17, డిసెంబర్ 2023, ఆదివారం

బహుముఖ ప్రజ్ఞాశాలి డా. NB సుధాకర్ రెడ్డి



ఆయనకు పరిచయం లేని రంగం లేదు. చేపట్టని పదవి లేదు. పనిచేయని పార్టీ లేదు. పరిచయము లేని నేత లేదు. ఆయన ప్రస్థానం ప్రారంభించింది ఆర్ఎస్ఎస్ లో, కొనసాగుతున్నది తెలుగుదేశం పార్టీలో. మధ్యలో జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలలో అనేక పదవులు నిర్వహించారు. ఒకసారి తెలుగుదేశం పార్టీలో ఉద్దండ నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు పైనే పోటీ చేశారు. మరో సారి MLCగా పోటి చేశారు. ఆయన అనేకులకు స్ఫూర్తిదాయకం. మరికొందరికి రాజకీయ గురువు. కొందరి రాజకీయ విజయం వెనుక ఆయన తంత్రం ఉంది. వ్యక్తిత్వ  వికాసకుడుగా, సైకాలజిస్ట్ గా రాష్ట్రంలో ఆయన పేరు తెలియని విద్యావంతులు లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన ఒకప్పుడు బాంబులతో ఆడుకున్నారు. ఇప్పుడు వీడియోలతో ప్రతిపక్షాన్ని చీల్చి చెండాడుతున్నారు. RSSలో క్రమశిక్షణ నేర్చుకున్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ద్వారా నాయకునిగా పరిచయమయ్యారు. జనతా పార్టీ జిల్లా యువజన అధ్యక్షులు రాజకీయ అరగ్రేటం చేశారు. పత్రికా విలేకరిగా ప్రపంచంతో ఎలా మెలగాలో వంటపట్టించుకున్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో రెబల్ గా నిలచారు. ప్రస్తుతం సైకాలజిస్ట్ గా దారితప్పుతున్న జీవితాలను గాడిలోపెడుతూ.. తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా సేవలు అందిస్తున్నారు. ఆయన ఎవరో కాదు, అనూహ్యంగా టిడిపిలో రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి. ఆ పేరు ఇప్పుడు రాజకీయాలలో  ప్రముఖంగా వినిపిస్తోంది. జర్నలిస్టు, వికాస శిక్షకుడు, సైకాలజిస్టు అయిన ఆయన రాజకీయ నాయకుడుగా మారి టిడిపిలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. 




పెనుమూరు మండలం దాసరి పల్లెకు చెందిన ఆయన పదవ తరగతి వరకు  పెనుమూరు ఉన్నత పాటశాలలో చదివారు. చిత్తూరు కన్నన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివారు. తిరుపతిలో డిప్లొమా ఇన్ ఫార్మసీ చదువుతూనే ప్రైవేటుగా  బి ఎ చదివారు.  ఆయన విద్యార్థి దశలో 1977 లో అర్ ఎస్ ఎస్ చిత్తూరు తాలూకా కార్యవాహగా పనిచేశారు. 1978 నుంచి 80 వరకు అఖిల భారతీయ  విద్యార్థి పరిషత్ జిల్లా కన్వీనర్ గా పనిచేశారు. 1980-83 వరకు జిల్లా యువజనత అధ్యక్షునిగా పనిచేశారు. అదే సమయంలో ఆయన బెంగళూరులో ఎల్ ఎల్ బి  చదివారు. 1983 లో పుత్తూరు నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా టిడిపి అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమ నాయుడుపై పోటీచేసి ఓడిపోయారు. తరువాత యువ జనతా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 




1985 లో కాంగ్రెస్ లో చేరి యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1987 నుంచి 1997 వరకు యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తరువాత 1999 వరకు జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ చైర్మన్ పదవులు నిర్వహించారు. 1999లో టిడిపి నుంచి వచ్చిన గాలి ముద్దు కృష్ణమ నాయుడుకు కాంగ్రెస్ టిక్కెట్టు ఇవ్వడాన్ని వ్యతిరేకించి వ్యతిరేకంగా పనిచేశారు. దీనితో అప్పటి పిసిసి అధ్యక్షుడు డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఆయనను  ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీనితో ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ బి వి పట్టాభిరాం, ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ప్రోత్సాహంతో సైకాలజిస్టు, వ్యక్తిత్వ వికాస శిక్షకునిగా వృత్తి చేపట్టారు. ఈ కాలంలో  రాష్ట్ర పాజిటివ్ థింకర్స్ క్లబ్ ఉపాధ్యక్షుడు, రాష్ట్ర కౌన్సెలింగ్ సైకాలజిస్టు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 



పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా తిరుపతి చాప్టర్ కార్యదర్శి, అధ్యక్షుడు, జాతీయ మండలి సభ్యునిగా ఉన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో  20 ఏళ్ళు పబ్లిక్ రిలేషన్స్ కోర్సు పాఠాలు చెప్పారు. తిరుపతి కోర్టులోని మీడియేషన్ కేంద్రంలో ఏడేళ్లు లీగల్ మీడియేటర్ గా ఉన్నారు. టిటిడి స్వేత లో 20 ఏళ్ళు గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేశారు. న్యాయవాదులు, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్రీయ సేవా సమితి, బాలల సంక్షేమ గృహాలు, కార్పొరేట్ సంస్థలలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. 2011 లో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ గా పోటీ చేశారు.



ఇదిలా ఉండగా ఆయన నిత్య విద్యార్థిగా నాలుగు పిజీలు, ఎం ఫీల్, పి హెచ్ డి, ఆరు డిప్లొమాలు చదివారు. 1983  నుంచి 90 వరకు ఆంధ్రప్రభ, 1987 నుంచి 90 వరకు ఈ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ గా పనిచేశారు. 1987 నుంచి 1990 వరకు ఏక కాలంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉంటూనే రెండు పత్రికలకు రిపోర్టర్ గా చేయడం విశేషం. తరువాత ఇప్పటి వరకు ఫ్రీలాన్స్ జర్నలిస్టు, కాలమిస్టుగా వివిధ  పత్రికలకు ఆర్టికల్స్ రాస్తున్నారు. ప్రస్తుతం వార్త దినపత్రికలో వ్యధ అన్న శీర్షిక, రేపటి కోసం పత్రికలో స్పృహ అన్న కాలం నిర్వహిస్తున్నారు.



లాక్ డౌన్ కాలంలో ఆయన జగన్ పాలనపై తీవ్రమైన విమర్శలు చేస్తూ చేసిన వీడియోలు చాలా పాపులర్ అయ్యాయి. వాటిని చూసిన టీవీ 5, ఏ బి ఎన్ ఆంధ్రజ్యోతి చానళ్లు డిబేట్లకు ఆహ్వానించాయి. అలాగే పలు యూట్యూబ్ చానళ్లు ఆయన వీడియోలు పెట్టుకున్నాయి. ఆయన ఫేస్బుక్ బాగా పాపులర్ అయ్యింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆయనను పిలిచి 2020 లో రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు. ప్రస్తుతం ఆయన అధికార పార్టీ నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసి పాపులర్ అయ్యారు.



ఆయనకు జనతా పార్టీ నేతలు పి బాబుల్ రెడ్డి, ఎస్ జయపాల్ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే సి కె బాబు, మాజీ మంత్రులు రెడ్డివారి  చెంగా రెడ్డి, గల్లా అరుణకుమారి, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో రాజకీయ సాన్నిహిత్యం ఉంది.

కొసమెరుపు :

ఆయన తండ్రి ఎన్ బాలి రెడ్డి, భార్య నల్లమిల్లి రాధ చార్వకాని పల్లె సర్పాంచిలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కుమారుడు ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డి జూనియర్ ఛాంబర్ ఇంటర్ నేషనల్ జాతీయ డైరెక్టర్ గా ఉన్నారు. పెద్దన్న ఎన్ బి మునిరత్నం రెడ్డి ఎం. వెంకయ్య నాయుడు సహ విద్యార్థి, విద్యార్థి పరిషత్ కార్యకర్త రెండవ అన్న ఎన్ బి సుబ్రమణ్యం రెడ్డి చిత్తూరులో ఉన్నారు. అన్న దమ్ములు ముగ్గురు పెనుమూరు ఉన్నత పాటశాల స్కూల్ పీపుల్స్ లీడర్ ( ఎస్ పి ఎల్ ) గా ఉన్నారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *