5, ఫిబ్రవరి 2024, సోమవారం

గంగాధర నెల్లూరులో అంతా గందరగోళం !


గంగాధర నెల్లూరు రిజర్వుడ్ అసెంబ్లీ స్థానంలో అంతా గందరగోళంగా ఉంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు సొంతింటి అసమ్మతితో సతమతం అవుతున్నాయి. వైసిపి అభ్యర్థి నారాయణస్వామి మీద జ్ఞానేంద్ర రెడ్డి వర్గీయులు తిరుగుబాటు చేస్తున్నారు. అలాగే టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి థామస్ మీద జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పొన్నా యుగంధర్ ఇప్పటికే రాష్ట్ర, జిల్లా నాయకులకు ఫిర్యాదు చేశారు. సొంత పార్టీకి చెందిన మండల పార్టీ అధ్యక్షులు సహకరించడం లేదు. నియోజకవర్గంలోని సిసీనియర్ నాయకులు ముఖం చాటేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి తిరిగి గంగాధర నెల్లూరు టికెట్లను కేటాయించడంతో జ్ఞానేందర్ రెడ్డి అనుచరులు విరచుకుపడుతున్నారు. పార్టీ కోసం పనిచేసేది లేదని ఆందోళన చేస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ థామస్ కూడా నియోజకవర్గంలో సీనియర్ నాయకులను కలుపుకొని పోవడం లేదు. నియోజకవర్గానికి చెందిన మెజారిటీ మండల పార్టీ అధ్యక్షులు  థామస్ కు వ్యతిరేకంగా ఉన్నారు. అలాగే జనసేనకు చెందిన పొన్నా యుగంధర్ కు థామస్ కు పచ్చగడ్డి వేస్తే భగ్గమనే పరిస్థితి నెలకొంది. ఇలా నియోజకవర్గంలో వైసిపి, తెలుగుదేశం పార్టీలు అసెంబ్లీ కుంపట్లను రాజేస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థి గెలవకూడదని సొంత పార్టీ నాయకులు గ్రూపులు గడుతున్నారు. ఇరు పార్టీల వ్యవహారం అధినేతలకు తలనిప్పిగా తయారయ్యింది.

యుగంధర్ ను అవమానిస్తున్న థామస్ !

 జి డి నెల్లూరు నియోజకవర్గంలో టిడిపి, జనసేన పార్టీల మధ్య కోల్డ్ వార్  జరుగుతున్నది. రెండు పార్టీల ఇంచార్జిలకు పడటం లేదన్న వార్తలు వస్తున్నాయి. జనసేన ఇంచార్జి డాక్టర్ పొన్న యుగంధర్ ను టిడిపి ఇంచార్జి డాక్టర్ థామస్ అడుగడుగునా అవమాన పరుస్తున్నారని అంటున్నారు. పొత్తులో భాగంగా జనసేన కూడా టికెట్టు ఆశించడమే ఇందుకు కారణం అంటున్నారు.  గతంలో ఒకసారి జనసేన పార్టీకి వేయి ఓట్లు కూడా లేవన్నారు. పొన్న యుగంధర్ ను తొక్కేస్తానని చెప్పారు. ఇటీవల పెనుమూరులో చెప్పులు కూడా లేని వానికి ఎమ్మెల్యే టిక్కెట్టా అంటూ హేళన చేశారు. ఉమ్మడి కార్యక్రమాలకు ఆహ్వానం పంపడం లేదు. తాజాగా మంగళవారం జరిగే రా కదలి రా కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన బ్యానర్లలో యుగంధర్ ఫోటో ముద్రించకుండా జాగ్రత్త పడుతున్నారు. టిడిపి ఖర్చులతో వేసే బ్యానర్లలో  కొందరు జనసేన నాయకుల ఫోటోలు వేసి, యుగంధర్ ఫోటో వేయలేదు. 

పొత్తులో భాగంగా యుగంధర్ టికెట్టు ఆశిస్తున్నారు. ఆయనకు పోరాట యోధుడిగా పేరు ఉంది. దీనితో పగపట్టిన థామస్ యుగంధర్ ఫోటో ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారని జనసేన కార్యకర్తలు కొందరు ఆరోపిస్తున్నారు. దీనిపై కొందరు జనసేన కార్యకర్తలు అవేశపడి బ్యానర్లను చింపి వేయాలని ప్రయత్నం చేయగా టిడిపి నాయకులు అడ్డుకున్నారు.  తరువాత టిడిపి పార్లమెంటు అధ్యక్షుడు పులివర్తి నాని యుగంధర్ కు ఫోన్ చేసి సర్దుబాటు చేసినట్టు తెలిసింది. మంగళవారం జరిగే రా కదలి రా సభకు రమ్మని కోరారని తెలిసింది. టికెట్టు రాక ముందే ఇలా ఉంటే తరువాత పరిస్తితి ఏమిటని జనసేన కార్యకర్తలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.


'స్వామి' వ్యతిరేకులు తగ్గేదేలే !

డిప్యూటీ సిఎం కె నారాయణ స్వామి వ్యతిరేక వర్గం దగ్గేదే లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు.  సోమవారం ఆరు మండలాలకు చెందిన పలువురు నాయకులు జి డి నెల్లూరులో ఊరేగింపు చేసి  అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి జై జగన్ అంటూ నినాదాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిని ముఖ్య మంత్రి చేయయమే లక్ష్యం అన్నారు. తరువాత నారాయణ స్వామికి టికెట్టు ఇస్తే పని చేయమని చెప్పారు. గతంలో కష్టపడి ఆయనను గెలిపిస్తే పదవులను అమ్ముకున్నారని ఆరోపించారు.  పార్టీ కోసం పని చేసిన వారిని కూడా కేసులు పెట్టి వేధించారని అవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి మహా సముద్రం దయాసాగర్ రెడ్డి నాయకత్వం వహించారు. మాజీ సిడిసిఎంఎస్ అధ్యక్షుడు వేల్కూరు బాబు రెడ్డి, బిసి నాయకుడు గుణశేఖర్ మొదలియార్, పుత్తూరు ధనంజయ రెడ్డి, బండి జగదీష్, నారాయణ స్వామి మేనల్లుడు రమేష్ తదితరులు మాట్లాడారు. దాదాపు 500 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. 

గత రెండేళ్లుగా జి డి నెల్లూరు నియోజక వర్గంలో నారాయణ స్వామికి  కొందరు వ్యతిరేక వర్గంగా ఏర్పడ్డారు. వీరంతా ప్రభుత్వ సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి గూటికి చేరారు. ఇటీవల అందరూ కలసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి తో కలసి నారాయణ స్వామిపై ఫిర్యాదు చేశారు. ఒక దశలో నేరుగా జగన్ మోహన్ రెడ్డికే చెప్పారు. దీనితో జగన్ నారాయణ స్వామిని చిత్తూరు ఎంపిగా, ఎంపి ఎన్ రెడ్డప్పను జి డి నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించారు. అయినా  నారాయణ స్వామి బదులు నూకతోటి రాజేష్ కు ఎమ్మెల్యే టికెట్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంతలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో రాజేష్ కు సత్యవేడు కేటాయించారు. ఇక సమస్య ఉండదని భావించి నారాయణ స్వామికి తిరిగి జి డి నెల్లూరు స్థానం కేటాయించారు. దీనితో రచ్చ మళ్ళీ మొదలయ్యింది. ఆయనకు టిక్కెట్టు రాకుండా చేసే వరకు తగ్గేది లేదని అంటున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *