16, ఫిబ్రవరి 2024, శుక్రవారం

మలుపు తిరుగుతున్న శ్రీకాళహస్తి రాజకీయం !

 


శ్రీకాళహస్తి తెదేపా రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఇంటింటి ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. అయితే ఎన్నికల పొత్తులో భాగంగా బిజెపి శ్రీకాళహస్తి సీటును  ఆశిస్తుంది. శ్రీకాళహస్తి లేదా తిరుపతిలలో ఏదైనా ఒక స్థానాన్ని తమకు కేటాయించాలని బిజెపి పట్టుబడుతుంది. అయితే ఈ రెండు స్థానాలు దేశం పార్టీకి గట్టిపట్టు ఉండడంతో తెలుగుదేశం పార్టీ ఎటు తేల్చుకోలేక పోతుంది. దీంతో పొత్తు  విషయం ఖరారు కాకపోవడంతో అభ్యర్థుల ఖరారులో కూడా స్తబ్దత నెలకొంది.



తెలుగుదేశం పార్టీ తరఫున గోపాలకృష్ణారెడ్డి కుమారుడు గుజ్జుల సుధీర్ రెడ్డి నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులైన తల్లి బృందమ్మ, సతీమణి రుచితా రెడ్డి పేర్లను కూడా అధిష్టానం పరిశీలించింది. వీరికి ఎవరికీ సర్వేలో అనుకూలంగా రాలేదని పార్టీ వర్గాలు భావిస్తున్న నేపధ్యంలో  సుధీర్ రెడ్డి వైసిపికి చెందిన  ముగ్గురు జడ్పిటిసి సభ్యులను తెలుగుదేశం పార్టీలో చేర్పించారు. మరొక మాజీ జెడ్పిటిసి సభ్యున్ని కూడా చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేర్పించారు.ఆయన తన నియోజకవర్గంలోని ముగ్గురు  వైసిపి జెడ్పీటీసీ లను  టీడీపీలో చేర్పించడంతో ఆయన ప్రతిష్ఠ పెరిగింది. హేమా హేమీలు అనిపించుకున్న వారు ఎవరూ చేయలేని పనిని ఆయన చేశారు. రాష్ట్రంలోనే ఇదొక సంచలన విషయంగా మారింది. ఇటీవల తొట్టంబేడు జెడ్పీటీసీపి అర్చనా దేవి, శ్రీకాళహస్తి జెడ్పీటీసీ వెంకట సుబ్బారెడ్డి, ఏర్పేడు జెడ్పీటీసీ తిరుమలయ్య చంద్రబాబు సంక్షంలో టిడిపిలో చేరారు. అలాగే తొట్టంబేడు మాజీ జెడ్పీటీసీ వెంకటాచలం కూడా టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.ఈ నేపథ్యంలో చంద్రబాబు దగ్గర సుధీర్ రెడ్డి మార్కులు కొట్టేసారని పలువురు అంటున్నారు. 




అయితే దీనిని మాజీ ఎమ్మెల్యే ఎస్ సి వి నాయుడు వర్గం చాలా తేలిగ్గా తీసుకుంది. ఆ జడ్పిటిసి సభ్యులకు విలువ లేదని, వాళ్ళు చెబితే ఓట్లు వేసే వాళ్ళు ఎవరూ లేరని అంటున్నారు. మరి కొంతమంది సుధీర్ రెడ్డికి టికెట్ ఇస్తే తమ గెలుపు సునాయాసమవుతుందని మధుసూధన రెడ్డి భావించి ఈ డ్రామా ఆడారని అంటున్నారు. చంద్రబాబు నాయుడుకు ఈ విషయాలన్నీ తెలుసని కావున నియోజకవర్గంలో బలమైన వర్గం ఉన్న ఎస్ సి వి నాయుడుకే టిక్కెట్ లభిస్తుందని భావిస్తున్నారు. ఎస్ సి వి నాయక్ టికెట్ ఇస్తే శ్రీకాళహస్తి పాటు సత్యవేడు, సూళ్లూరుపేటలో కూడా ఆయన ప్రభావం ఉండి గెలుపునకు దోహదం అవుతుందని అంటున్నారు. అయితే ముగ్గురు అధికారపార్టీ జడ్పిటిసి సభ్యులను పార్టీలోకి తీసుకురావడంతో  టిక్కెట్టు రేసులో  సుధీర్ రెడ్డి ముందంజలో ఉన్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.




సుధీర్ పనితీరు బాగా లేదని, అయనకు టికెట్టు వచ్చే అవకాశం లేదని వార్తలు వచ్చాయి. ఈ దశలో అందరి నోళ్ళు మూయించేలా ఆయన మండలాలలో కీలక ప్రజా ప్రతినిధులను టీడీపీలో చేర్పించారు. దీనితో ఆయన టికెట్టుకు ఢోకా లేదంటున్నారు. అయితే బిజెపితో పొత్తు పెట్టుకుంటే ఈ స్థానం కోసం పట్టు పడతారని వార్తలు వస్తుంటాయి. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కోలా ఆనంద్ పేరు సిఫారసు చేస్తారని అంటున్నారు. ఆయన జోక్యం చేసుకుంటే చంద్రబాబు కాదనలేరని ప్రచారంలో ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి కాకుంటే తిరుపతి స్థానాన్ని ఇవ్వాలని అడుగుతున్నారు. ఈ రెండు నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉంది. తిరుపతి నియోజకవర్గంలో స్వల్ప మెజారిటీ గతంలో ఓడిపోయారు. అలాగే శ్రీకాళహస్తిలో పార్టీ టిక్కెట్టు కోసం సుధీర్ రెడ్డి,  ఎస్ సి వి నాయుడు పోటీపడుతున్నారు. నేపథ్యంలో శ్రీకాళహస్తి సీటును బిజెపి కి కేటాయించడం పట్ల టిడిపి డోలాయమానంలో ఉన్నట్లు సమాచారం.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *