24, డిసెంబర్ 2023, ఆదివారం

ప్రశాంత్ కిషోర్ రాకతో టిడిపి అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్..




ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలవడంపై చిత్తూరు జిల్లాలోని తెదేపా నాయకులు కొందరు అందోళన చెందుతున్నారు. తమకు టిక్కెట్టు వస్తుందో రాదో అన్న సందేహం వ్యక్తం అవుతోంది. కొందరు నాయకులు పార్టీ నాయకుల ద్వారా, స్నేహితుల ద్వారా, ఆర్థిక బలం ద్వారా ఇంచార్జిలుగా తెచ్చుకున్నారు. ఇందులో కొందరు రాభిన్ శర్మ టీంను మేనేజ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరికి  ప్రజాబలం, ధన బలం లేకున్నా, పార్టీకి ఉన్న ఇమేజ్ తో గెలిచిపోవచ్చని భావిస్తున్నారు. ఇంకొందరు మంది సొమ్ముతో ఎన్నికల రంగంలోకి దిగాలని చూస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ రాకతో ఇలాంటి వారికీ అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. ఇలా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టికెట్టు ఆశిస్తున్న కొందరు ఇంచార్జిల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. కొత్తగా సర్వేలు చేసి, విశ్లేషిస్తే తమకు టికెట్టు రాదేమో అన్న గుబులు ప్రారంభం అయ్యింది. పార్టీ కార్యాలయంలో కాకాలు పట్టి అనుకూలంగా రిపోర్టులు రాయించు కోవడం కుదరదు అన్న బాధ కనిపిస్తోంది. 


గత ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 14 నియోజక వర్గాలలో టిడిపి నుంచి చంద్రబాబు ఒక్కరే గెలిచారు. అప్పటి వరకు ముఖ్య మంత్రిగా ఉన్న ఆయన స్వంత జిల్లాలో 13 చోట్ల చిత్తుగా ఓడిపోవడానికి అభ్యర్థుల ఎంపికలో లోపమే కారణం అన్నది అందరికీ తెలిసిందే. లగడపాటి రాజగోపాల్, టిడిపి స్వంత సర్వే సంస్థలు, అనుకూల మీడియా చేసిన సర్వేలు  తప్పుల తడకగా ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ ద్వారా కూడా సర్వే చేస్తారని అంటున్నారు. ప్రస్తుతం రాబిన్ శర్మ బృందం, లోకేష్ స్వంత మనుషులు సర్వేలు చేస్తున్నారు. అయితే అందులో కొందరు లాలూచీ పడి తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని చంద్రబాబు దృష్టికి వెళ్ళింది. దీంతో అందరికీ చెక్ పెట్టవచ్చు అన్న ఉద్దేశ్యంతో ప్రశాంత్ కిషోర్ ద్వారా కొత్తగా సర్వే చేస్తారని అంటున్నారు. 


అయితే ఇప్పటికే రూపొందించిన ప్యానల్ లిస్టు ప్రశాంత్ చేతికి ఇచ్చారని అందులో గట్టి అభ్యర్థిని ఎంపిక చేస్తారని అంటున్నారు. దీనికోసం కొన్ని మార్గదర్శకాలు రూపొందించారని తెలిసింది. గతంలో రెండు, మూడు సార్లు ఓడిపోయిన వ్యక్తులు, కుటుంబ సభ్యులకు, గత ఎన్నికల్లో భారీ ఓట్ల తేడాతో ఓటమి పాలయిన వారికి తిరిగి టిక్కెట్టు ఇవ్వడం మంచిది కాదని ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు సమాచారం. నియోజక వర్గంలో అధిక శాతం ఓట్లు ఉన్న వర్గాలకు చెందిన వారిని అభ్యర్థిగా పోటీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. వీరిలో  విద్యా వంతులు, అవినీతి మరక అంటని వారు, కొత్త వారు, యువతను రంగంలో దింపాలని నిర్ణయించుకున్నారు. కోవర్టు రాజకీయాలు చేసే వారు, అవకాశ వాదులను పూర్తిగా పక్కన పెట్టనున్నారు.


ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం కుప్పంలో చంద్రబాబు నాయుడు, పీలేరులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పలమనేరు నుంచి ఎన్ అమరనాద రెడ్డి పోటీ చేస్తారు. చిత్తూరు నుంచి  సి కె బాబు, జగన్ మోహన్ నాయుడు, కాజూరు బాలాజీ, కటారి హేమలత పేర్లు పరిశీలనలో ఉన్నాయి. నగరి జాబితాలో గాలి భాను ప్రకాష్, ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డి, అశోక్ రాజు పేర్లు ఉన్నాయి. శ్రీకాళహస్తి నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి, ఎస్ సి వి నాయుడు, రెడ్డివారి గురవా రెడ్డి టికెట్టు రేసులో ఉన్నారు. తిరుపతిలో సుగుణమ్మ, సూరా సుధాకర్ రెడ్డి, ఊకా విజయ కుమార్, నరసింహ యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. చంద్రగిరిలో పులివర్తి నాని, మబ్బు దేవ నారాయణ రెడ్డి, కొల్లూరు ఇందు శేఖర్ టికెట్టు ఆశిస్తున్నారు. 


మదనపల్లిలో దొమ్మలపాటి రమేష్, షాజహాన్ బాషా, శ్రీరామ్ చినబాబు రేసులో ఉన్నారు. తంబళ్లపల్లె నుంచి శంకర్ యాదవ్, ప్రవీణ్ కుమార్ రెడ్డి పేర్లు ఉన్నాయి. పుంగనూరు నియోజకవర్గంలో  చల్లా రామచంద్రా రెడ్డి, అనీషా రెడ్డి, సోమల సురేష్ టికెట్టు ఆశిస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వు చేసిన సత్యవేడు నియోజక వర్గం నుంచి హెలెన్, జేడీ మౌనిక, డాక్టర్  చందన స్రవంతి పోటీ పడుతున్నారు. జి డి నెల్లూరు నియోజక వర్గం నుంచి డాక్టర్ థామస్, రాజేంద్ర, గ్యాస్ రవి పేర్లు పరిశీలిస్తున్నారు. పూతలపట్టు నియోజకవర్గం టికెట్టు కోసం డాక్టర్ మురళి మోహన్, డాక్టర్ సప్తగిరి ప్రసాద్, అనగల్లు మునిరత్నం, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ పుష్పరాజ్ టిక్కెట్టు రేసులో ఉన్నట్లు సమాచారం.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *