తిరుపతి నుండి పవన్ కళ్యాణ్ పోటీ !
రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తిరుపతి నుంచి జనసేనని పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా పవన్ కళ్యాణ్ కు ప్రతిపాదించినట్లు సమాచారం. కుప్పం నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పోటీ చేయనున్నారు. అలాగే తిరుపతి నుంచి జనసేనని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే చిత్తూరు జిల్లాలో మంచి జోష్ వస్తుందని భావిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో పట్టు నిలుపుకోవడమే కాకుండా, రాయలసీమలో బలిజ సామాజిక ఓట్లను దండుకోవచ్చని తెలుగుదేశం పార్టీ నేతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం.
సాధారణంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికలలో తెలుగుదేశానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 9 సాధారణ ఎన్నికలు, మూడు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఏడు సార్లు విజయకేతనం ఎగురవేశారు. గత ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణమ్మ స్వల్ప తేడాతో ఓడిపోయారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో తిరుపతి టికెట్ కు భారీ పోటీ ఉంది. ఈ పర్యాయం బలిజ సామాజిక వర్గాల నుంచి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మరో మాజీ ఎమ్మెల్యే మోహన్, కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఊకా విజయ్ కుమార్, డాక్టర్ కోడూరి బాలసుబ్రమణ్యం, జే బి శ్రీనివాస్ రేసులో ఉన్నారు.
బీసీ సామాజిక వర్గం నుంచి తుడా చైర్మన్ గా పనిచేసిన నరసింహ యాదవ్ టికెట్ ఆశిస్తున్నారు. ఆయన తిరుపతి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పార్టీ కార్యక్రమాలు ముందుండి నడుపుతూ, పార్టీకి అండదండగా అంటున్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి సీనియర్ నాయకుడు సూరా సుధాకర్ రెడ్డి రేసులో ఉన్నారు. ఆయన పార్టీ ప్రారంభం నుంచి పార్టీలో జిల్లా కార్యదర్శి, జిల్లా ఉపాధ్యక్షుడు పోస్టులను నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా, పీలేరు నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. గతంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ సభ్యునిగా పనిచేశారు. ఆయనకు కళాశాల రోజుల నుంచి పార్టీ అధినేత చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయనతోపాటు టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళి కృష్ణారెడ్డి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే మబ్బు దేవ నారాయణ రెడ్డి కూడా టికెట్ రేసులో ఉన్నారు. మబ్బు దేవ నారాయణ రెడ్డి తండ్రి మున్సిపల్ చైర్మన్ గా, రెండు పర్యాయాలు తిరుపతి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మబ్బు దేవనారాయణరెడ్డి ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శి హోదాలో గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. ఆయనతోపాటు రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ బి సుధాకర్ రెడ్డి కూడా ఒక దశలో తిరుపతి టికెట్ ఆశించారు.
ఇక జనసేన నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హరి ప్రసాద్, రాష్ట్ర అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ టికెట్ ని ఆశిస్తున్నారు. దీంతో తిరుపతి టికెట్ ను జనసేనకు కేటాయిస్తే అక్కడి తెలుగుదేశం వర్గాలు మనస్ఫూర్తిగా జనసేనకు పనిచేసే అవకాశాలు కనబడటం లేదు. ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేయడానికి కొందరు టిడిపి నాయకులు సమాయత్తమవుతున్నారు. పోనీ, టిక్కెట్టును తెలుగు దేశానికి కేటాయిస్తే, జనసేనకు చెందిన నాయకులు పూర్తిగా సహకారమందిస్తారనేది సందేహమే.
ఇది ఇలా ఉండగా తెలుగుదేశం పార్టీలో కూడా కులాల కుంపట్లు రాసుకుంటున్నాయి. బలిజ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే యాదవ, రెడ్డి సామాజిక వర్గాలు మనస్ఫూర్తిగా పనిచేసే పరిస్థితులు కనిపించడం లేదు. బీసీలకు ఇస్తే బలిజ, రెడ్డి సామాజిక వర్గాలు, రెడ్డికి ఇస్తే బలిజ, బీసీ సామాజిక వర్గాలు పనిచేస్తాయన్న నమ్మకం లేదు. కావున వయా మీడియాగా ఈ స్థానం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఎటువంటి సమస్య ఉండదని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను చంద్రబాబు స్వయంగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందు ఉంచినట్లు సమాచారం. గతంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో ఎన్టీ రామారావు, ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ సమయంలో ఆ పార్టీ అధినేత చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే.