సత్యవేడు టిడిపి టిక్కెట్టు రేసులో కిరణ్ కుమార్ జయరాం
సత్యవేడు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ టికెట్ కోసం ప్రతిష్టాత్మక అంబేద్కర్ అవార్డు గ్రహీత, దళిత నేత కిరణ్ కుమార్ జయరాం ప్రయత్నం చేస్తున్నారు, ఆయన రాష్ట్ర, జిల్లా నాయకులను కలిసి తన బయోడేటాను అందజేశారు. తను చేసిన సేవా కార్యక్రమాలను వివరించారు. తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాల్సిందిగా కోరారు. రాష్ట్ర నాయకత్వం కూడా కిరణ్ కుమార్ అభ్యర్థిత్వన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. కిరణ్ కుమార్ తండ్రి జయరాం కూడా రాజకీయాలలో ఉండటంతో కలిసి వస్తుందని భావిస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో విస్తృతంగా బందువర్గం ఉందని, రానున్న ఎన్నికల్లో తనకు అండగా నిలబడతారని భావిస్తున్నారు.
బి.టెక్, బిఎ, ఎంబీఏ చేసిన కిరణ్ కుమార్ ఏర్పేడు మండలం మోదుగులపాలెంకు చెందిన పదవి విరమణ చేసిన ప్రధానోపాధ్యాయులు జయరామయ్య కుమారుడు. జయరామయ్య ప్రస్తుతం మోదుగులపాలెం గ్రామ సర్పంచ్ గా పనిచేస్తున్నారు. కిరణ్ కుమార్ ఎస్కేఎంసీలో ఇంజనీరుగా 25 సంవత్సరాలు పాటు శ్రీకాళహస్తిలో సేవలందించారు. అలాగే శ్రీకాళహస్తి సహకార టౌన్ బ్యాంకులో వాల్యుయర్ గా 23 సంవత్సరాలు పనిచేశారు. ప్రముఖ కంపెనీలకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్లాన్స్ కన్సల్టెంట్ గా సేవలందించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో ఉమ్మడి రాష్ట్రాల ఉపాధి హామీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఏపీ ఈ ఆర్ పి ప్రపంచ బ్యాంకు నిధులతో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో శ్రీకాళహస్తి, తొట్టంబేడు, కేవిబి పురం, బుచ్చి నాయుడు ఖండ్రిగ, వరదయ్యపాలెం మండలాల్లో ఇంజనీరుగా నీటి సంఘాలను నిర్వహించారు. చేయూత చారిటబుల్ ట్రస్ట్ కు ప్రధాన కార్యదర్శిగా ప్రజల, విద్యార్థుల సంక్షేమం కోసం పాటుపడ్డారు. హాస్టల్ విద్యార్థులకు దోమ తెరలు, క్రీడా సామాగ్రి, నోటు పుస్తకాలు, భోజన కంచాలు, గ్లాసులు పంపిణీ చేశారు.
అలాగే వివిధ కుల సంఘాలలో పనిచేస్తూ దళితుల అభ్యున్నతికి పాటుపడ్డారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచి, నిత్యావసరాలను పంపిణి చేశారు. దళితుల అభ్యున్నతి కోసం పరిశ్రమల స్థాపనకు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ సౌజన్యంతో అవగాహన సదస్సులు నిర్వహించారు. రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. కిరణ్ కుమార్ విద్యార్థి దశ నుండి నాయకుడిగా ఉన్నారు. పదవ తరగతిలో, కళాశాలలో విద్యార్థి సంఘ నాయకుడుగా ఎన్నికయ్యారు. 2000 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఏర్పేడు మండల శాఖ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా విధులు నిర్వహించారు. పార్టీ తరపున బుచ్చినాయుడు కండ్రిగ మండల పరిశీలకులుగా పనిచేశారు. రెండు మార్లు పంచాయతీ సర్పంచ్ గా పోటీ చేశారు. ప్రస్తుతం జిల్లా ఎస్సీ సెల్ కార్యనిర్వహ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం, అమరావతి రాజధాని కోసం జరిగిన ఉద్యమాలలో వారికి మద్దతుగా పలు ఉద్యమాలను నిర్వహించారు. కిరణ్ కుమార్ దళితులకు చేస్తున్న సేవలను గుర్తించి జాతీయ దళిత సాహిత్య అకాడమీ అంబేద్కర్ అవార్డును ప్రకటించింది. అకాడమీ అధ్యక్షుడు సుమనాక్షర్ ఈ అవార్డును ఢిల్లీలో అందచేశారు.
కిరణ్ కుమార్ తండ్రి జయరాం కూడా ఉద్యమ నాయకుడే. ఆయన జిల్లా ఏపీటీఎఫ్ ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర ఆర్గనైజర్ గా చేశారు. విద్యా శాఖలో ఎం ఈ ఓ గా, ప్రధానోపాధ్యాయుడిగా సేవలందించారు. జిల్లా ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ, ఉద్యోగ, ఉపాధి అవకాశాల మీద ప్రజలకు అవగాహన కలుగజేశారు. శ్రీకాళహస్తిలో అంబేద్కర్ భవన నిర్మాణానికి, అంబేద్కర్ విగ్రహ స్థాపనకు కృషి చేశారు. పదవి విరమణ తర్వాత ఎస్సీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా దళితుల సమస్యలపై పోరాటం చేశారు. యునైటెడ్ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి మైనార్టీల సమస్యల పరిష్కారాన్ని కూడా కృషి చేశారు. ప్రస్తుతం ఏర్పేడు మండలం మోదుగులపాలెం సర్పంచిగా పనిచేస్తూ అధికార పార్టీ దౌర్జన్యాలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్ సి వి నాయుడు, తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ సుధీర్ రెడ్డి సహకారంతో మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నారు.
రాజకీయంగా, సామాజికంగా అనుభవం ఉన్న తనకు రానున్న ఎన్నికలలో సత్యవేడు ఎమ్మెల్యే టికెట్ ని ఇవ్వాల్సిందిగా కిరణ్ కుమార్ కోరుతున్నారు. రానున్న ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తే సత్యవేడులో గెలిచి తీరుతానని ధీమాను వ్యక్తం చేశారు. అలాగే శ్రీకాళహస్తి, పుత్తూరు నియోజకవర్గాల్లో కూడా పార్టీకి ప్లస్ అవుతుందన్నారు. ప్రజల మనిషిగా ప్రజలకు అనేక సేవలు అందించిన తన సేవలను గుర్తించి, పార్టీ వినియోగించుకోవాల్సిందిగా కిరణ్ కుమార్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు.