జ్ఞానేంద్రరెడ్డిపై స్వామి వర్గం ఎదురుదాడి !
ప్రభుత్వ సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డిపై ఊప ముఖ్య మంత్రి కళత్తూరు నారాయణ స్వామి వర్గం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పెనుమూరు వైసిపి మండల పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వర్గం చేస్తున్న సంకుచిత రాజకీయాలపై ధ్వజం ఎత్తారు. జ్ఞానేంద్ర రెడ్డి కుటుంబానికే పడవులన్నీ ఇచ్చినా ఆయనకు పదవీ దాహం తీరలేదని ఎద్దేవా చేశారు. ఆయన కేబినెట్ హోదా కల పదవిని అనుభవిస్తున్నారని అన్నారు. ఆయన అన్న కుమారుడు దయాసాగర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆయన దాయాది భార్య హేమలత ఎంపిపిగా ఉన్నారని తెలిపారు. ఆయన సూచన మేరకే దొరస్వామి యాదవ్ ను జెడ్పీటీసీ చేశామని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకే కాంట్రాక్టులు అన్నీ ఇస్తున్నారని అన్నారు. అయితే ఆయన బంధువు, ఎంపీపీ భర్త సురేష్ రెడ్డిని కన్వీనర్ గా తొలగించి నండుకే కక్ష కట్టారని ఆరోపించారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ బండి కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్న జ్ఞానేంద్ర వర్గం మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నారాయణ స్వామికి టికెట్టు రాకుంటే తాను ఆత్మ హత్య చేసుకుంటానని సవాలు విసిరారు. సాతంబాకం బాకం ఎంపీటీసీ యశోదా రెడ్డి మాట్లాడుతూ అసమ్మతి నేతలకు దమ్ముంటే పార్టీకి రాజీనామా చేయాలని సవాలు చేశారు. రాజేష్ టికెట్టు కోసం తన పిన్నమ్మ కుతూహలమ్మకు ద్రోహం చేసిన వారితో చేతులు కలపడం నీతిభాహ్య చర్య అన్నారు.
జిల్లా నాయకుడు పందికుంట కృష్ణా రెడ్డి మాట్లాడుతూ దళిత ఎమ్మెల్యే లను బెదిరించి బ్లాక్ మెయిల్ చేయడం తొలినుంచి జ్ఞానేంద్ర రెడ్డికి అలవాటు అన్నారు. తన వర్గాన్ని కాపాడుకోవడం కోసం రాజేష్ పేరుతో మైండ్ గేమ్ ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. మండల పార్టీ కన్వీనర్ కామసాని విజయ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ పరువును బజారుకు ఈడుస్తున్న పారిని పార్టీ నుంచి బహిష్కరించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో జ్ఞానేంద్ర వర్గం వ్యతిరేకించినా నారాయణ స్వామి భారీ మెజారిటీ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మధు సూధన రెడ్డి, దూది మోహన్ తదితరులు పాల్గొన్నారు.