జంగాలపల్లికి రాజ్యసభ ఇవ్వాలి
బలిజ వర్గ వైకాపా కార్పొరేటర్లు డిమాండ్
గత ఐదేళ్లుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నదన్నుగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని విస్మరించడం తగదని చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బలిజ సామాజికవర్గ వైకాపా కార్పొరేటర్లు తెలిపారు. ఈ మేరకు సంబంధిత కార్పొరేటర్లు సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు.
చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఒకటవ డివిజన్ కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ 2019 లో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించి 151 సీట్లను అప్పగిస్తే 2024 లో కాపు సామాజిక వర్గాన్ని విస్మరించడం తగదన్నారు. 72 నియోజకవర్గాలలో 20 లక్షల మంది కాపు సామాజిక వర్గం ఉన్నారన్నారు. కానీ 47 చోట్ల ఒకే సామాజిక వర్గానికి సీటు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చిత్తూరులో 2019లో 44 వేల మెజార్టీతో గెలుపొందిన కాపు సామాజిక వర్గాన్ని విస్మరించడం తగదన్నారు. ప్రస్తుతం చిత్తూరులో మరో సామాజిక వర్గానికి ఎమ్మెల్యే సీటును కేటాయించి, కాపు సామాజిక వర్గానికి రాజ్యసభ టికెట్ ఇస్తానని మాట ఇచ్చి జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పడం పద్ధతి కాదన్నారు. కాపు సామాజిక వర్గాన్ని విస్మరిస్తే మరో కార్యాచరణకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
రాష్ట్రంలోని మొత్తం జనాభాలో ఒక కోటి జనాభా బలిజ సామాజిక వర్గానిదేనని, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 70 స్థానాల్లో బలిజ సామాజిక వర్గం ఓటర్లే అధికంగా ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రి గమనించాలన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చిత్తూరు అసెంబ్లీ టికెట్ కేటాయించిన సందర్భంగా రానున్న ఎన్నికల్లో రాజ్యసభ సీటును బలిజ కులానికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులుకు కేటాయిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తెరగాలన్నారు.
ఇకనైనా ముఖ్యమంత్రి జగన్ పాలన శ్రీనివాసులుకు రాజ్యసభ సీటు కేటాయించేలా తన నిర్ణయాన్ని ప్రకటించాలన్నారు. లేనిపక్షంలో తమ తదుపరి కార్యాచరణను ప్రకటించాల్సి వస్తుందన్నారు. ఈ సమావేశంలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కో - ఆప్షన్ సభ్యులు కోలా కిరణ్, 31 డివిజన్ కార్పొరేటర్ పూర్ణచంద్రరావు, వైసిపి నాయకులు రఘు, రవి తదితరులు పాల్గొన్నారు.