం లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్నారు. పలమనేరు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి నూతనకాల్వ అమర్నాధ రెడ్డి మరో మారు రంగంలోకి దిగుతున్నారు. ఆయన రెండు సార్లు పుంగనూరు నుండి, మరో రెండు సార్లు పలమనేరు నుండి గెలుపొందారు. గత ఎన్నికల్లో పలమనేరు నుండి పోటీ చేసి ఓడిపోయినా, పట్టుదలతో నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన తిరుగుతూ తన విజయ అవకాశాలను మెరుగుపరుచుకున్నారు. అలాగే పీలేరు నుండి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మరోమారు ఎన్నికల బరిలోకి దిగినున్నారు. ఆయన ఒకసారి జై ఆంధ్ర పార్టీ తరఫున, మరోసారి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఓటమినే విజయ సోపానంగా మార్చుకొని, మూడవ పర్యాయం పీలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. నగరి నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి, దివంగత గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్ మరోసారి రంగంలోకి దిగనున్నారు. ఆయన గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి మంత్రి రోజా మీద స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈ పర్యాయం పలువురు అభ్యర్థులు పోటీ చేయడానికి ముందుకు వచ్చినా, చంద్రబాబు నాయుడు గాలి భాను ప్రకాష్ వైపు మొగ్గుచూపారు. ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా  తిరుగుతున్నారు. 


చిత్తూరు నుండి కొత్తగా గురజాల జగన్ మోహన్ నాయుడు బరిలో దిగనున్నారు. చిత్తూరు టిక్కెట్టును ఈ పర్యాయం పలువురు ఆశించారు. గురజాల జగన్మోహన్ తో  పాటు చంద్రప్రకాష్, ఎన్ పి జయప్రకాష్, బలిజ సామాజిక వర్గం నుంచి కాజూరు బాలాజీ, కటారి హేమలత, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కూడా టికెట్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన జగన్మోహన్ నాయుడు పట్ల మొగ్గారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నుంచి విద్యావంతుడు డాక్టర్ ఎంవి థామస్ తొలిసారిగా పోటీ చేయనున్నారు. ఆయన ఇటీవల పార్టీలో చేరినా, చురుగ్గా పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. గంగాధర నెల్లూరులో జరిగిన రా కదలి రా సమావేశంలో చంద్రబాబు నాయుడు థామస్ ను పొగడ్తలతో ముంచిచెత్తారు. ఆ సమావేశం విజయవంతం కావడంతో టికెట్టు వరించింది. ఇక తంబళ్లపల్లి స్థానం కోసం మాజీ ఎమ్మెల్యే శంకర్ మరో సారి పోటీపడ్డారు. అయితే నియోజకవర్గంలో శంకర్ సక్రమంగా పర్యటించకపోవడంతో శంకర్ ను అధిష్టానం పక్కన పెట్టింది. గతంలో టిడిపి నుండి వైసీపీలో చేరిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కోసం తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేసింది. అయితే ఆయన ఆసక్తి చూపకపోవడంతో, మొలకల చెరువు మండలానికి చెందిన వ్యాపారవేత్త  దసరపల్లి జయచంద్రారెడ్డి పట్ల పార్టీ ముగ్గు చూపింది. ఆయన మూడు నెలల కిందట తెలుగుదేశం పార్టీలో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. ఉహించని విధంగా  దసరపల్లి జయచంద్రా రెడ్డికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లభించింది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *