26, ఫిబ్రవరి 2024, సోమవారం

చంద్రగిరిలో సైకిల్ ఎక్కే రెడ్డి ఎవరు ?




చంద్రగిరి టిడిపి టిక్కెట్టు రెడ్డి సామాజిక వర్గం వారికి ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతున్నది. టిడిపి మొదటి జాబితాలో నియోజక వర్గం ఇంచార్జి పులివర్తి నానీ పేరు లేక పోవడంతో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చిత్తూరు పార్లమెంటు నియోజక వర్గంలో ఇతరులకు కేటాయించిన ఐదు స్థానాలలో మూడు చోట్ల కమ్మ సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చారు. కుప్పం చంద్రబాబు నాయుడు, చిత్తూరులో గురజాల జగన్ మోహన్ నాయుడు, నగరిలో గాలి భాను ప్రకాష్ (కమ్మ)కు కేటాయించారు. పలమనేరు అమరనాధ రెడ్డికి ఇచ్చారు. ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ చేసిన జి డి నెల్లూరుకు  డాక్టర్ థామస్ పేరు ప్రకటించారు. మరో రిజర్వుడు నియోజక వర్గం పూతలపట్టు అభ్యర్ధి ప్రకటన వాయిదా పడింది. 


దీనితో చంద్రగిరి టికెట్టు రెడ్డికి ఇస్తారన్న ప్రచారం ఊపందు కొన్నది. పైగా ఇక్కడ రెడ్లు ఎక్కువగా ఉన్నందున టిడిపి 30 ఏళ్లలో ఒక సారి కూడా గెలవ లేదని పరిశీలకులు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారి పల్లె ఈ నియోజక వర్గంలో ఉంది. 1978 లో చంద్రబాబు కాంగ్రెస్ అభ్యర్ధిగా ఇక్కడ పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన 1983లో టిడిపి అభ్యర్థి వెంకట్రామా నాయుడు చేతిలో ఓడిపోయారు. 1989 నుంచి కుప్పంలో వరుస విజయాలు స్వంతం చేసుకున్నారు. ఇక్కడ 1985లో ఎన్ ఆర్ జయదేవ నాయుడు, 1994లో నారా రామమూర్తి నాయుడు సైకిల్ గుర్తుపై గెలిచారు. గల్లా అరుణ కుమారి  కాంగ్రెస్ టికెట్టుపై 1989,1999, 2004, 2009 ఎన్నికల్లో గెలిచారు. 2014లో ఆమె టిడిపి టికెట్టుపై పోటీ చేసి వైసిపి అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో 4,518 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019 లో పులివర్తి నాని చెవిరెడ్డి చేతిలో 41,755 ఓట్ల భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. నాలుగు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన అరుణ కుమారి టిడిపి అభ్యర్థిగా ఓడిపోవడం గమనించదగిన అంశం.


ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలను విశ్లేషిస్తే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నందున రెడ్డికి టికెట్టు ఇస్తేనే మంచిదని చంద్రబాబు భావిస్తున్నారని అంటున్నారు. కాబట్టి ఇక నానీకి మొండి చేయి తప్పదని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి కుమారుడు ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఆయన జూనియర్ ఛాంబర్ ఇంటర్ నేషనల్ జాతీయ ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. యువకుడు, విద్యావేత్త అయిన అతను అయితే మంచిదని ఒక వర్గం భావిస్తోంది. ఆయన పేరు  నగరి నియోజక వర్గానికి కూడా పరిశీలించారు. అక్కడ గాలి భాను ప్రకాష్ కి ఇవ్వడం వల్ల ఇప్పుడు చంద్రగిరి కోసం పరిశీలిస్తున్నారని తెలిసింది. కాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త డాలర్ దివాకర్ రెడ్డి పేరు కూడా ఎక్కువగా వినిపిస్తున్నది. ఆయన నియోజక వర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గుళ్ళు, గోపురాలకు దాన ధర్మాలు చేస్తున్నారు. ఆయన ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ లను కలసి తన మనసులో మాట చెప్పారు. రెండు రోజులుగా ఆయన గ్రామాలలో వాల్ పోస్టర్ కూడా అంటిస్తున్నారు. రెడ్డికి ఇవ్వాలని భావిస్తే అదే సామాజిక వర్గానికి చెందిన తన భార్య సుధా రెడ్డికి ఇవ్వాలని పులివర్తి నాని పట్టుపడుతున్నారు. తన కోడలు కూడా రెడ్డి అని అంటున్నారు. తాను ఐదేళ్లుగా పార్లమెంటు అధ్యక్షుడు, నియోజక వర్గం ఇంచార్జిగా పార్టీకి సేవలు అందించానని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు రెడ్డి  నేతల్లో సైకిల్ ఎక్కే భాగ్యం ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *