చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిని ప్రైవేటుపరం చేస్తారా?
సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్. నాగరాజు అనుమానం
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా
జిల్లా కేంద్రంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వమే కొనసాగించాలని, ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యం అందించాలని, చిత్తూరు ఆసుపత్రిలో అన్నీ విభాగాలకు ప్రభుత్వానికి సంబంధించి నైపుణ్యం కలిగిన డాక్టర్లను, టెక్నీషియన్స్, సిస్టర్లను, ఆస్పత్రి స్థాయికి తగ్గ సిబ్బందిని నియమించాలని కోరుతూ సిపిఐ నగర కార్యదర్శి వి.సి. గోపీనాథ్ నాయకత్వం శనివారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్.నాగరాజు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిరుపేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడo కోసం గత ప్రభుత్వం అపోలో యాజమాన్యానికి ప్రభుత్వ ఆసుపత్రిని 33 సంవత్సరాలకు లీజుకు ఇస్తే , ఆసుపత్రికి చుట్టుపక్కల మండలాల నుండి వైద్యం కోసం వస్తున్న పేషంట్లకు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వస్తున్న పేషెంట్లకు చిన్న జబ్బు అయినా, పెద్ద జబ్బు అయినా ఆస్పత్రిలోనే పరీక్షలు చేయకపోగా ప్రైవేట్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారని ఈ ఈ విధానం సరైనది కాదని వాపోయారు. మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో సంస్థకు లీజుకు అప్పజెప్పితే సరైన వైద్యం అందక పేషెంట్లు వారి కుటుంబాలు ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన చెందుతున్నారు. పేరు ప్రఖ్యాతిగాంచిన అపోలో ఆసుపత్రిలో ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్లకు పరీక్షలన్నీ బయట చేసుకొని రమ్మనడం శోచనీయమన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన డాక్టర్లు, టెక్నీషియన్లు, సిస్టర్లతో పాటు ఆస్పత్రి స్థాయికి తగ్గ సిబ్బంది లేకపోవడంతో పేషెంట్లకు తీరని అన్యాయం జరుగుతుందని తీవ్రంగా విమర్శించారు.
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తిగా తొలగించి ప్రైవేటు కార్పొరేట్ వ్యక్తులకు అప్పజెప్పడానికి ప్రయత్నం జరుగుతున్నట్లు అనుమానాన్ని వ్యక్తపరిచారు. ప్రభుత్వం చిత్తూర్ ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పితే నిరుపేద ప్రజలు, సామాన్య ప్రజలు వైద్యం చేసుకోలేని పరిస్థితి వస్తుందని దుయ్యాపట్టారు. ఓ పి టికెట్టు నుండి అన్ని పరీక్షలతో పాటు బెడ్ చార్జీలు కూడా వసూలు చేసే ప్రమాదం ఉందని వాపోయారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి లేకపోవడం దురదృష్టకరమన్నారు. చిత్తూరు జిల్లా విభజన తర్వాత జిల్లా కేంద్రంలో ప్రభుత్వాసుపత్రి లేకపోతే ఇది ప్రభుత్వానికే అవమానం అన్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి లేకపోతే నిరుపేదలు చికిత్స చేయించుకునే స్తోమత లేక ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన చీఫ్ సెక్రటరీ , ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ ముఖ్య కార్యదర్శి చిత్తూరు జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని తరలించకుండా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని, అన్ని విభాగాలకు నైపుణ్యం కలిగిన బాధ్యతాయుతమైన ప్రభుత్వానికి సంబంధించిన డాక్టర్లను, సిస్టర్లను, టెక్నీషియన్లను, ఆస్పత్రి స్థాయికి తగ్గ శానిటేషన్ సిబ్బందిని నియమించే వరకు అఖిలపక్ష పార్టీలను, ప్రజాసంఘాలను, కార్మిక సంఘాలను, విద్యార్థులను సమీకరించి ఉద్యమం చేపట్టనున్నట్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ధర్నా కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వి.సి.గోపీనాథ్, పార్టీ సీనియర్ నాయకులు కే.మని, పార్టీ జిల్లా నాయకులు దాసరి చంద్ర, బి.ఆరుముగం రెడ్డి, కే.రమాదేవి, పి .రఘు, పి గజేంద్రబాబు, హెచ్. బాలాజీ రావు, లతా రెడ్డి, శ్యామల, ఎస్. రమేష్ బాబు, కే. చంద్రయ్య, చాంద్ బాషా, తిరువంగడం, ఎన్.చిట్టెమ్మ శంషాద్ బేగం, బషీర్ తదితరులు పాల్గొన్నారు.