రామచంద్రుని కట్టడికి చంద్రవ్యూహం !
రానున్న ఎన్నికల్లో జిల్లాలో రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కుటుంబాన్ని కట్టడి చేయడానికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పటిష్ఠమైన వ్యూహం రూపొందించినట్టు తెలిసింది. ఇందుకు అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇందుకు ఇప్పుడు పుంగనూరు ఇంచార్జిగా ఉన్న చల్లాబాబు ఉపయోగం లేదని ఇప్పటికే పలువురు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళారు. అలాగే చంద్రబాబు, లోకేష్ నిర్వహించిన పలు సర్వేలలో కూడా అనుకూలంగా రాలేదని తెలిసింది. ఇటేవల చల్లాబాబు మీద రౌడి షీట్ ను పోలీసులు ఓపెన్ చేశారు. కావున చల్లాబాబు నామినేషన్ వేసినా, ఎన్నికల సమయంలో పోలీసులు కట్టడిచేసే అవకాశాలు ఉన్నాయి.
కావున నియోజకవర్గానికి సుపరిచితులు అయిన అమరనాధ రెడ్డిని బరిలోకి దించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అలాగే తెదేపా, జనసేన, భాజాపా పొత్తులో భాగంగా రాజంపేట పార్లమెంటుకు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని రంగంలోకి దింపే అవకాశం ఉంది. ఇదే జరిగితే, పుంగనూరు, రాజంపేటలో పెద్దిరెడ్డి, మిధున్ రెడ్డికి టైట్ అవుతుందని భావిస్తున్నారు. వారిని నియోజకవర్గానికే పరిమితం చేస్తే, జిల్లాలో, కుప్పం నియిజకవర్గం మీద పెద్దిరెడ్డి దృష్టిని కేంద్రీకరించే అవకాశాలు తగ్గుతాయి. కావున జిల్లాలో తెదేపా విజయకేతనం ఎగురవేయాలని వ్యూహరచన చేసినట్లు తెదేపా వర్గాలు తెలిపాయి.
పుంగనూరు నియోజక వర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై మాజీ మంత్రి ఎన్ అమరనాద రెడ్డిని పోటీ పెట్టాలని చూస్తున్నారు. ఇక్కడ 2009 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచి రామచంద్రా రెడ్డి హ్యాట్రిక్ సాధించారు. పాత నియోజక వర్గంలో అమరనాద రెడ్డి రెండు సార్లు, ఆయన తండ్రి మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. కాబట్టి అమరనాద రెడ్డిని పోటీ పెడితే పెద్దిరెడ్డిని ఓడించే అవకాశం ఉందని బాబు ఆలోచనగా చెపుతున్నారు. ఒక వేళ ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. కాగా రాజంపేట లోక్ సభ స్థానం బిజెపికి కేటాయించి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని పోటీ పెట్టాలని చూస్తున్నారు. ఇక్కడ రామచంద్రా రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి 2014, 2019లో ఎంపిగా ఎన్నికయ్యారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి సాయి ప్రతాప్ గెలిచారు. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గెలిస్తే కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంది.
కిరణ్ కుమార్ రెడ్డి మూడేళ్లు ముఖ్య మంత్రిగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారు. తొలినుంచి కిరణ్ కు, పెద్దిరెడ్డి కి పడదు. తన చిరకాల ప్రత్యర్థి అయిన రామచంద్రా కుమారునిపై వారి ప్రత్యర్ధి అయిన కిరణ్ కుమార్ రెడ్డిని పోటీ పెడితే గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. అలాగే తంబళ్లపల్లెలో రామచంద్రా రెడ్డి తమ్ముడు ద్వారకనాధ రెడ్డి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డిని పోటీ చేయించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇక్కడ 2009లో ప్రవీణ్ కుమార్ రెడ్డి, 2014లో జి శంకర్ టిడిపి టికెట్టుపై గెలిచారు. 2019లో ద్వారకనాధ రెడ్డి గెలిచారు. రామచంద్రా రెడ్డి, ఆయన కుమారుడు, తమ్మునిపై గట్టి అభ్యర్ధులను పోటీ పెడితే వారిని ఆయా నియోజక వర్గాలకే పరిమితం చేయవచ్చని భావిస్తున్నారు.
కాగా రాజంపేట నియోజక వర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. అన్ని చోట్ల వైసిపి వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇందులో కోడూరు ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించారు. రాజంపేట, రాయచోటి, తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు జనరల్ స్థానాలు. అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలలో ఆచి తూచి అభ్యర్థులను పెట్టాలని చూస్తున్నారు.