పేటమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట ప్రారంభం
అమరరాజ సంస్థల అధినేత డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు తమ స్వగ్రామంలో శ్రీ కోదండరామ స్వామి వారి దేవస్థానాన్ని నిర్మించి, స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవాలను ఈరోజు నుంచి నాలుగు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నారు.
అందులో భాగంగా సోమవారం పూతలపట్టు మండలంలోని పేటమిట్టలో ఉదయం 9 గంటలకు ప్రతిష్టించబోయే సమస్త దేవత విగ్రహములను పేటమిట్ట, గణపతి రాపూర్ పోటు కనుమ, కర్ణం వారి పల్లి మరియు కోట్లపల్లి గ్రామాల్లో ఘనంగా ఊరేగించారు.
అలాగే ఉదయం 10 గంటలకు శ్రీమతి గల్లా అరుణ కుమారి ,శ్రీ గల్లా రామచంద్ర నాయుడు గార్లు తమ స్వగృహం నుండి మంగళ వాయిద్యాలతో విరూపాక్షమ్మ తల్లి గుడి దగ్గరకు వెళ్ళి పసుపు కుంకుమలను సమర్పించి, యాగశాలకు చేరుకుని గోపూజ, శ్రీ గణపతి పూజ, పుణ్యాహవాంచన, పంచగవ్యప్రాసన, దీక్షాధారణ వంటి పూజా కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించారు.
సాయంత్రం నాలుగు గంటలకు శాలా వాహన , శోడశస్తంభార్చన, అఖండదీపార్చన, వాస్తు మండపారాధన, వాస్తు హోమము, వాస్తు పర్యగ్నికరణము, వాస్తు బలి, క్షేత్రపాలక, యోగిని, నవగ్రహ మండపారాధన వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
రాత్రి 8 గంటలకు తీర్థప్రసాదాలు స్వీకరించి, పండరి భజన మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. భక్తాదుల రామనామ స్మరణతో మొదటిరోజు కార్యక్రమం ముగిసింది.
స్వామి వారి సేవలో గల్లా అరుణ కుమారి, గల్లా రామచంద్ర నాయుడు, గల్లా రాధాకృష్ణ సర్పంచ్, ట్రస్ట్ సెక్రటరీ గల్లా రాజశేఖర్, ట్రెజరర్ గల్లా రామానాయుడు, సభ్యులు భానుమూర్తి నాయుడు, గల్లా రాజగోపాల్, గల్లా సంపత్ నాయుడు, ఇతర ట్రస్ట్ సభ్యులు, పేటమిట్ట మరియు సమీప గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.