బెయిలు రద్దుపై విచారణ జనవరి 19కి వాయిదా
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు జనవరి 19కి వాయిదా వేసింది. స్కిల్ స్కామ్ కేసులో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై గతంలోనే వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఇవాళ మరోసారి పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్రశర్మలతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 19కి వాయిదా వేసింది.
శుక్రవారం నాటి విచారణ సందర్భంగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించిన 17ఏ అంశం మీద ఇప్పటి వరకూ తీర్పు ఇవ్వలేదని చంద్రబాబు తరఫు న్యాయవాదులు సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసు వ్యవహారం 17ఏ తీర్పుపై ఆధారపడి ఉందని చంద్రబాబు తరుఫు న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టుకు తెలియజేశారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ప్రభుత్వ తరుఫు న్యాయవాది చంద్రబాబుకు ధర్మాసనం గతంలో నోటీసులు ఇచ్చినా, ఇంకా కౌంటర్ వేయలేదని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో తాము కౌంటర్ దాఖలుకు సిద్ధంగానే ఉన్నామని హరీశ్ సాల్వే కోర్టుకు తెలిపారు.
ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణను జనవరి మూడో వారంలో చేపడతామని తెలిపింది. అయితే, తేదీ ఖరారు చేయాలని చంద్రబాబు తరుఫు న్యాయవాదులు కోరటంతో తదుపరి విచారణను జనవరి 19కి వాయిదా వేసింది. అప్పటిలోగా కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదిని ఆదేశించింది. ఆ కౌంటర్‌కు రిజాయిండర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ఆదేశించింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును గతంలో ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలులో చంద్రబాబు నాయుడు 53 రోజుల పాటు ఉన్నారు. ఆ తర్వాత కంటి శస్త్ర చికిత్స కోసం బెయిల్ ఇవ్వాలన్న చంద్రబాబు వినతి మేరకు కోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇదే సమయంలో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారించిన ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.