అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించిన రాష్ట్ర ఆర్థిక మంత్రి
సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం గురించి ఏమాత్రం లేదు. రాష్ట్ర వెనుకబాటుతనానికి ముసుగువేసి గొప్పలు చెప్పుకున్నదని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ళ ప్రభుత్వ పథకాలను ఏకరువు పెట్టడం తప్ప రాష్ట్రానికి కీలకమైనటువంటి సమస్యల గురించి ప్రస్తావించకపోవడం దారుణం. ప్రత్యేకహోదా, రాజధాని నిర్మాణం వంటి ముఖ్యాంశాలపై బడ్జెట్ ప్రసంగం మౌనముద్ర వహించడం తగదు. పోలవరం ప్రాజెక్టు గురించి పేర్కొన్నప్పటికీ సర్వస్వం కోల్పోతున్న నిర్వాసితుల గురించి ఒక్క పదం కూడా లేకపోవడం ఈ ప్రభుత్వం నిర్వాసితుల పట్ల, గిరిజనుల పట్ల ఎంత కక్షపూరితంగా ఉందో అర్థమవుతున్నది.
ఆశా, వివోఏ, వంటి మహిళా శ్రామికుల వేతనాలు పెంచామని ప్రభుత్వం గొప్పగా చెప్పింది. కానీ అంగన్‌వాడీ, మున్సిపల్ కార్మికులు, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులకు సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీకి నిర్దిష్ట ప్రతిపాదనేమీ లేదు. డ్వాక్రా మహిళల అప్పులు రద్దు చేసే ప్రతిపాదనేమీ లేదు. రాబోతున్న రోజుల్లోనైనా సానుభూతిగా పరిశీలిస్తామని ఒక్క మాట కూడా మంత్రి తన ప్రసంగంలో పేర్కొనలేదు. పైపెచ్చు వచ్చే బడ్జెట్ కూడా మేమే పెడతాం అని గొప్పలు చెబుతున్నారు.
రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బిజెపితో వైసిపి షరీకయ్యిందనడానికి బడ్జెట్ ప్రసంగం ఓ నిదర్శనం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మిగిలిన ఇతర సమస్యలను కూడా త్వరలో పరిష్కారం లభించబోతోంది అని చెప్పడం ద్వారా రానున్న రోజుల్లో బిజెపితో వైసిపి చెట్టపట్టాలు వేసుకునే వెళ్తుందని స్పష్టమవుతోంది. ఈ కారణంగానే ప్రత్యేకహోదా విషయంలోనూ, రాష్ట్రానికి కీలకమైన పోలవరం నిధులు, ముఖ్యంగా నిర్వాసితులకు సంబంధించి పునరావాసం వాటి విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడగలేకపోవడం, విశాఖ ఉక్కు, రైల్వే జోన్, కడప ఉక్కు వంటి విషయంలో కూడా అదే వైఖరి అవలంభించడం రాబోతున్న రోజుల్లో కూడా అదే కొనసాగుతుందని అర్థమవుతుంది.
కీలకమైన వ్యవసాయ రంగం గురించి బడ్జెట్ ప్రసంగంలో నాలుగో చాప్టర్‌లో పేర్కొనడంలోనే ఈ ప్రభుత్వం వ్యవసాయానికి ఇస్తున్న ప్రాధాన్యత బోధపడుతోంది. అంతేగాక ధరల స్థిరీకరణ నిధిని మూడు వేల కోట్ల పాయలతో ఏర్పాటు చేశామని చెప్పారే తప్ప ఎంత ఖర్చు చేసింది చెప్పలేదనడంలోనే ఆ ధరల స్థిరీకరణ నిధి ఒట్టి మాటే అని స్పష్టమవుతోంది. ఆర్‌బికెల ద్వారానే సర్వస్వం అంటున్నప్రభుత్వం ఏ పంటకు సంబంధించి మద్దతు ధర చెల్లించడం లేదు సరికదా ముఖ్యమైన ధాన్యం కొనుగోలు కూడా మిల్లర్ల ఇష్టారాజ్యమే సాగుతోంది తప్ప ప్రభుత్వం కంట్రోలు ఏమాత్రం లేదన్నది ఇప్పటికే రైతులకు బోధపడినటువంటి సత్యం.
తమ భూములపై రీసర్వే పేరిట ఎవరెవరికో బదలాయింపు చేయిస్తున్నారని రైతులు ఒకవైపు గగ్గోలు పెడుతుంటే సహజ న్యాయ సూత్రాలకు విరుద్దంగా ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అని న్యాయవాదులు రాష్ట్రవ్యాపితంగా ఆందోళనలు చేస్తున్నారు. కానీ ఆర్థిక మంత్రి మాత్రం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ని ఘనంగా చెప్పుకోవడం సిగ్గుచేటు. మరోవైపు పేదలవద్ద ఉన్న భూముల్ని గుంజుకొని సంపన్నులకు కట్టబెట్టడానికి అసైన్డ్‌చట్ట సవరణ చేసిన ప్రభుత్వం బడ్జెట్ ప్రసంగంలో దళితులకు, పేదలకి భూములు ఇచ్చేశామని చెప్పడం అన్యాయం.
రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం 2019`20లో 1203 యూనిట్లు ఉన్నది 2023 డిసెంబర్ నాటికి 1400 యూనిట్లకు పెరిగిందని గొప్పలు చెప్పినటువంటి ఆర్థిక మంత్రి ఈకాలంలో విద్యుత్ ఛార్జీలను ఎంతలా పెంచిందీ, ట్రూఅప్, ఎఫ్‌టిపిసిఏ పేరిట దొంగదెబ్బ ఎలా తీసింది ఒక్క ముక్క కూడా చెప్పకపోవడం దారుణం. అంతేగాక అదానీ పవర్‌ని సెకీ ద్వారా చేసుకున్నటువంటి ఒప్పందాన్ని గొప్పగా చెప్పుకొని ఈ రాష్ట్రంలో అన్ని రోజుల్లోనూ దాదాపు అందుబాటులో ఉండే సోలార్ పవర్‌ని రూఫ్‌టాఫ్ ద్వారా ట్యాప్ చేసుకోగలిగిన అవకాశాన్ని వినియోగించుకోలేక పోతున్నాం అన్నటువంటి ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు.
ఇల్లు కాదు, ఊళ్ళే కట్టిస్తామని గొప్పగా చెప్పిన ప్రభుత్వం ఈ కాలంలో 30 లక్షలకు పైగా ఇళ్ళ పట్టాలు ఇచ్చామని, 22 లక్షలకు పైగా ఇళ్ళను ప్లాన్ చేశామని, వాటిలో 9 లక్షల ఇళ్ళు పూర్తయిపోయాయని చెప్పినప్పటికీ వాస్తవ సంఖ్య మాత్రం ఈ జగనన్న కాలనీల్లో కేవలం 1,62,538 మంది లబ్దిదారులు నివసిస్తున్నారు అని పేర్కొనడం ఈ ఐదేళ్ళ కాలంలో ఇళ్ళ నిర్మాణం పట్ల ఎంత నిర్లక్ష్యం వహించిందో స్పష్టంగా తేలుతుంది.