టిడిపిలో అశాంతి లేపిన ప్రశాంత్ కిషోర్
అపర చాణక్యుడు, రాజకీయ దురంధరుడు, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను వ్యుహకర్తగా నియమించనున్నారు అనే వార్త తెదేపా వర్గాలలో అందోళన కలిగిస్తోంది. 45 ఏళ్ళ రాజకీయ జీవితం, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడుగా అనుభవం ఉన్న చంద్రబాబు ప్రశాంత్ కోశోర్ ను ఆశ్రయించడం తెదేపా నాయకులకు, కార్యకర్తలకు మింగుడు పడటంలేదు. ఈ కలయిక చంద్రబాబు స్థాయిని తగ్గిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే తెదేపా కోసం రాభిన్ శర్మ గ్రూప్ పనిచేస్తుంది. వీరు కాకుండా, చంద్రబాబు ఒక టీంను, లోకేష్ మరో టీంను ఏర్పాటు చేసుకున్నారు. పార్టీలో ఈ నిర్ణయం తీసుకోవాలన్నా, మూడు నివేదికలకు బేరీజు వేసుకుంటారు. వీటిని కూడా పక్కన పెట్టి ఈ మధ్య రాజకీయ ప్రతిపాదనలకు, వత్తిళ్ళకు, ధనకాంక్షకు లోనై నిర్ణయాలు తీసుకుంటున్నారని కొందరు బాహాటంగా విమర్శిస్తున్నారు. జిల్లాలో జరిగిన కొంత మంది ఇన్చార్జిల నియామకం ఇందుకు సాక్షంగా నిలుస్తుంది.
ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ వినాశనానికి కారకుడుని ఇప్పటి వరకు టిడిపి శ్రేణులు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. జగన్ నవరత్నాల పేరుతో నవ మోసాలు చేయడం వెనుక ప్రశాంత్ కీలక పాత్ర పోషించారని దుయ్యపట్టాయి. కోతి కత్తి డ్రామా, బాబాయ్ హత్యలకు ఆయనే సూత్ర దారి అంటూ ఆరోపణలు చేశాయి. సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఎపి అప్పుల కుప్పగా మారి, వెనుజులా, శ్రీలంక దేశాల్లా మారుతుందని టిడిపి నేతలు శాపనార్థాలు పెట్టారు. రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ది పొందారని విమర్శలు సంధించారు.
45 ఏళ్ళ రాజకీయ జీవితం,14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడుగా అనుభవం ఉన్న చంద్రబాబు, అడ్డదారుల వ్యూహ కర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్ పై ఆధార పడటం చూసి రాజకీయ పరిశీలకులు ముక్కున వేలేసుకున్నారు. దుర్యోధననుడు, శకునిని పక్కన పెట్టుకున్నట్లు ఉందని కొందరు హేళన చేస్తున్నారు. జగనే ప్రశాంత్ కిషోర్ ను బాబు పంచకు చేర్చి ఉంటారన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీనికి పలు కారణాలు చెపుతున్నారు. ప్రశాంత్ కిషోర్ బిజెపి నేత సీఎం రమేష్ సమకూర్చిన ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చారు. ప్రశాంత్ కిషోర్ కనుసన్నల్లో పనిచేస్తున్న ఐ ప్యాక్ ఇప్పటికీ జగన్ కోసం పని చేస్తున్నది. గతంలో వ్యూహకర్తగా పనిచేయనని చెప్పిన ప్రశాంత్ అనూహ్యంగా చంద్రబాబును కలిశారు. మూడు గంటలు చర్చించారు. చంద్రబాబు బలహీనతలు, భయాలు, లోపాలను తెలుసుకున్నారు.ఈ నేపథ్యంలో పరోక్షంగా జగన్ హస్తం ఉందనే వారు ఉన్నారు.
కాగా పవన్ కళ్యాణ్ కలవడం వల్ల టిడిపి అధికారంలోకి వచ్చిందన్న కీర్తి పవన్ కు దక్క కుండా చేయడానికి ప్రశాంత్ ను పిలిపించారని కొందరు అంటున్నారు. ఇన్నాళ్లు విమర్శించిన ప్రశాంత్ కిషోర్ పై ఆధారపడటం తగదని పలువురు టిడిపి కార్యకర్తలు, అభిమానులు హితవు పలుకుతున్నారు. శనివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ప్రశాంత్ కిషోర్ వచ్చారు. నాలుగు నెలల తరువాత జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించాలంటూ చంద్రబాబు, నారా లోకేష్ అభ్యర్థన మేరకు విజయవాడకు వచ్చారు. కరకట్ట నివాసంలో వారితో సమావేశం అయ్యారు. వారిద్దరి మధ్య సుమారు మూడు గంటలకు పైగా సమావేశం సాగింది. ప్రశాంత్ కిశోర్ విజయవాడ రావడానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సీఎం రమేష్ ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. రిత్విక్ గ్రీన్ పవర్ అండ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ప్రత్యేక విమానంలో ఆయన విజయవాడలో అడుగుపెట్టారు.
ప్రశాంత్ కిశోర్‌తో పాటు నారా లోకేష్, శంతను సింగ్, టీడీపీ నేత కిలారు రాజేష్, ఎం శ్రీకాంత్ ఈ విమానంలో వచ్చారు. తొలినుంచి ప్రశాంత్ కిషోర్ ను టిడిపి నేతలు,కార్యకర్తలు విమర్శిస్తున్నారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు చంద్రబాబు, ఇంటికి ఆహ్వానించడం, తనయుడు లోకేష్ కూడా రావడం హాట్ టాపిక్ గా మారింది. సీఎం రమేష్ తన పలుకుబడిని ఉపయోగించి ప్రశాంత్ కిశోర్‌ను చంద్రబాబు ఇంటికి తీసుకుని వచ్చారని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. బీజేపీనేత అయివుండీ చంద్రబాబు కోసం సీఎం రమేష్ కష్టపడుతున్నాడని, తన సొంత పార్టీని అధికారంలోకి తీసుకుని రావడానికి బదులుగా టీడీపీ కోసం పని చేస్తోన్నాడనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఇది బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరికి తెలియకుండా జరిగి ఉండదని వైసీపీ నాయకులు చెబుతున్నారు.
అయితే ప్రశాంత్ కిషోర్ కేవలం సీనియర్ నేత అయిన చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశానని అసలు విషయాలు వెల్లడించకుండా జాగ్రత్త పడ్డారు. టిడిపి వ్యూహ కర్త రాబిన్ శర్మ బృందం కోసం ఇప్పటి వరకు కోట్లు ఖర్చు చేసింది. బాదుడే బాదుడు, భవిష్యత్తుకు బాబు బరోసా, సూపర్ సిక్స్ హామీలు, దొంగ ఓటర్ల పరిశీలన లాంటి కార్యక్రమాలను రాబిన్ శర్మ బృందం రూపకల్పన చేశారు. అలాగే లోకేష్ యువ గళం పాదయాత్ర ప్రారంభం నుంచి ముగింపు వరకు రాబిన్ శర్మ బృందం దగ్గర ఉండి నడిపించింది. లోకేష్ కు ఉపన్యాస పాఠాలు నేర్పించి ప్రచారం కల్పించారు. అయితే హఠాత్తుగా ప్రశాంత్ రావడం రాబిన్ శర్మ కు కూడా మింగుడు పడటం లేదంటున్నారు. అనుభవజ్ఞుడు, అభివృద్ది కాముకుడు అని చెప్పుకునే చంద్రబాబు పప్పులో కాలు వేసి, తప్పు చేశారని పలువురు భావిస్తున్నారు. ఈ వ్యవహారం జనసేన వర్గాలలో కూడా కొందరికి మింగుడు పడటం లేదు.