రాజంపేట టీడీపీ ఎంపీ అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రమణ్యం ?
తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు కుమారుడు సుగవాసి బాలసుబ్రమణ్యం ఖరారైనట్లు తెలిసింది. ఈ మేరకు మంగళవారం ఆయన విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని కలిశారు. చంద్రబాబు నాయుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం టిడిపి అభ్యర్థిగా ఖరారు చేసినట్లు సమాచారం. సుగవాసి బాలసుబ్రమణ్యం గతంలో కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. 2012 ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా రాయచోటి నుండి పోటీ చేశారు. బలిజ సామాజికవర్గానికి చెందిన తండ్రీ, కుమారులకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది.
సుగవాసి బాలసుబ్రమణ్యం తండ్రి సుగవాసి పాలకొండ్రాయుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి. ఆయన 1978 నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. పాలకొండ్రాయుడు నాలుగు పర్యాయాలు శాసనసభ్యుడిగా, ఒక పర్యాయం పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందారు, ఆయన 1978లో కడప జిల్లా రాయచోటి నుండి తెదేపా ఎమ్మెల్యేగా గెలపొందారు. 1983లో రెండవసారి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి, రాజంపేట పార్లమెంటు సభ్యుడిగా విజయం సాధించారు. తిరిగి 1999, 2004 సంవత్సరాల్లో రాయచోటి శాసనసభ్యుడిగా విజయం సాధించారు. ఆయనకు కడప జిల్లాలో రాజకీయంగా గట్టి పట్టు ఉంది.
రాజంపేట పార్లమెంటు స్థానం నుండి స్వర్గీయ డికే అధికేశవుల కుమారుడు డీకే శ్రీనివాసులు పోటీ చేయించాలని తెలుగుదేశం పార్టీ భావించింది. గత ఎన్నికల్లో ఆయన తల్లి డీకే సత్యప్రభ రాజంపేట పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేసి ఓడిపోయారు. తల్లిదండ్రుల మరణం తర్వాత డీకే శ్రీనివాస్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయనను రాజకీయంగా క్రియాశీలకం చేయడానికి తెలుగుదేశంతో పాటు జనసేన, వైసీపీ పార్టీ అధినాయకులు కూడా ప్రయత్నాలు చేశారు. అయితే వ్యాపారపరంగా బిజీగా ఉన్నందున తాను రాజకీయాల్లోకి రాదలుచుకోలేదని డీకే శ్రీనివాస్ చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన సుగవాసి పాలకొండ్రాయుడు కుమారుడు బాలసుబ్రమణ్యం బరిలోకి దించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఆయన ఒకసారి టిడిపి తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసే రాజకీయ అనుభవం ఉంది. ఆయనకు కడప జిల్లాలో రాజకీయంగా మంచి పట్టు ఉంది. ఆయన ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకం అయ్యారు. పీలేరులో జరిగిన రా కదలిరా బహిరంగ సభకు భారీ ఎత్తున తన అనుచరులతో కలిసి వచ్చారు.
రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి బిజెపితో పొత్తు ఉంటే ఆ పార్టీ ఆశించింది పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని పోటీ చేయించి, ఆయన గెలిస్తే, కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని బిజెపి ఆలోచనగా తెలుస్తోంది. అయితే పొత్తు విషయం ఇప్పటివరకు ఖరారు కాలేదు. ముందు జాగ్రత్తగా తెలుగుదేశం పార్టీ బాలసుబ్రమణ్యంను తమ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. బిజెపితో పొత్తు విషయం తేలిన తర్వాతనే బాలసుబ్రమణ్యం అభ్యర్థిత్వాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాజంపేట పార్లమెంటు నుండి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. మిథున్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అంతరంగిక మిత్రుడు. పార్టీ అభ్యర్థుల ఎంపికలో కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన పార్లమెంటులో ప్యానల్ స్పీకర్ గా కూడా పనిచేస్తున్నారు. మిథున్ రెడ్డి ఈ పర్యాయం కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని పట్టుదలతో ఉన్నారు. అయితే ఈసారి ఎలాగైనా రాజంపేట పార్లమెంటు గెలిచి తీరాలని తెలుగుదేశం కూడా పార్టీ కృతనిశ్చయంతో ఉంది.